Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 17 May 2022 04:18:16 IST

వదలకూడదని అప్పుడే డిసైడయ్యాం

twitter-iconwatsapp-iconfb-icon

భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో మన జట్టు ఒక్కసారి కూడా ధామస్‌ కప్‌ ఫైనల్‌ చేరింది లేదు. అలాంటిది డిఫెండింగ్‌ చాంపియన్‌.. అందులోనూ ఏకంగా 14 సార్లు టైటిల్‌ను ముద్దాడిన బలీయమైన ఇండోనేసియాను భారత్‌ చిత్తు చేసి విజేతగా వతరించిందంటే మన కుర్రాళ్లు ఏ స్థాయిలో ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఈ టోర్నమెంట్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓటమే లేకుండా అజేయంగా నిలిచిన  వరల్డ్‌ మాజీ నెంబర్‌వన్‌.. తెలుగు షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ మాటల్లో థామస్‌ కప్‌ జైత్రయాత్ర విశేషాలు తెలుసుకుందాం..


వ్యక్తిగతంగా కాకుండా జట్టుగా.. సమష్టిగా ఆడడం చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆడి నెగ్గితే శ్రీకాంత్‌ గెలిచాడు. ప్రణయ్‌ నెగ్గాడు అంటారు. కానీ, థామస్‌ కప్‌ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆడి నెగ్గితే భారత్‌ గెలిచిందంటారు. ఆ మాట కోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. నేను గెలిచాననే భావన కంటే భారత్‌ గెలిచిందనేది చాలా గొప్పగా అనిపించింది. క్లిష్ట సమయాల్లో ఒకరిని మించి ఒకరు అద్భుతంగా ఆడిన వైనం ప్రత్యక్షంగా చూస్తుంటే రక్తం ఉప్పొంగింది. జట్టులోని యువ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లాం. 


బలగం బాగుంది..:

ఈసారి థామస్‌ కప్‌ టైటిల్‌ సాధించడానికి అవసరమైన బలగం మనకుందని హైదరాబాద్‌ నుంచి బయలుదేరే ముందే అనుకున్నాం. ప్రణాళికాబద్ధంగా ఆత్మవిశ్వాసంతో ఆడితే మంచి ఫలితాలు వస్తాయని చర్చించుకున్నాం. హైదరాబాద్‌ నుంచి జట్టు బ్యాంకాక్‌ పయనమయ్యే సమయంలో ప్రణయ్‌ ఒక వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. దానికి ‘ఇట్స్‌ కమింగ్‌ హోమ్‌’ అని పేరు పెట్టాడు. అది చాలా ఉద్వేగభరితంగా అనిపించింది.


ఎప్పటికప్పుడు జట్టులోని సభ్యుల ప్రదర్శనపై చర్చించడం అవసరమైన సలహాలు ఒకరికొకరు ఇచ్చుకోవడం, వ్యూహాలు రచించడం..ఇలా అన్నీ ఆ వాట్సాప్‌ గ్రూప్‌లోనే చేశాం. ఈసారి కప్‌ సాధిస్తామనే నమ్మకం ఆదినుంచీ అందరిలోనూ ఉంది. అయితే, క్వార్టర్స్‌ ముందు వరకు అది వందశాతం ఉంటే ఆ తర్వాత అది డబుల్‌ అయింది. సెమీస్‌ బెర్త్‌ ఖాయం కాగానే ఇక, ట్రోఫీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నిర్ణయించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానులందరి ప్రేమ, శక్తి మమ్మల్ని ఆవహించి విజేతగా నిలిపాయి.  


గౌరవంగా భావిస్తున్నా..:

నా కెరీర్‌లో విజయాలకంటే అపజయాలే ఎక్కువగా చూశా. అయితే, ఈ గెలుపు నా హృదయంలో ఎప్పటికీ పదిలంగా ఉండిపోతుంది. ఈ జట్టుకు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నా. జట్టును నడిపించడం ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నా.                   

(హైదరాబాద్‌-ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.