భార‌త్‌లో 80 ఏళ్లలో వినాశకరమే.. సౌదీ యూనివర్సిటీ అధ్యయనం!

ABN , First Publish Date - 2020-06-06T14:05:46+05:30 IST

రాబోయే 80 ఏళ్లలో తీవ్రమైన ఎండలు, వడగాలులు, వరదలతో భారతదేశం వినాశకరమైన వాతావరణ మార్పులను ఎదుర్కోవల్సి ఉంటుందని సౌదీ అరేబియాలోని కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంది.

భార‌త్‌లో 80 ఏళ్లలో వినాశకరమే.. సౌదీ యూనివర్సిటీ అధ్యయనం!

వాతావరణ మార్పులపై కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ యూనివర్సిటీ అధ్యయనం

న్యూఢిల్లీ జూన్‌ 5: రాబోయే 80 ఏళ్లలో తీవ్రమైన ఎండలు, వడగాలులు, వరదలతో భారతదేశం వినాశకరమైన వాతావరణ మార్పులను ఎదుర్కోవల్సి ఉంటుందని సౌదీ అరేబియాలోని కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంది. ఈ మార్పుల ప్రభావం పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవనోపాధిపై భారీగా ఉంటుందని పేర్కొంది. ప్రొఫెసర్‌ మన్సూర్‌ అల్మజ్రౌయ్‌ నేతృత్వంలో సూపర్‌ కంప్యూటర్‌ను ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం 21వ శతాబ్దం చివరి నాటికి వార్షిక సగటు ఉష్ణోగ్రతలు 4.2 సెల్సియస్‌ డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం ముఖ్యంగా వాయవ్య భారతదేశంపై ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో అక్కడి మంచు వేగంగా కరుగుతుంది.


దీంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించే అవకాశం ఉంది. ఫలితంగా వ్యవసాయం, పర్యావరణం, ప్రజల జీవనోపాధి దెబ్బతింటాయి. మైదాన ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. గంగానది నీటిపారుదల మైదాన ప్రాంతాల్లో 1-3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ప్రస్తుతం హైడ్రోకార్బన్‌ వాయువులు పెద్ద ఎత్తున వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. దీని వల్ల వేసవి తరవాత వచ్చే రుతుపవనాలతో సగటు వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉంది. అయితే 21వ శతాబ్దం చివరి నాటికి వర్షపాతంలో పెరుగుదల కనిపిస్తుందని అధ్యయనం తెలిపింది. 


రికార్డు స్థాయిలో కార్బన్‌డయాక్సైడ్‌

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్‌ ఉద్గారాలు తగ్గిపోయాయి. కానీ కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయి మాత్రం వాతావరణంలో రికార్డు స్థాయిలో పెరిగింది. గత నెలలో హవాయిలోని మువానాలోవా వద్ద  కార్బన్‌ డయాక్సైడ్‌ 417.1 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌ (పీపీఎం) స్థాయికి చేరుకున్నట్లు అమెరికాకు చెందిన నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ర్టేషన్‌ గుర్తించింది. నిరుడు ఇదే సమయానికి నమోదైన స్థాయితో పోల్చితే ఇది 2.4 పీపీఎం భాగాలు ఎక్కువ. 1958 నుంచి రికార్డులను పరిశీలిస్తే గత 62 ఏళ్లలో కార్బన్‌డయాక్సైడ్‌ స్థాయి 31 శాతం పెరిగింది. 


జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రతినబూనుదాం: మోదీ

భావి తరాలకు సురక్షిత భూ మండలాన్ని అందించేందుకు కలిసికట్టుగా ప్రతినబూనుదామని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఘనమైన జీవ వైవిఽఽధ్య పరిరక్షణకు కట్టుబడి ఉందాం. భూమ్మీద మనతో కలిసి మనుగడ సాగిస్తున్న వృక్ష జంతుజాల మనుగడకు ఏం చేయగలమో అంతా చేద్దాం’ అని శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. కాగా, నిత్య జీవితంలో సమస్యలకు దీర్ఘకాల  పరిష్కారాలను కనుగొనాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలను అభ్యర్థించారు. పర్యావరణ సంక్షోభం దృష్ట్యా మనం తీసుకునే చర్యలు భూమిపై జీవ వైవిధ్యాన్ని కాపాడేలా ఉండాలని సూచించారు. 


Updated Date - 2020-06-06T14:05:46+05:30 IST