కర్షకులకు కిసాన్‌ కార్డులు

ABN , First Publish Date - 2022-05-02T05:30:00+05:30 IST

రైతు సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే వివిధ రకాల పథకాలతో రైతులకు చేరువ కాగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులలో నిబంధనలను సడలించింది.

కర్షకులకు కిసాన్‌ కార్డులు
కిసాన్‌ క్రెడిట్‌ కార్డులపై అవగాహన కల్పిస్తున్న బ్యాంక్‌ అధికారులు

- భూ విస్తీర్ణాన్నిబట్టి బ్యాంకు రుణం

- రైతులకు బహుళ ప్రయోజనం

- అవగాహన కల్పిస్తున్న అధికారులు

కామారెడ్డి, మే 2: రైతు సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే వివిధ రకాల పథకాలతో రైతులకు చేరువ కాగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులలో నిబంధనలను సడలించింది. దీంతో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.6వేల పెట్టుబడి సాయం పొందుతున్న వారంతా కిసాన్‌కార్డుకు అర్హులు. గతంలో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకే పీఎం కిసాన్‌ సమ్మాన్‌నిధి ఆర్థిక సాయం అందింది. సడలింపులతో జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. కిసాన్‌కార్డుల మంజూరుకు ఏప్రిల్‌ 24 నుంచి మే 1 వరకు బ్యాంకులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాయి.

రైతులు అప్రమత్తమైతే సరి

బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా రైతులు స్వల్పకాలిక ఉత్పత్తులను సాధించడం కోసం అవసరమయ్యే పనిముట్లు, తదితర అవసరాలకు కావాల్సిన మొత్తాన్ని సరైన సమయాల్లో అందించడమే కిసాన్‌క్రెడిట్‌ కార్డు ముఖ్యఉద్దేశ్యం. జిల్లాలో 2లక్షల 43వేల 760 మంది రైతులు ఉన్నారు. వీరిలో కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉన్నవారికి భవిష్యత్‌లో రూపేకార్డులను అందించే అవకాశాలున్నాయి. దీంతో అదనంగా రూ.50వేల నుంచి రూ.1లక్ష వరకు రుణం పొందొచ్చు. కార్డుతో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయొచ్చు. తీసుకున్న రుణం 45 రోజుల్లోపు చెల్లిస్తే వడ్డీ కూడా తీసుకోరని, కార్డు ఉన్నవాళ్లందరికీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అమలు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వ్యవసాయభూమి ఉండి 18 నుంచి 70 ఏళ్లలోపు వయస్సు ఉన్న రైతులు ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులను సంప్రదించి కార్డు పొందొచ్చు. కిసాన్‌ క్రెడిట్‌కార్డు ఉన్న రైతులు ఎలాంటి తనఖా లేకుండానే రూ.1.6లక్షల వరకు రుణం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ స్కీం కింద అర్హులైన రైతులకు 4 శాతం వడ్డీకే రుణాలు అందజేస్తారు. మొత్తం పావలా వడ్డే పడుతుంది. గడువులోగా చెల్లిస్తే 4 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి. లేదంటే 7 శాతం వడ్డీ పడుతుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రుణాలు ఇస్తారు. సరళీకృతమైన రుణ  పంపిణీ విధానం, డబ్బుల గురించి రైతులు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. ప్రతీ పంటకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల పాటు రుణ సౌకర్యం, వ్యవసాయ ఆదాయాన్ని బట్టి గరిష్ట రుణ పరిమితితో పాటు పంటకోత అయ్యాకే రుణాన్ని తిరిగి చెల్లించే సదుపాయం, వ్యవసాయ అడ్వాన్సుకు వర్తించే వడ్డీ రేటే దీనికి వర్తిస్తోంది.

దరఖాస్తు విధానం ఇలా..

జాతీయ బ్యాంకులో, ఆన్‌లైన్‌లో కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకుని దానిని పూర్తిచేయాలి. చిరునామా, ఇతర గుర్తింపుకార్డు నకళ్లను బ్యాంకు అధికారులకు అందజేయాలి. పంటరుణం పొందే బ్యాంకు పాసుపుస్తకం/పీఎం కిసాన్‌ డబ్బులు పడిన పాస్‌బుక్‌, వ్యవసాయభూమి పాసుపుస్తకం, ఆధార్‌కార్డు తప్పనిసరి. సమీప పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంకు నుంచి కూడా కార్డు పొందవచ్చు. అర్హత గల ప్రతీ రైతుకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు అందజేస్తారు.

Read more