బ్యాంకు ఉద్యోగి కిడ్నాప్‌

ABN , First Publish Date - 2021-04-13T05:43:42+05:30 IST

బ్యాంకు విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ బ్యాంకు ఉద్యోగిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసిన సంఘటన సోమవారం రాత్రి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్‌రోడ్డువద్ద జరిగింది

బ్యాంకు ఉద్యోగి కిడ్నాప్‌

 ఖమ్మం జిల్లా కూసుమంచిలో కలకలం

కుటుంబకలహాల నేపథ్యంలో ఘటన?

కూసుమంచి, ఏప్రిల్‌ 12: బ్యాంకు విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ బ్యాంకు ఉద్యోగిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసిన సంఘటన సోమవారం రాత్రి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్‌రోడ్డువద్ద జరిగింది. కూసుమంచిలోని కెనరా బ్యాంకులో ఫీల్డాఫీసర్‌గా పనిచేస్తున్న అజ్మీరా ప్రవీణ్‌ సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై క్యాషియర్‌ అశోక్‌తో కలిసి ఖమ్మంలోని తన ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో చేగొమ్మ క్రాస్‌రోడ్డు సమీపంలోకి వెళ్లగానే  ఎదురుగా కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యకులుఉ వారి బైక్‌ను ఆపి ప్రవీణ్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ప్రవీణ్‌ చేతిలో ఉన్న బ్యాగ్‌ను, ఫోన్‌ను అశోక్‌కు ఇచ్చి ద్విచక్రవాహనాన్ని వేసుకుని వెళ్లాలని హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన క్యాషియర్‌ అశోక్‌ కొంతదూరం వెళ్లాక బ్రాంచ్‌ మేనేజర్‌కు సమాచారం ఇచ్చి.. తిరిగి కూసుమంచి వెళ్లి మేనేజర్‌తో కలిసి పోలీసులకు విషయాన్ని తెలిపారు. దీంతో పోలీసులు వారితో కలిసి ప్రవీణ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఫీల్డాఫీసర్‌ను కిడ్నాప్‌ చేస్తుండగా ప్రత్యక్షంగా చూసిన ఓవ్యక్తి తీసిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ప్రవీణ్‌ కుటుంబంలో ఏర్పడిన కలహాల నేపథ్యంలో బంధువులే కిడ్నాప్‌ చేసినట్టు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనపై తమకు ఇంకా లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందలేదని కూసుమంచి ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-04-13T05:43:42+05:30 IST