కిమ్‌.. పింగ్‌.. జగన్‌!

ABN , First Publish Date - 2022-07-11T07:51:17+05:30 IST

కిమ్‌.. పింగ్‌.. జగన్‌!

కిమ్‌.. పింగ్‌.. జగన్‌!

‘శాశ్వత’ అధ్యక్షులుగా వారు.. మన దగ్గర చెల్లేదెలా?

ఉత్తర కొరియా, చైనా అంటే దేశాలు

ఆంధ్ర.. భారత్‌లో ఓ రాష్ట్రం మాత్రమే

ప్రజాస్వామ్య రక్షణకు మనకో చట్టం 

నిర్దిష్ట ఎన్నికల నియమావళీ ఉంది

ప్రతి రాజకీయ పార్టీ పాటించాల్సిందే

అధ్యక్షుడు, ఆఫీసు బేరర్లు ఐదేళ్లలోపు సంస్థాగతంగా ఎన్నిక కావలసిందే!

ఎన్నికలేవీ లేకుండా శాశ్వతంగా అధ్యక్షుడిగా ఉండడం కుదరదు

పలు దేశాల్లో దీర్ఘకాలం పనిచేసిన వారంతా ఎన్నికైనవారే

తానే శాశ్వతమనుకున్న ఈడీ అమీన్‌ ఉగాండా వదిలి పారిపోయారు

ఇండొనేసియాలో సుకర్ణో పతనం


నియంతలు మాత్రమే రాజ్యమేలే దేశాల్లో పార్టీలకు శాశ్వత అధ్యక్షులు ఉన్నారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఆ విధానం లేదు. అన్ని రాష్ట్రాలకూ కలిపి ఒకే ప్రజాప్రాతినిధ్య చట్టం. దాని అమలుకు నిర్దిష్ట నియమావళి ఉంది. అది ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్మోహన్‌రెడ్డికీ వర్తిస్తుంది. ఆ రూల్స్‌ ప్రకారం ఏ పార్టీకీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చెల్లుబాటు కాదని నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్లకో, ఇంకా ముందుగానో ప్రతి పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి.. అధ్యక్షుడు, ఇతర పదాధికారులను ఎన్నుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి తేల్చిచెబుతోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కిమ్‌.. పింగ్‌.. జగన్‌.. ఈ పేర్లకు ఇప్పుడో సారూప్యత వచ్చింది. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌-ఉన్‌, చైనా అధ్యకుడు జీ జిన్‌పింగ్‌, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వారి పార్టీలకు శాశ్వత అధ్యక్షులు. కిమ్‌, జిన్‌పింగ్‌ తమ దేశాల కమ్యూనిస్టు పార్టీల కమిటీలకు ప్రధాన కార్యదర్శులు. ఆ పార్టీలకు అధ్యక్షుల విధానం లేదు. వైసీపీకి జగన్‌ అధ్యక్షుడు. ప్రపంచంలో రాజకీయ పార్టీలకు శాశ్వత అధ్యక్షులుగా ప్రకటించుకున్నది ఈ ముగ్గురే. వీరికి ముందు రాజుల కాలంలో 1818 నుంచి 1980 వరకు ఓ 15 మంది హేమాహేమీలు.. నెపోలియన్‌, అడాల్ఫ్‌ హిట్లర్‌, సుకర్ణో, ఈడీ అమీన్‌ వంటి వారు పార్టీలతోపాటు ప్రభుత్వాలకు శాశ్వత అధ్యక్షులుగా ప్రకటించుకున్నవారే. ఆధునిక యుగంలో ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పార్టీ శాశ్వత అధ్యక్షుల జాబితాలో జగన్‌ చేరిపోయారు. కానీ ప్రజాస్వామ్యంలో శాశ్వత అధ్యక్షుల విధానం అమలయిన దాఖలాయే లేదు.


ఎన్నికల కమిషన్‌ ఏమంటోంది..? 

‘నేను మాత్రమే నిజం.. మిగతావన్నీ భ్రమలు’ అన్న గోబెల్స్‌ స్కూల్‌ సిలబ్‌సను తెర పైకి తెచ్చిన జగన్మోహన్‌రెడ్డి.. పార్టీ అధ్యక్షుడిగా తానే శాశ్వతమని అధికార ముద్ర వేయించుకున్నారు. కానీ అది చెల్లుబాటు కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ జగన్‌ సొంత పార్టీ. శాశ్వత అధ్యక్షుడిగా ఉంటే తప్పేంటి.. ఎవరికి కష్టం.. నష్టం అన్న ప్రశ్నలు రావొచ్చు. అయితే రాజకీయ పార్టీ అంటేనే ప్రజాస్వామిక వేదిక. ప్రజల గొంతును వినిపించే రాజకీయ వేదిక. అందులో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఆ పార్టీకి గుండెకాయ. ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా దేశంలో ప్రజాప్రాతినిఽధ్య చట్టం(1951) తీసుకొచ్చారు. నియంతృత్వ పోకడలకు తావులేకుండా ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా రాజకీయ పార్టీ, దాని ఆఫీస్‌ బేరర్లు (అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వగైరా) ఉండాలని.. ప్రతి ఐదేళ్లు, అంతకుముందే ఎన్నికల ద్వారా అధ్యక్షుడిని, ఇతర పదాధికారులను ఎన్నుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రవర్తనా నియమావళి స్పష్టం చేస్తోంది. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న బీజేపీ.. రాష్ట్రంలో పాలిస్తున్న వైసీపీ దాకా ఆ నియమావళిని పాటించి తీరాలని అందులోని సెక్షన్‌ 5 చెబుతోంది. రాజకీయ పార్టీలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా కొన్ని అంశాలపై ఈసీ స్పష్టత కోరుతుంది. 13వ ఆప్షన్‌లో రెండో సబ్‌క్లాజు కింద ‘ఆఫీస్‌ బేరర్స్‌ కోసం ఎన్నికలు నిర్వహిస్తుంటారా.. లేదా? పార్టీలో అన్ని పదవులకు ఐదేళ్లకోసారయినా ఎన్నికలు నిర్వహిస్తుందా.. లేదా  ప్రశ్నలకు బదులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 29 ప్రకారం ఈ నియమావళిని జారీ చేశారు. భారత దేశం అంటేనే ప్రజాస్వామిక, లౌకికవాద దేశమని.. పార్టీలు దానికిలోబడే పనిచేసేలా ఈ చట్టం తీసుకొచ్చారు. పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తూ నియంతృత్వాన్ని పెంచి పోషించకుండా అడ్డుకునేందుకే ఆఫీస్‌ బేరర్లను ఎన్నికల ద్వారా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నుకోవాలన్న నిబంధన చేర్చారు. అయితే వైసీపీకి జగన్‌ శాశ్వత అధ్యక్షుడంటూ ఆ పార్టీ చేసుకున్న తీర్మానం చట్టబద్ధంగా చెల్లదని విశ్లేషకులు చెబుతున్నారు. అంతా తమ ఇష్టం.. ప్రశ్నించేవారెవరనుకుంటే.. ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన కింద చర్యలు గట్టిగానే ఉంటాయని చరిత్ర చెబుతోంది. లేదు.. తామనుకున్నదే సాగాలంటే జగన్‌ శాశ్వత అధ్యక్షుడిగా ఉండేలా ప్రజాప్రాతినిధ్య చట్టం, దాని రూల్స్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది.


వారితో పోల్చుకుంటే..

బతికున్నంత కాలం అంటే శాశ్వతంగా తానే రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటానంటూ ప్రకటించుకున్న వారిలో జగన్‌ ఒకరు. ఆ జాబితాలో ఎంతో మంది నియంతలు, కరుడుగట్టిన నియంతృత్వ పాలకులున్నారు. ప్రస్తుతం ఆదునిక ప్రపంచంలో ఉత్తరకొరియా వర్కర్స్‌ పార్టీ అధ్యక్షుడు కిమ్‌ తానే శాశ్వత పార్టీ ప్రధాన కార్యద ర్శినని 2016లో ప్రకటించుకున్నారు. 2018లో తనకు ఎదురు ఉండకూడదనే జాతీయ డిఫెన్స్‌ కమిషన్‌ను తీసేసి స్టేట్‌ అఫైర్స్‌ కమిషన్‌గా మార్చారు. దానికి ఆయనే చైర్మన్‌. ఇక ఆ దేశ పాలనాధ్యక్షుడు కూడా ఆయనే. ఆ తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జిన్‌పింగ్‌ తాను శాశ్వతంగా పదవిలో ఉంటానని ప్రకటించుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగినంతకాలం దేశాధ్యక్షుడిగా ఉంటాననని, ఈ మేరకు పార్టీ నియమావళిలో మార్పులు చేయించారు. ఆ తర్వాత అంతటి ఘనమైన నిర్ణయం తీసుకున్నది వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే. ఈ మేరకు వైసీపీ రాజ్యాంగాన్ని మార్చుకున్నారు. జీవితకాల పోస్టు విషయంలో కిమ్‌, జిన్‌పింగ్‌ల నిర్ణయాలు చెల్లుబాటు కావొచ్చు. ఎందుకంటే వారు దేశాధ్యక్షులు. కానీ జగన్‌ వారిలా దేశాధ్యక్షుడు కాదు. సమాఖ్య వ్యవస్థలో ఓ రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీకి అధ్యక్షుడు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈసీ ఇచ్చిన నియమావళిని ఆయన పాటించాల్సిందే. 


నియంత పోకడలే..

నియంతలుగా వ్యవహరించిన వారే పార్టీలు, ప్రభుత్వాలకు శాశ్వత అధ్యక్షులుగా ఉంటామని ప్రకటించుకున్నారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. తమను ఎవరూ ప్రశ్నించకూడదని, రాజకీయంగా ఎదురు ఉండకూడదనే పార్టీలు, ప్రభుత్వాలకు శాశ్వత అధినేతలుగా ప్రకటించుకున్నారు. వారిలో కొందరు..

టొస్సేనెంట్‌ లోవర్చర్‌.. ఫ్రెంచ్‌ రాజ్యంలో 1801లో సెయింట్‌ డొమినిక్‌కు శాశ్వత గవర్నర్‌గా ప్రకటించుకున్నారు. సరిగ్గా ఏడాదిలోనే దించేశారు. అదే ఏడాది మరణించారు.

హైతీలో హెన్నీ క్రిస్టోఫో 1807లో శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. 1811లో దిగిపోయారు. హైతీలోనే అలగ్జాండర్‌ పీటియన్‌ 1816లో పీఠమెక్కి 1818లో దిగిపోయారు.

మెక్సికోలో ఆంటోనియో లోపెజ్‌ డి సాంటా అన్నా అనే పెద్ద మనిషి 1853లో పీఠమెక్కి.. తానే శాశ్వతమని ప్రకటించుకుని 1855లో దిగిపోవలసి వచ్చింది.

ఇండొనేసియా స్వాతంత్య్రం కోసం పోరాడి సాధించిన సుకర్ణో సైతం 1963లో శాశ్వత అధ్యక్షుడిని తానేనని ప్రకటించుకున్నారు. 1967లో సైనిక తిరుగుబాటుతో పదవీచ్యుతులయ్యారు. 1970లో చనిపోయేవరకు గృహనిర్బంధంలోనే ఉన్నారు.

ఘనా దేశంలో 1964లో క్వామే నిక్రూమా అధ్యక్షులయ్యారు. రెండేళ్లకే దిగిపోయారు.

ఈడీ అమీన్‌.. ఉగాండాలో సైనిక తిరుగుబాటు చేసి 1976లో అధ్యక్షుడయ్యారు. అమెరికానే గడగడలాడించాడు. తర్వాత శాశ్వత అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. 1979లో జనం తిరుగుబాటుతో లిబియాకు, ఇరాక్‌కు పారిపోయారు. చివరకు సౌదీ అరేబియాలో ప్రవాస జీవితం గడిపి 2003లో అక్కడే కన్నుమూశారు. ప్రపంచంలోనే అతిపెద్ద నియంత అన్న పేరు ఇతనికి ఉంది. వీరేకాదు.. నెపోలియన్‌ (ఫ్రాన్స్‌), అడాల్ఫ్‌ హిట్లర్‌ వంటి వారు కూడా తమను తాము శాశ్వత అధ్యక్షులుగా ప్రకటించుకున్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో ఉత్తరకొరియా, ఛైనాలోనే శాశ్వత అధ్యక్షుల విధానం ఉంది.


సుదీర్ఘ కాలం పనిచేసిన నేతల కథ వేరు..

ప్రపంచంలో సుదీర్ఘకాలం పార్టీకి, ప్రభుత్వాలకు అధ్యక్షులుగా పనిచేసిన వారు లేరా అంటే.. ఉన్నారు. క్యూబాలో ఫిడేల్‌ క్యాస్ట్రో, రష్యాలో స్టాలిన్‌, చైనాలో మావో జెడాంగ్‌ వంటి వారు పనిచేశారు. క్యాస్ట్రో క్యూబా కమ్యూనిస్టు పార్టీకి 48 ఏళ్లు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. స్టాలిన్‌, మావో వంటి వారు  తాము శాశ్వతమని ప్రకటించుకోలేదు. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే పార్టీ ప్లీనరీల్లో ప్రజాస్వామికంగా ఎన్నికయ్యారు. జీవితకాలం ప్రజల కోసం పనిచేశారు. గబాన్‌ అధ్యక్షుడు ఒమర్‌ బాంగో 42 ఏళ్లు అధ్యక్షుడిగా ఉన్నారు. 1975 నుంచి ప్రతి ఐదేళ్లకోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వచ్చారు. 2009లో గుండెపోటుతో చనిపోయేదాకా ఆ పదవిలో కొనసాగారు.


పార్టీలో అన్ని పదవులకు ఐదేళ్లకోసారయినా ఎన్నికలు జరపాలని పేర్కొంటున్న ఎన్నికల నియమావళి 

Updated Date - 2022-07-11T07:51:17+05:30 IST