వైద్యుడి కిడ్నాప్‌ యత్నం

ABN , First Publish Date - 2022-08-11T04:50:40+05:30 IST

ప్రశాంతతకు మారు పేరైన శ్రీకాకుళం నగరంలో కిడ్నాప్‌ కలకలం రేగింది. ఓ కార్పొరేట్‌ వైద్యుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌నకు యత్నించారు. వైద్యుడు ప్రతిఘటించి తప్పించుకోగా.. కిడ్నాపర్లు పరారయ్యారు. ఇందులో ఒక వ్యక్తి స్థానికులకు పట్టుబడగా.. వారు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నారు.

వైద్యుడి కిడ్నాప్‌ యత్నం
సంఘటన స్థలంలో గుమిగూడిన స్థానికులు.. (ఇన్‌సెట్‌లో) పట్టుబడిన వ్యక్తి

విశాఖ నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు
పెనుగులాటలో ఒకరు పట్టుబడిన వైనం
కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఆగస్టు 10:
ప్రశాంతతకు మారు పేరైన శ్రీకాకుళం నగరంలో కిడ్నాప్‌ కలకలం రేగింది. ఓ కార్పొరేట్‌ వైద్యుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌నకు యత్నించారు. వైద్యుడు ప్రతిఘటించి తప్పించుకోగా.. కిడ్నాపర్లు పరారయ్యారు. ఇందులో ఒక వ్యక్తి స్థానికులకు పట్టుబడగా.. వారు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలో కిమ్స్‌ ఆస్పత్రి వైద్యుడు గూడేన సోమేశ్వరరావు బుధవారం ఉదయం కిమ్స్‌కు సమీపంలో ఉన్న బ్లిస్‌ జిమ్‌ నుంచి వస్తున్నారు. ఆ సమయంలో జిమ్‌ భవనం వద్ద కొందరు వ్యక్తులు మాటు వేశారు. సోమేశ్వరరావు తలపై టీ షర్టు కప్పి కిడ్నాప్‌నకు యత్నించారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో మెట్ల కింద నుంచి సోమేశ్వరరావుతోపాటు.. కిడ్నాప్‌కు యత్నించినవారు కూడా పడిపోయారు. సోమేశ్వరరావు ప్రతిఘటించి కేకలు వేశారు. దీంతో పరిసరాల్లో ఉన్నవారు వచ్చి దుండగుల్లో ఒకరిని పట్టుకున్నారు. మిగిలినవారు అప్రమత్తమై.. అప్పటికే రోడ్డుపై సిద్ధంగా ఉంచుకున్న కారులో పరారయ్యారు. ఈ ఘటనపై సోమేశ్వరరావు రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టుబడిన వ్యక్తిని పోలీసులకు అప్పగించగా.. విచారణ చేపట్టారు. పట్టుబడిన వ్యక్తి విశాఖ జిల్లా పెందుర్తిలోని సుజాతనగర్‌ ప్రాంతానికి చెందిన పరమేష్‌గా గుర్తించారు.

ఒడిశా కారులో వచ్చి..
ఒడిశాకు చెందిన కారులో విశాఖపట్నానికి చెందిన వ్యక్తులు వచ్చి కిడ్నాప్‌కు యత్నించినట్లు సమాచారం. పరమేష్‌తోపాటు రంజిత్‌, రాజు అనే వ్యక్తులు వచ్చారని, కిడ్నాప్‌నకు సహకరిస్తే కొంతమొత్తం ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకోవడంతో ఇందుకు ఒడిగట్టారని తెలుస్తోంది. చాన్నాళ్ల నుంచి సోమేశ్వరరావు కదలికలపై వారు రెక్కీ నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసులు సాంకేతికపరమైన ఆధారాలు సేకరిస్తున్నారు. వివరాలు బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని టూటౌన్‌ పోలీసులు వెల్లడించారు.

 భూ వివాదాలే కారణమా?
భూ వివాదాలే ఈ ఘటనకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళంలోని ఓ ప్రాంతంలో భూమి కొనుగోలు చేసినట్లు.. ఇందుకు సంబంధించి అడ్వాన్స్‌ కూడా చెల్లించినా.. మరో వ్యక్తి అదే భూమిపై ఆశపడి.. చివరకు కిడ్నాప్‌ వరకు వెళ్లి ఇలా అడ్డంగా బుక్కయ్యారని ప్రచారం జరుగుతోంది.
 

Updated Date - 2022-08-11T04:50:40+05:30 IST