కిలో మిర్చి విత్తనాలు.. రూ.లక్ష

ABN , First Publish Date - 2020-05-30T09:29:23+05:30 IST

గత ఏడాది మిర్చి పంటకు అధిక ధరలు వచ్చాయి. అదే సమయంలో పత్తి, పసుపు సాగు చేసిన రైతులు నష్టపోయారు.

కిలో మిర్చి విత్తనాలు.. రూ.లక్ష

లాక్‌డౌన్‌తో చాటుగా అమ్మకాలు

కృతిమ కొరత సృష్టించి అధిక ధరకు విక్రయాలు

 

గుంటూరు, మే 29 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది మిర్చి పంటకు అధిక ధరలు వచ్చాయి. అదే సమయంలో పత్తి, పసుపు సాగు చేసిన రైతులు నష్టపోయారు. దీంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు మిర్చి సాగుకు సిద్ధమవుతున్నారు.  ఖరీఫ్‌ ప్రారంభమై.. మిరప రైతులు ప్రస్తుతం విత్తనాల ఎంపికలో ఉన్నారు. పది రకాల హైబ్రీడ్‌ మిరప విత్తనాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. పదిగ్రాముల ప్యాకేట్‌ను రూ.250 నుంచి రూ.300కి అమ్మాలి. అయితే రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌తో ఇదే అవకాశంగా హైబ్రీడ్‌ రకానికి చెందిన మిరప విత్తనాలను కృతిమ కొరత సృష్టించి వ్యాపారులు అధిక ధరకు అమ్ముతున్నారు. హైబ్రీడ్‌ మిరప విత్తనాలను కిలో రూ.లక్ష చొప్పున అమ్ముతున్నారు. పది రకాల హైబ్రీడ్‌ మిరప విత్తనాలు పది గ్రాముల ప్యాకెట్‌ను రూ.900 నుంచి రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తున్నారు.


లాక్‌డౌన్‌తో వ్యాపారులు షాపులు తెరవటం లేదు. బెంగళూరు, హైదరాబాదు నుంచి హైబ్రీడ్‌ మిరప విత్తనాలను కొరియర్‌ సర్వీస్‌లలో గిఫ్ట్‌ ప్యాక్‌ల రూపంలో కిలో నుంచి మూడు కిలోల ప్యాకెట్లు తెప్పించి వాటిని చాటుగా అమ్ముతున్నారు. ఇటీవల గుంటూరు నుంచి వర్సిటీ సమీపంలోకి విక్రయ కేంద్రాన్ని మార్చిన ఓ వ్యాపారి నుంచి ఇటీవల భారీగా హైబ్రీడ్‌ మిరప విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. స్టాప్‌ సేల్స్‌పేరుతో వీటిని స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని సమాచారం.

  

తనిఖీల పేరుతో విజిలెన్స్‌ హడావిడి...

గతంలో కల్తీ, నకిలీ ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, బయోల వ్యాపారులను గజగజలాడించిన విజిలెన్స్‌ ప్రస్తుతం పట్టించుకోవడంలేదు. అయితే ఆ శాఖలోని కొందరు పది రోజుల నుంచి హడావిడి చేస్తున్నారని, అయితే ఘటనలను వెలుగులోనికి రానీయడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. కృత్రిమ కొరత కారణంగా పెదకాకాని ప్రాంతంలో విత్తనాల అమ్మకాలపై స్టాప్‌ సెల్స్‌కు అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.  

Updated Date - 2020-05-30T09:29:23+05:30 IST