కిన్నెరకు వన్నె!

ABN , First Publish Date - 2022-01-26T09:15:11+05:30 IST

అవాసంగా చిన్న రేకుల ఇల్లు.. అందులో 10 మంది కుటుంబసభ్యులతో తను! పూట గడిచేందుకూ తిప్పలు..

కిన్నెరకు వన్నె!

  • ఏళ్ల క్రితం పొట్ట చేతపట్టుకొని పట్నానికి
  • పది మంది కుటుంబసభ్యులతో చిన్నింట్లో  
  • సాంఘిక శాస్త్రంలో పాఠంగా జీవన గమనం 
  • భీమ్లా నాయక్‌ పాటతో పాపులర్‌.. 


సైదాబాద్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): అవాసంగా చిన్న రేకుల ఇల్లు.. అందులో 10 మంది కుటుంబసభ్యులతో తను! పూట గడిచేందుకూ తిప్పలు.. భార్య చనిపోతే దహన సంస్కారానికీ ఇబ్బందులు! ఇన్ని సమస్యలను ఎదుర్కొంటూ అతికష్టమ్మీద తనింటిని ఆయన ఎలా నెట్టుకొస్తున్నారు? 500  ఏళ్ల నాటి అత్యంత అరుదైన కిన్నెర వాయిద్య పరిజ్ఞానాన్ని నమ్ముకొనే! ఇప్పుడదే ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది! ఆయనే దర్శనం మొగులయ్య (68)! స్వస్థలం నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలకుంట. గ్రామంలో బతుకుదెరువు కష్టమవడంతో ఎనిమిదేళ్ల క్రితం ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో కలిసి హైదరాబాద్‌కు వచ్చారాయన. సింగరేణి కాలనీ గుడిసెల్లో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. తాత, ముత్తాల నాటి నుంచి వంశపారంపర్యంగా కొనసాగిస్తున్న 12 మెట్ల కిన్నెర వాయిద్య కళనే మొగులయ్య నమ్ముకున్నారు. మొగులయ్య ఎనిమిదేళ్ల వయసులోనే కిన్నెర  సాధనను  మొదలు పెట్టారు.


ఊరూరా ప్రదర్శనలిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం భార్య శంకరమ్మ మృతి చెందగా దహనసంస్కారాలు చేసుకోలేని పరిస్థితితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండో కుమారుడు నరాల సంబంధిత వ్యాధితో ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. కిన్నెర వాయిద్య కళలో పరిజ్ఞానంతో ఆలస్యంగానైనా మొగులయ్యకు గుర్తింపునిచ్చింది. కొల్లాపూర్‌ నియోజకవర్గం పెద్దమడూరుకు చెందిన డాక్టర్‌ రంగయ్య పీహెచ్‌డీ కోర్సులో భాగంగా మొగులయ్య జీవితచరిత్రను ప్రచురించారు. ఫలితంగా.. మొగులయ్యను ప్రభుత్వం గుర్తించింది. ఉగాది పురస్కారంతో సన్మానించింది. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో మొగులయ్య జీవిత గమనాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. ఇక పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న భీమ్లా నాయక్‌ సినిమాలో టైటిల్‌ సాంగ్‌ను మొగలయ్యతో పాడించారు. దీంతో పేరు మారుమోగింది. మొగులయ్యకు పవన్‌ రూ.2 లక్షల సాయాన్ని అందజేశారు. 


ఆనందంగా ఉంది.. : మొగులయ్య

పద్మశీ అవార్డు రావడం  ఆనందంగా ఉంది. అవార్డుకు ఎంపికవుతానని  ఉహించలేదు. తెలంగాణ ప్రభుత్వం నన్ను ఎంతగానో అదరించింది. అంతరించిపోతున్న కిన్నెర వాయిద్య కళలను పరిరక్షించేందుకు ప్రభుత్వాలు మరింతగా ప్రోత్సహం అందించాలి.  కిన్నెర వాయిద్యాలను రూపొందించి కళాకారులను తయారుచేస్తా అని మొగులయ్య తెలిపారు.

Updated Date - 2022-01-26T09:15:11+05:30 IST