పాత కక్షలతోనే హత్య..

ABN , First Publish Date - 2020-06-05T09:50:48+05:30 IST

సికింద్రాబాద్‌ బైబిల్‌ హౌస్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై హత్యకు గురైన యువకుడు బన్సీలాల్‌పేట

పాత కక్షలతోనే హత్య..

మృతుడి గుర్తింపు

మృతదేహానికి నిప్పంటించి పొదల్లో పడేసిన నిందితులు


కవాడిగూడ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ బైబిల్‌ హౌస్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై హత్యకు గురైన యువకుడు బన్సీలాల్‌పేట ఐడీహెచ్‌కాలనీకి చెందిన రైల్వే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి జె.కృష్ణ(22)గా పోలీసులు గుర్తించారు. గత నెల 31న పని ఉందని బయటకెళ్లిన అతడు బైబిల్‌హౌస్‌ సమీపంలోని రైలు పట్టాల పక్కన చనిపోయి ఉన్నాడు. కృష్ణను స్నేహితులే పాత కక్షల కారణంగా రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించి రైల్వే ట్రాక్‌ పక్కన ఉన్న ముళ్లపొదల్లో పడేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 


గాంధీనగర్‌ సీఐ శ్రీనివా్‌సరావు వివరాల ప్రకారం... గాంధీనగర్‌ ఠాణా పరిధిలోని ఐడీహెచ్‌కాలనీలో నివసించే జె.దయానంద్‌, నాగమ్మ కుమారుడు కృష్ణ(22) గత నెల 31న పనిపై బయటకెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో ఈ నెల 2న కుటుంబసభ్యులు గాంధీనగర్‌ ఠాణాలో ఫిర్యాదుచేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. రైల్వే పట్టాలపై ఉన్న చెట్లపొదల్లో ఓ యువకుడి మృతదేహం ఉందని నీళ్ల బాటిళ్లు ఏరుకునే ఇద్దరు యువకులు గాంధీనగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.


చెట్లపొదల్లో ఉన్న యువకుడి మృతదేహాన్ని గుర్తించేందుకు ఘటనా స్థలానికి రావాలని కృష్ణ కుటుంబసభ్యులకు తెలపడంతో వారు అక్కడికెళ్లి మృతదేహాన్ని చూసి చనిపోయింది తమ కుమారుడు కృష్ణగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం అతడి కుటుంబసభ్యులకు అప్పగించారు. స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవను మనసులో పెట్టుకున్న నిందితులు కృష్ణను హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 


కృష్ణ స్నేహితుడు శ్రవణ్‌పై నిందితుల్లో ఒకరు బెదిరించి దాడి చేశాడు. శ్రవణ్‌ ఈ విషయాన్ని కృష్ణకు చెప్పడంతో కృష్ణ శ్రవణ్‌తోపాటు వెళ్లి వారిని బెదిరించాడని, అందుకే వారు కక్ష కట్టి పథకం ప్రకారం కృష్ణను హత్య చేసి ఉంటారని తెలుస్తోందని, నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ శ్రీనివా్‌సరావు తెలిపారు. 

Updated Date - 2020-06-05T09:50:48+05:30 IST