కాపాడండి అని అరిచినా ఎవరూ పట్టించుకోలేదు : అవంతి

ABN , First Publish Date - 2020-09-25T17:43:24+05:30 IST

నగరంలో వెలుగు చూసిన పరువు హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన బాధితురాలు అవంతి కీలక విషయాలు వెల్లడించింది.

కాపాడండి అని అరిచినా ఎవరూ పట్టించుకోలేదు : అవంతి

హైదరాబాద్‌: నగరంలో వెలుగు చూసిన పరువు హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన బాధితురాలు అవంతి కీలక విషయాలు వెల్లడించింది. తమను కిడ్నాప్ చేసినప్పుడు సాయం కోసం గట్టిగా అరిచామని, చాలా మంది ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని అవంతి వాపోయింది. వారి చెర నుంచి తాను తప్పించుకుని.. 100 నెంబర్‌కు ఫోన్ చేస్తే పోలీసులు కూడా పట్టించుకోలేదని ఆరోపించింది. ఫోన్ చేసిన అరగంటకు పోలీస్ వ్యాన్ వచ్చిందని వివరించింది. తన మేనమామ యుగంధర్ రెడ్డే తన భర్తను చంపాడని అవంతి వెల్లడించింది. హేమంత్, తాను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నామని, ఈ ఏడాది జూన్ 10వ తేదీన పెళ్లి చేసుకున్నామని వివరించింది. వివాదాలు వద్దనే తన పేరిట ఉన్న ఆస్తులన్నీ నాన్నకే రాసిచ్చానని అవంతి తెలిపింది. హేమంత్‌కు ఆస్తులు లేవని, అయినా చాలా సంతోషంగా ఉండేవాళ్లం అంటూ హేమంత్‌ను తలుచుకుని అవంతి బోరున విలపించింది. తమకు ప్రాణహానీ ఉందని పోలీసులకు చెప్పామని, అయినా వారు పట్టించుకోలేదని ఆరోపించింది. తన భర్తను చంపిన వారిని ఎన్‌కౌంటర్ చేసినా తప్పులేదంది. ప్రణయ్‌ను చంపించిన మారుతీరావు ఏమయ్యాడు? అంటూ ప్రణయ్, అమృత ఘటనను గుర్తు చేసింది. తన భర్తను చంపిన ఘటనలో అమ్మా, నాన్న సహా అందరూ జైలుకెళ్తారని, తనకు న్యాయం చేయాలని అవంతి వేడుకుంది.


తమకు ఇష్టం లేకుండా తన కూతురుని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో హేమంత్ అనే యువకుడిని అమ్మాయి తండ్రి అత్యంత దారుణంగా చంపించాడు. కుల వివక్ష నేపథ్యంలో జరిగిన ఈ ఉదంతంలో దంపతులైన హేమంత్, అవంతిని ఆమె కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో వారి చెర నుండి అవంతి తప్పించుకోగా, హేమంత్‌ను దుండగులు అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు.

Updated Date - 2020-09-25T17:43:24+05:30 IST