కింగ్‌కోఠి ప్యాలె‌స్‎లో కూల్చివేతలు?

ABN , First Publish Date - 2022-04-18T16:26:24+05:30 IST

కింగ్‌కోఠి ప్యాలెస్‌ కూల్చేస్తున్నారన్న వదంతులు దుమారం లేపాయి. శనివారం సాయంత్రం నుంచి ప్యాలె్‌సలోని ప్రధాన భవనాలను

కింగ్‌కోఠి ప్యాలె‌స్‎లో కూల్చివేతలు?

రెండు రోజుల్లో మొత్తం కూల్చేస్తారని ప్రచారం

చరిత్రకారుల ఆందోళన

వరల్డ్‌ హెరిటేజ్‌ డే ముందు రోజే కూల్చివేత ప్రచారం కలకలం

అనుమతుల్లేవ్‌ : అర్వింద్‌కుమార్‌


హైదరాబాద్‌ సిటీ/హిమాయత్‌నగర్‌:  కింగ్‌కోఠి ప్యాలెస్‌ కూల్చేస్తున్నారన్న వదంతులు దుమారం లేపాయి. శనివారం సాయంత్రం నుంచి ప్యాలె్‌సలోని ప్రధాన భవనాలను కూల్చేశారని, రెండు రోజుల్లో మొత్తం ప్యాలె్‌సను నేలమట్టం చేస్తారని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం కింగ్‌ కోఠి ప్యాలెస్‌ పరిసర ప్రాంతాలను సందర్శించింది. శనివారం రాత్రి నుంచి కూల్చేస్తున్నట్లుగా ప్యాలెస్‌ నుంచి శబ్ధాలు వచ్చాయా, లేవా అనే విషయాన్ని స్థానికుల వద్ద ఆరా తీసింది.  అలాంటివేవీ లేదని స్థానికులు తెలిపారు. ప్యాలె్‌సలోకి భారీ వాహనాలు, ఎక్స్‌కవేటర్లు వెళ్లిన ఆనవాళ్లు కూడా కనిపించలేదు. ప్యాలెస్‌లో పూర్తిగా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. పోలీసులు, మున్సిపల్‌ అధికారులు కూడా కూల్చివేతలు జరగలేదని తెలిపారు. సోమవారం అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం నేపథ్యంలో నగరంలో ప్రఖ్యాతి గాంచిన కింగ్‌ కోఠి ప్యాలె్‌సపై జరిగిన ప్రచారంపై చరిత్రకారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కూల్చివేతలు నిజమా, కాదా అని సంబంధిత అధికార్లకు ఫోన్లు చేసి వాకబు చేశారు.


ఘనమైన చరిత్ర

రాజకుటుంబానికి చెందిన కమాల్‌ ఖాన్‌ 1890వ దశకంలో  నజ్రీబాగ్‌ (నేటి కింగ్‌  కోఠి ప్యాలెస్‌) ను యూరోపియన్‌ శైలిలో నిర్మించారు. తర్వాత ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కోరిక మేరకు భవనాన్ని ఆయనకు అమ్మారని చరిత్ర అధ్యయనకారులు చెబుతారు. ప్యాలె్‌సలోకి అడుగుపెట్టే నాటికి ఏడో నిజాం వయసు పదమూడేళ్లు. తుదిశ్వాస విడిచే వరకూ ఆయన అదే మహల్‌లో ఉన్నారు. భవనం కిటికీలు, తలుపుల మీదున్న కేకే అక్షరాలు తొలగిస్తే నిర్మాణ అందం పోతుందని, కేకే అంటే ‘కింగ్‌ కోఠి‘ అని మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఫర్మానా జారీ చేసినట్టు చరిత్రకారులు చెబుతారు. ఈ భవనం తూర్పుభాగంలోని అప్పటి నిజాం అధికారిక కార్యాలయాల్లో ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. మరో ముఖ్య భవనమైన ఉస్మాన్‌ మెన్షన్‌ను 1980లో కూల్చి, అదే ప్రదేశంలో ప్రభుత్వ ఆస్పత్రి గదులు నిర్మించారు.


వివాదాల్లో ప్యాలెస్‌

కింగ్‌కోఠి ప్యాలెస్‌ ప్రస్తుతం వివాదాల్లో ఉంది. ఐదారేళ్ల క్రితమే నిజాం వారసుల నుంచి స్థలాన్ని తాము కొనుగోలు చేశామని మహారాష్ట్రకు చెందిన ఓ నిర్మాణ సంస్థ చెబుతోంది. ఆ సంస్థ నుంచి తాము కొనుగోలు చేశామని కశ్మీర్‌కు చెందిన మరో సంస్థ వాదిస్తోంది. తాజాగా ఇరు కంపెనీల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసులు నమోదు చేశారు. ప్యాలె్‌సతోపాటు దాని ఖాళీ స్థలం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించిన నేపథ్యంలో పక్క రాష్ట్రానికి చెందిన ప్రైవేట్‌ సంస్థ ఎలా దీన్ని హస్తగతం చేసుకుందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్యాలెస్‌ క్రయ, విక్రయాల్లో నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ప్యాలెస్‌ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తిగా పెద్దల కనుసన్నల్లో జరిగినట్లు సమాచారం. రిజిస్ర్టేషన్‌ విషయం ఐదారేళ్లుగా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే, హైదరాబాద్‌ చరిత్ర ఘనతను కళ్లకు కట్టే ఏడో నిజాం నివాస గృహాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని, కింగ్‌కోఠి ప్యాలెస్‌ అమ్మడానికి వారెవరు, కొనడానికి వీరెవ్వరూ.? అని చరిత్రకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అనుమతుల్లేవ్‌..

‘కింగ్‌కోఠి ప్యాలెస్‌ నోటిఫైడ్‌ చేసిన హెరిటేజ్‌ నిర్మాణం. జీహెచ్‌ఎంసీ నుంచి ముందస్తు అనుమతులు లేకుండా పునరుద్ధరణ, కూల్చివేతలు సాధ్యం కాదు.’ అని మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, స్పెషల్‌ సీఎస్‌ అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. ప్యాలెస్‌ సివిల్‌ వివాదంలో ఉందని, ఏదైనా కూల్చివేతలు జరిగితే సమాచారం ఇవ్వాలని ప్యాలెస్‌ చుట్టుపక్కలవారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. పోలీసుల నిఘాలో ఉందని వెల్లడించారు.

Updated Date - 2022-04-18T16:26:24+05:30 IST