బతికుండగానే రికార్డుల్లో చంపేశారు

ABN , First Publish Date - 2022-08-19T06:24:15+05:30 IST

వృద్ధాప్యంలో ఆసరా పింఛన కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధుడిని రికార్డుల్లో మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

బతికుండగానే రికార్డుల్లో చంపేశారు

తిరుమలగిరి(సాగర్‌), ఆగస్టు 18: వృద్ధాప్యంలో ఆసరా పింఛన కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధుడిని రికార్డుల్లో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటన తిరుమలగిరి(సాగర్‌) మండలంలో చోటుచేసుకుంది. బాధితుని కుటుంబీకులు, సంబంధిత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన 71 వయస్సు గల పాతనబోయిన పుల్లయ్య 2021లో వృద్ధాప్య పింఛన కోసం ఆనలైనలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది మార్చి 9వ తేదీన ఎంపీడీవో అప్రూవల్‌ చేయగా అదే ఏడాది ఏప్రిల్‌ 20న డీఆర్‌డీవో లాగినలో పింఛన మంజూరైనట్లు  వివరాలు నమోదయ్యాయి. ప్రభుత్వం ఇటీవల దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు నూతన పింఛన్లను మంజూరు చేస్తున్న క్రమంలో అతని కుమారుడు సురేష్‌ తన తండ్రి పింఛనను ధ్రువీకరించుకునేందుకు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లాడు. అయితే కార్యాలయంలో కంప్యూటర్‌ లాగినలో వివరాలు పరిశీలించగా దరఖాస్తుదారుడు పుల్లయ్య మీసేవా డేటా ప్రకారం మరణించినట్లుగా నమోదై ఉంది. దీంతో తన తండ్రి బతికుండగానే మరణించినట్లు ఆనలైనలో ఉండటంతో సురేష్‌ అవాక్కయ్యాడు. దీంతో సురేష్‌ సంబంధిత అధికారులను జరిగిన తతంగంపై ప్రశ్నించాడు. అయితే ఆనలైన చోటుచేసుకున్న వివరాల గురించి పూర్తిస్థాయిలో పరిశీలించి పై అధికారుల సూచనల మేరకు సదరు బాధితుడికి  న్యాయం జరిగేలా చర్యలు తీ సుకుంటామని ఎంపీడీవో ఖాజా అజ్ఘర్‌అలీ పేర్కొన్నారు. 


Updated Date - 2022-08-19T06:24:15+05:30 IST