నాలుగు రోజులుగా నిద్రలో ఉన్న తల్లి.. ఇబ్బంది పెట్టొద్దని లేపని కొడుకు.. చివరగా మేనమామ ఫోన్ చేయడంతో..

ABN , First Publish Date - 2022-03-13T02:48:24+05:30 IST

తిరుపతిలో ఓ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. నాలుగు రోజులుగా తల్లి పడుకునే ఉంది. దీంతో అమ్మను ఇబ్బంది పెట్టవద్దనే ఉద్దేశంతో ఆ పదేళ్ల కొడుకు.. తల్లిని లేపకుండా...

నాలుగు రోజులుగా నిద్రలో ఉన్న తల్లి.. ఇబ్బంది పెట్టొద్దని లేపని కొడుకు.. చివరగా మేనమామ ఫోన్ చేయడంతో..

తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ ఉండదనేది వాస్తవం. అయితే ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే కొడుకులే కరువయ్యారు. అయితే ఇలాంటి సమాజంలో కూడా కొందరు మాత్రం తల్లి పట్ల అమితమైన ప్రేమను చూపుతుంటారు. తల్లికి చిన్న శ్రమ కూడా లేకుండా చూసుకుంటారు. అమ్మ లేని జీవితాన్ని అసలు ఊహించుకోలేరు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే. తిరుపతిలో ఓ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. నాలుగు రోజులుగా తల్లి పడుకునే ఉంది. దీంతో అమ్మను ఇబ్బంది పెట్టవద్దనే ఉద్దేశంతో ఆ పదేళ్ల కొడుకు.. తల్లిని లేపకుండా తన పనులు తానే చేసుకుంటూ రోజూ స్కూల్‌కు వెళ్లేవాడు. అయితే చివరగా బాలుడి మేనమామ ఫోన్ చేయడంతో ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..


అమ్మ ఇక ఎప్పటికీ లేవదని ఆ పదేళ్ల పిల్లవాడికి అర్థం కాలేదు. నిద్రపోతోంది లేస్తుందిలే అనుకున్నాడు. అమ్మను డిస్టర్బ్‌ చేయకూడదని పక్కనే పడుకుని నిద్రపోయాడు. తెల్లవారి చూసినా అమ్మ లేవలేదు. అమ్మకి బాగా లేనపుడు ఇంతే కదా అనుకున్నాడు. స్నానం చేసి, ఫ్రిజ్‌లో ఉన్నవేవో లంచ్‌బాక్స్‌లో సర్దుకుని స్కూలుకి వెళ్లిపోయాడు. సాయంత్రం వచ్చాక చూస్తే అమ్మ మంచం మీద నిద్ర పోతోంది. నలతగా ఉండడంతో మళ్లీ పడుకుని నిద్రపోతోందని అనుకున్నాడు. ఉన్నదేదో తిని ఆ రాత్రి కూడా అమ్మ పక్కనే పడుకుని నిద్రపోయాడు. మూడు రోజులు ఇలాగే గడిచింది. నాలుగో రోజు తల్లి దగ్గర నుంచి దుర్వాసన వస్తోంది. తల నుంచి రక్తం కారినట్టుగా ఉంది. అదే సమయంలో బాలుడి మేనమామ ఫోన్ చేశాడు. ‘‘అమ్మ నాలుగు రోజులుగా లేవకుండా నిద్రపోతోంది’’ అని చెప్పాడు.


అనుమానంతో బాలుడి మేనమామ కంగారుగా అక్కడికి చేరుకున్నాడు. దీంతో ఆమె మృతి చెందిన విషయం బయటపడింది. తిరుపతి విద్యానగర్‌లో శనివారం ఈ ఉదంతం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం ఎల్లమరాజుపల్లికి చెందిన కోదండరెడ్డి కుమార్తె టి.రాజ్యలక్ష్మి (41) కుటుంబ సమస్యల కారణంగా నాలుగేళ్లుగా భర్త శ్రీధర్‌రెడ్డికి దూరంగా ఉంటోంది. ఫిజిక్స్‌లో డాక్టరేట్‌ చేసిన ఆమె ఏడాది క్రితం వరకు బెంగుళూరులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసేది. ఏడాదికాలంగా  తిరుపతిలో ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తూ.. తన కుమారుడు శ్యామ్‌కిషోర్‌(10)తో కలిసి ఉంటోంది. ఈనెల 8వ తేదీ రాత్రి రాజ్యలక్ష్మి బెడ్‌ పైనుంచి లేస్తూ హఠాత్తుగా వాంతి చేసుకుని, అలాగే కుప్పకూలి  బోర్లా పడిపోయింది.


కొడుకు శ్యామ్‌కిషోర్‌ అమ్మ నిద్రపోతోందనుకున్నాడు. అమ్మ పక్కన పడుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు లేచి బడికి వెళ్లాడు. ఇలా మూడు రోజులు గడిచాయి. ఇంటి సంగతులు ఏవీ బయట ఎవ్వరితోనూ చెప్పవద్దని గతంలో అప్పుడప్పుడూ కొడుక్కి చెబుతూ ఉండేది. దీంతో ఆ బాలుడు.. ఈ విషయం కూడా ఎవరికీ చెప్పలేదు. తనకు ఆనారోగ్యంగా ఉన్న సమయంలో మారాం చేయకుండా ఉన్నదేదో తినాలని చెప్పేది. అలాగే డిస్టర్బ్‌ చేయకుండా ఇంట్లోనే ఉండాలని. బయటకు వెళ్లకూడదని చెప్పేది. ఈ సూచనలను గుర్తు తెచ్చుకున్న బాలుడు.. అమాయకత్వంతో అమ్మ మరణాన్ని కూడా గుర్తించలేకపోయాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా విషాధ ఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2022-03-13T02:48:24+05:30 IST