ఆడబిడ్డ రూ.2.50 లక్షలకు అమ్మకం

ABN , First Publish Date - 2022-02-18T16:08:49+05:30 IST

విరుదునగర్‌లో ఏడాది వయస్సున్న ఆడబిడ్డను రూ.2.5లక్షలకు విక్రయించిన తల్లిని ఆమెకు సహకరించిన తొమ్మిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. విరుదునగర్‌ కే సేవల్‌పట్టిలో మురుగన్‌, కలైసెల్వి (28) అనే

ఆడబిడ్డ రూ.2.50 లక్షలకు అమ్మకం

                     - తల్లి సహా 10 మంది అరెస్టు


చెన్నై: విరుదునగర్‌లో ఏడాది వయస్సున్న ఆడబిడ్డను రూ.2.5లక్షలకు విక్రయించిన తల్లిని ఆమెకు సహకరించిన తొమ్మిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. విరుదునగర్‌ కే సేవల్‌పట్టిలో మురుగన్‌, కలైసెల్వి (28) అనే భార్యాభర్తలు నివసించేవారు. వీరికి ఏడాది వయస్సున్న ఆడబిడ్డ ఉంది. ఆరునెలలకు ముందు మురుగన్‌ మృతి చెందటంతో కలైసెల్లి, బిడ్డతో సహా తండ్రి కరుప్పసామి ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో కలైసెల్వికి మళ్ళీ పెళ్ళి జరపాలని తల్లిదండ్రులు, కుటుంబీకులు ప్రయత్నించారు. పెళ్ళి చూపులకు వచ్చినవారంతా కలైసెల్వి ఆడబిడ్డ తల్లిగా ఉండటంతో ఆమెను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించారు. ఈ పరిస్థితుల్లో కలైసెల్లి, ఆమె తండ్రి కరుప్పసామి కలిసి ఆడబిడ్డను ఎవరికైనా అమ్మాలని నిర్ణయించారు. ఆ మేరకు శివకాశికి చెందిన పెళ్ళిళ్ల బ్రోకర్‌ కార్తీకి ఆ వివరాలు తెలిపారు. ఆడబిడ్డను విక్రయించేందుకు తగు ఏర్పాట్లు చేపడతానంటూ కార్తీ వారికి తెలిపారు. కార్తీ మరికొందరు కలిసి మదురై అవనియాపురంలో బిడ్డలు లేని జంతికల వ్యాపారి కరుప్పసామి, ప్రియ దంపతులకు ఆడబిడ్డను రూ.2.50 లక్షలకు విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న కూరైగుండు గ్రామ పరిపాలనాధికారి సుబ్బులక్ష్మి సూలైక్కర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ అర్జునన్‌ పర్యవేక్షణలో సూలైక్కరై సీఐ వినాయగం, సబిన్‌స్పెక్టర్‌ కార్తీకా నాయకత్వంలో రెండు ప్రత్యేక పోలీసు బృందాలు విరుదునగర్‌, మదురై అవనియాపురంలో రహస్యంగా విచారణ జరిపాయి. ఆ విచారణలో ఆడబిడ్డ విక్రయించినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ బిడ్డను అమ్మినందుకు కలైసెల్వి, ఆమె తండ్రి రూ.80 వేలు తీసుకున్నారని, మిగిలిన సొమ్మును బిడ్డను విక్రయించేందుకు సహకరించిన తొమ్మిదిమంది పంచుకున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని కలైసెల్వి, ఆమె తండ్రి కరుప్పసామి, బిడ్డను కొనుగోలు చేసిన దంపతులు కరుప్పసామి, ప్రియాను బిడ్డను విక్రయించేందుకు సహకరించిన కార్తీ, దేవేంద్రన్‌, నందకుమార్‌, సెన్బగరాజా, మహేశ్వరి అలియాస్‌ మారియమ్మాళ్‌, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. 

Updated Date - 2022-02-18T16:08:49+05:30 IST