నివర్ తుఫాన్: మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల పరిహారం

ABN , First Publish Date - 2020-11-28T05:17:09+05:30 IST

నివర్ తుఫాన్ కారణంగా ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు...

నివర్ తుఫాన్: మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల పరిహారం

న్యూఢిల్లీ: నివర్ తుఫాన్ కారణంగా ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి రూ.50 వేల చెప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మోదీ తమిళనాడు సీఎం పళనిస్వామితో మాట్లాడిన అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఈ మేరకు వెల్లడించింది. బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపింది. సహాయక కార్యక్రమాల కోసం కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపుతున్నట్టు వెల్లడించింది. నివర్ తుఫాన్ కారణంగా తమిళనాడులో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించారు.


భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో  దాదాపు 2 వేలకు పైగా చెట్లు నేలకూలాయనీ, పెద్ద సంఖ్యలో పశువులు మేకలు మృత్యువాత పడ్డాయని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.3 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు. ‘‘తమిళనాడు సీఎం పళనిస్వామితో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక కార్యక్రమాల కోసం కేంద్ర బలగాలను తమిళనాడుకు పంపుతామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానూభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు..’’ అని పీఎంవో పేర్కొంది. 

Updated Date - 2020-11-28T05:17:09+05:30 IST