నిందితురాలికి పాస్‌పోర్ట్ జారీ.. ఎన్నారై ఫిర్యాదుతో వెలుగులోకొచ్చిన షాకింగ్ వాస్తవాలు!

ABN , First Publish Date - 2021-10-26T02:23:46+05:30 IST

కిడ్నాప్ కేసులో ముద్దాయిగా ఉన్న ఓ మహిళ ఏకంగా పాస్‌పోర్టును సంపాదించింది. కోర్టుకు కూడా తెలియనీకుండా అనుకున్నది సాధించింది. చివరికి ఓ ఎన్నారై రంగంలోకి దిగడంతో ఆమె పన్నాగం మొత్తం బయటపడింది.

నిందితురాలికి పాస్‌పోర్ట్ జారీ.. ఎన్నారై ఫిర్యాదుతో వెలుగులోకొచ్చిన షాకింగ్ వాస్తవాలు!

ఇంటర్నెట్ డెస్క్: కిడ్నాప్ కేసులో ముద్దాయిగా ఉన్న ఓ మహిళ ఏకంగా పాస్‌పోర్టును సంపాదించింది. కోర్టుకు కూడా తెలియనీకుండా అనుకున్నది సాధించింది. చివరికి ఓ ఎన్నారై రంగంలోకి దిగడంతో ఆమె పన్నాగం మొత్తం బయటపడింది. పంజాబ్ రాష్ట్రం లూథియానా జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ నేరంలో స్థానిక పోలీసుల పాత్రపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు అనుకూలంగా రిపోర్టు ఇచ్చిన ఏఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలంటూ జిల్లా అటార్నీ కోర్టుకు సూచించారు. 


పూర్తి వివరాల్లోకి వెళితే.. సారిన్ గ్రామానికి జస్వీర్ కౌర్ అనే మహిళపై 2016లో మల్కిత్ సింగ్ అనే ఎన్నారై  ఫిర్యాదు చేశారు.  తన సహచరులతో కలిసి ఆమె తనపై దాడి చేసిందని పేర్కొన్నారు. దీంతో.. పోలీసులు ఆమెపై కిడ్నాప్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విషయం చివరకు కోర్టు పరిధిలోకి వెళ్లింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన 2020లో మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోర్టును తప్పుదారి పట్టిస్తూ పాస్‌పోర్టు పొందిందని పేర్కొన్నారు. 


దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు ఇటీవల ఆమెపై చీటింగ్,  తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా.. తనపై కిడ్నాప్ కేసు ఉందన్న విషయాన్ని ఆమె దాచిపెట్టి పాస్‌పోర్టు సొంతం చేసుకున్నట్టు తనకు కొంత కాలం క్రితం తెలిసిందని మల్కిత్ సింగ్ పేర్కొన్నారు. కోర్టు అనుమతి లేకుండా ఆమె పాస్‌పోర్టు పొందిందని తెలిపారు.  ఆమె పేరిట జారీ అయిన ఎఫ్ఐఆర్ అంశాన్ని ప్రస్తావించకుండానే పాస్‌పోర్టు జారీ అయ్యేందుకు అనుకూలమైన నివేదికను పోలీసులు ఇచ్చారని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేప్టటిన పోలీసులు చివరికి నిందితురాలిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-10-26T02:23:46+05:30 IST