శ్రీకాంత్‌.. సత్తా

ABN , First Publish Date - 2022-05-16T05:39:00+05:30 IST

థామస్‌ ఉబెర్‌ కప్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ని భారత జట్టు నెగ్గడంలో కీలకపాత్ర పోషించడం ద్వారా కిడాంబి శ్రీకాంత్‌ మరోసారి గుంటూరు జిల్లాకు కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేశారు.

శ్రీకాంత్‌.. సత్తా
కిడాంబి శ్రీకాంత్‌

గుంటూరుకు ఖ్యాతి తెచ్చిపెట్టిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు 

థామస్‌ ఉబెర్‌ కప్‌లో ఆయన ఆటతీరు అమోఘం

జిల్లాలో ప్రతీ ఒక్కరూ గర్వపడేలా చేశారంటున్న క్రీడా సంఘాలు

గుంటూరు, మే 15(ఆంధ్రజ్యోతి): థామస్‌ ఉబెర్‌ కప్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ని భారత జట్టు నెగ్గడంలో కీలకపాత్ర పోషించడం ద్వారా కిడాంబి శ్రీకాంత్‌ మరోసారి గుంటూరు జిల్లాకు కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేశారు. తన కెరీర్‌లో ఎన్నో కప్‌లను గెలుచుకొన్న శ్రీకాంత్‌.. తాజాగా ఆదివారం థామర్‌ ఉబెర్‌ కప్‌ని భారత జట్టు గెలుపొందిన టీంలో సభ్యుడిగా ఉండటం విశేషం.  భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ప్రతీ ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. నగరంలో చంద్రమౌళీనగర్‌లో నివాసం ఉన్న శ్రీకాంత్‌ అంచెలంచెలుగా బ్యాడ్మింటన్‌ క్రీడలో ఎదిగారు. ఒక దశలో ప్రపంచ నెంబరు.1 ర్యాంకుని కూడా పొందారు. పుల్లెల గోపీచంద్‌ అకాడమిలో చేరి మరింత రాటుదేలారు. 2011 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి డబుల్స్‌లో కాంస్యం, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో వెండి పతకాలను గెలుపొందడం ద్వారా తన సత్తాని చాటారు. 2012లో మాల్డీవ్స్‌ ఇంటర్నేషనల్‌ ఛాలెంజ్‌ టోర్నమెంట్‌లో జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌లో విజేతగా నిలిచారు. 2013లో థాయ్‌ల్యాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీ గోల్డ్‌ ఈవెంట్‌ని గెలుపొందారు. 2014లో ఇండియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీ గోల్డ్‌ ఈవెంట్‌ రన్నరప్‌గా నిలిచారు. 2015లో స్విస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీలో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. అలానే చైౖనా ఓపెన్‌, ఇడియయన్‌, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, డెన్మార్క్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచారు. 2018లో బ్యాడ్మింటన్‌ నెంబరు.1 ర్యాంకుని పొందారు. తద్వారా గుంటూరుకు కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేశారు. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం

బ్యాడ్మింటన్‌లో కిడాంబి శ్రీకాంత్‌ కనబరుస్తున్న ప్రతిభని నాడు టీడీపీ ప్రభుత్వం గుర్తించింది. ఆయన్ని మరింతగా ప్రోత్సహించేందుకు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగాన్ని సీఎం హోదాలో చంద్రబాబునాయుడు కల్పించారు. శ్రీకాంత్‌ని గుంటూరు జిల్లాకు కేటాయించారు. కెరీర్‌ ముగిసిన తర్వాత డిప్యూటీ కలెక్టర్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా శ్రీకాంత్‌ ప్రదర్శించిన ఆట తీరుపై జిల్లాలోని బ్యాడ్మింటన్‌ సంఘాలతో పాటు క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 


Updated Date - 2022-05-16T05:39:00+05:30 IST