మళ్ళీ రెచ్చిపోయిన కిమ్...

ABN , First Publish Date - 2021-10-20T02:05:55+05:30 IST

స్వదేశంలో కరువు పరిస్థితులు తాండవమాడుతున్నప్పటికీ... ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన దూకుడును మాత్రం ఆపడం లేదు.

మళ్ళీ రెచ్చిపోయిన కిమ్...

టోక్యో : స్వదేశంలో కరువు పరిస్థితులు తాండవమాడుతున్నప్పటికీ... ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన దూకుడును మాత్రం ఆపడం లేదు. తాజాగా మళ్లీ పేట్రేగి పోయారు. జలాంతర్గామి ద్వారా అత్యాధునిక బాలిస్టిక్ మిస్సైల్ ను పరీక్షించారు. అయితే...  అదికాస్తా వెళ్లి జపాన్ జలాల్లో పడటం ఉద్రిక్తతకు దారితీసింది. ఇదిలా ఉండగా...  అంతరిక్ష ప్రయోగాలకు సిద్ధమవుతోన్న దక్షిణ కొరియా సైతం కిమ్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. మొత్తంమీద ఈ పరిణామాల క్రమంలో... జాతీయ, అంతర్జాతీయ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతుందని దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.  


అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఉత్తర కొరియా... తాజాగా మరో క్షిపణిని పరీక్షించినట్లు తెలుస్తోంది. దేశ తూర్పు తీరం నుంచి కనీసం ఒక బాలిస్టిక్‌ మిస్సైల్‌ను ఉత్తర కొరియా పేల్చిందని దక్షిణ కొరియా, జపాన్‌ వెల్లడించాయి. భారీ ఆయుధాలు, అణు కార్యకలాపాల ప్రతిష్టంభనపై చర్చించేందుకు నిఘా అధిపతులతో చర్చలు, స్పేస్ లాంచ్‌కు దక్షిణ కొరియా సిద్ధమవుతున్న సమయంలో...  ఈ పరిణామాలు చోటుచేసుకోవడం విశేషం. 


ఉత్తర కొరియా చేపట్టిన అణ్వాయుధాలు, మిస్సైల్‌ కార్యకలాపాలపై అంతర్జాతీయంగా నిషేధమునన్న క్రమంలో ఆ దేశం చేపట్టిన తాజా ఆయుధ పరీక్ష ఇది. సింపో ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.18 గంటలకు ఓ బాలిస్టిస్‌ మిస్సైల్‌ ప్రయోగం జరిగిందని దక్షిణ కొరియా ఉమ్మడి బలగాల అధిపతి ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఉత్తర కొరియా తన సబ్‌మెరైన్ ద్వారా లాంచ్‌ చేసే బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ను పరీక్షించేందుకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తోంది. ఇతర రకాల మిస్సైళ్ళను కూడా ఉత్తర కొరియా ఈ ప్రాంతం నుంచే పరీక్షిస్తుంది. ఇది ఏ రకపు బాలిస్టిస్‌ మిస్సైల్‌, అది ఎంత దూరం ప్రయాణించిందనే వివరాలను మాత్రం దక్షిణ కొరియా వెల్లడించలేదు. కాగా... ఉత్తర కొరియా  ప్రయోగించిన క్షిపణి జపాన్‌ జలాలకు సమీపంలో పడటంతో జపాన్ హెచ్చరికలు జారీ చేసింది.

Updated Date - 2021-10-20T02:05:55+05:30 IST