Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉప్పు తెస్తున్న ముప్పు

రోజుకు సగటున 9-12 గ్రాముల వాడకం.. 

అధిక రక్తపోటుకు కారణమవుతున్న ఉప్పు

రాష్ట్రంలో కిడ్నీ జబ్బులకు సంబంధించి క్లుప్తంగా..

తెలంగాణలో బీపీ బాధితుల సంఖ్య.... 62 లక్షల మంది

ఏటా కొత్తగా కిడ్నీ ఫెయిల్యూర్స్‌ అయ్యేవారు.... 2600 మంది

ఇందులో డయాలసిస్‌ అవసరమయ్యే వారు.... 1250-1500 మంది

రాష్ట్రంలో డయాలసిస్‌ రోగుల సంఖ్య.... 30 వేల మంది(కేంద్రం లెక్కల ప్రకారం)

ఏటా రాష్ట్రంలో కిడ్నీ ఫెయిల్యూర్‌ అయి మరణిస్తున్న వారి సంఖ్య.... 1450 మంది

డయాలసిస్‌ కోసం ఏటా సర్కారు పెడుతున్న ఖర్చు.... రూ.110 కోట్లుహైదరాబాద్‌, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఆహారంలో అన్ని ఉన్నా.. ఉప్పు లేనిలోటు ఎంత చెప్పినా తీరనిది. ఉప్పు లేని కూరంటే ఒక్క ముద్ద కూడా దిగదనే చెప్పాలి. అలాంటి రుచి కోసం వాడే ఉప్పు ఇప్పుడు ముప్పు తేస్తోంది. ఏకంగా ప్రాణాలే తీస్తోంది. అధిక ఉప్పు వాడకం వల్ల రక్తపోటు పెరిగి కిడ్నీ, గుండె, కళ్లు లాంటి కీలక అవయవాలు దెబ్బ తింటున్నాయి. ప్రధానంగా దీర్ఘకాలిక బీపీ వల్ల మూత్రపిండాల వైఫల్యం, గుండెపోటుకు దారి తీస్తున్నాయి. దాంతో డయాలసిస్‌ అవసరమయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ఏటా కొత్తగా 2500 మందికి మూత్రపిండాలు విఫలమవుతున్నాయి. అందులో 1250 మందికి డయాలసిస్‌ అవసరం అవుతోంది. ఏటా తెలంగాణలో రక్తపోటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో బీపీతో బాధపడే వారి సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఇటీవల కన్జ్యూమర్‌ వాయిస్‌ అనే స్వచ్ఛంద సంస్థ కూడా హెచ్చరించింది. భారత వైద్య పరిశోధనా మండలి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో నిర్వహించిన ఇండియా హైపర్‌ టెన్షన్‌ కంట్రోల్‌ ఇనిషియేటివ్‌ సర్వేలో ఈవిషయం వెల్లడైంది. 


డబ్ల్యూహెచ్‌వో ఏం చెబుతోందంటే..

ప్రపంచ వ్యాప్తంగా ఏటా అధిక ఉప్పు వాడకం వల్ల పాతిక లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అధిక ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే ఆ మరణాలు ఆపొచ్చని పేర్కొంది. అలాగే రోజుకు 2-5 గ్రాముల ఉప్పు, 3.5 గ్రాముల కన్నా తక్కువగా పొటాషియం తీసుకోవాలని చెబుతోంది. అంతకు మించి వినియోగిస్తే తీవ్ర రక్తపోటుకు దారి తీస్తుందని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది రోజుకు 9-12 గ్రాముల ఉప్పును(సిఫారసు చేసిన దాని కంటే రెండింతలు ఎక్కువ) వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. పెద్దలు రోజుకు 5 గ్రాముల కన్నా తక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల బీపీ, గుండె సంబంధిత జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచిస్తోంది. 2025 నాటికి ప్రపంచ జనాభాలో ఉప్పు తీసుకోవడాన్ని 30% మేర తగ్గించేందుకు డబ్ల్యూహెచ్‌వో సభ్య దేశాలు అంగీకరించాయి. కాగా ఏటా మార్చి రెండో గురువారాన్ని ప్రపంచ మూత్రపిండాల దినోత్సవంగా పాటిస్తున్నారు.

కిడ్నీ జబ్బులొచ్చినా ధైర్యం వీడొద్దు

ఈ ఏడాది వరల్డ్‌ కిడ్నీ డే కాన్సెప్ట్‌ ‘లివింగ్‌ వెల్‌ విత్‌ కిడ్నీ డిసిజ్‌’. అంటే కిడ్నీ జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలి. వచ్చిన తర్వాత అధైర్యపడొద్దు. దాన్ని కంట్రోల్‌ చేసుకుంటూ జీవించాలి. జబ్బును ఎదుర్కోవాలి. వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. ప్రధానంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ముఖ్యంగా ఉప్పు వాడకం తగ్గించాలి. అలాగే కిడ్నీ వ్యాధి గ్రస్తులకు కుటుంబ సభ్యులతో పాటు సమాజ సహకారం, ప్రభుత్వ తోడ్పాటు తప్పనిసరి. 


- డాక్టర్‌ తాడూరి గంగాధర్‌, నెఫ్రాలజీ విభాగం హెచ్‌వోడీ, నిమ్స్‌ ఆస్పత్రి, హైదరాబాద్‌

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...