ఖైరతాబాద్‌.. కిస్కాబాద్‌?

ABN , First Publish Date - 2020-11-29T06:44:26+05:30 IST

రాజకీయ సంచలనాలకు కేంద్రమైన ఖైరతాబాద్‌ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఖైరతాబాద్‌.. కిస్కాబాద్‌?

పట్టు కోసం పార్టీల ప్రయత్నాలు..

బంజారాహిల్స్‌, నవంబర్‌  28 (ఆంధ్రజ్యోతి): రాజకీయ సంచలనాలకు కేంద్రమైన ఖైరతాబాద్‌ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. సెటిలర్లు, బీసీలతో పాటు మైనారిటీలు అధికంగా ఉన్న ఇక్కడ గెలుపు కోసం ఎవరికి వారు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విలక్షణ తీర్పును ఇవ్వడంలో ముందుండే ఖైరతాబాద్‌ ప్రజ రెండు దఫాలుగా మాత్రం అధికార పార్టీతోనే ఉండటం విశేషం. నియోజకవర్గంలో హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, వెంకటేశ్వరనగర్‌కాలనీ డివిజన్లు ఉన్నాయి. సోమాజిగూడ డివిజన్‌ సగ భాగం ఉంది. అన్ని డివిజన్‌లలో ప్రధాన పార్టీలు బలంగానే కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌ గెలుపొందారు. ఆ తరువాత జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆరు డివిజన్‌లను కైవసం చేసుకుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి విజయం సాధించారు. 2016లో గ్రేటర్‌ ఎన్నికల్లో, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఈ సారి ఎవరు పట్టు సాధిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. 

ఆరు డివిజన్లలో సిట్టింగ్‌లే..  

2016 గ్రేటర్‌ ఎన్నికల్లో ఆరు డివిజన్‌లలో గెలిచిన వారికే తిరిగి అఽధిష్ఠానం టికెట్లు ఇచ్చింది. ఖైరతాబాద్‌ నుంచి పి. విజయారెడ్డి, హిమాయత్‌నగర్‌ నుంచి హేమలతాయాదవ్‌, బంజారాహిల్స్‌ నుంచి గద్వాల్‌ విజయలక్ష్మి, వెంకటేశ్వరనగర్‌కాలనీ నుంచి మన్నె కవితారెడ్డి, జూబ్లీహిల్స్‌ నుంచి కాజా సూర్యనారాయణలు మరోసారి బరిలో నిలిచారు. సోమాజిగూడ డివిజన్‌లో 2016లో గెలిచిన అత్తలూరి విజయలక్ష్మి అనారోగ్యంతో పోటీ నుంచి తప్పుకోవడంతో దానం నాగేందర్‌ అనుచరుడు వనం శ్రీనివాస్‌యాదవ్‌ భార్య సంగీతా యాదవ్‌కు టికెట్టు ఇచ్చారు. 

2018 అసెంబ్లీ ఎన్నిల్లో టీఆర్‌ఎస్‌కు 25 వేల మెజారిటీ వచ్చింది. కానీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 13 వేల మెజారిటీ వచ్చింది.  అభివృద్ధిని ప్రచార అస్త్రాలుగా చేసుకొని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు.  మంత్రులు, సీనియర్‌లు ఇక్కడ పాగా వేశారు. తిరిగి అన్ని స్థానాలు సాధించేందుకు వ్యూహం రచిస్తున్నారు. 

బీజేపీలో నూతన ఉత్సాహం

2014 తర్వాత బీజేపీ నియోజకవర్గంపై పట్టు కోల్పోయి, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో తిరిగి పుంజుకోవడంతో శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. పార్టీ తరఫున హిమాయత్‌నగర్‌లో మహాలక్ష్మి, ఖైరతాబాద్‌ నుంచి సింగరి వీణామాఽధురి, సోమాజిగూడ నుంచి చిట్టబోయిన విజయదుర్గాయాదవ్‌, వెంకటేశ్వరనగర్‌కాలనీ నుంచి ఉమాచంద్రశేఖర్‌, బంజారాహిల్స్‌ నుంచి మహిపాల్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌ నుంచి వెల్దండ వెంకటేష్‌లు పోటీలో ఉన్నారు. 

 నాడు కాంగ్రెస్‌ కంచుకోట

నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఇప్పుడు కోట పూర్తిగా శిథిలావస్థకు చేరినట్టు కనిపిస్తోంది. 2011 గ్రేటర్‌ ఎన్నికల తర్వాత నుంచీ పట్టుకోల్పోతూ వస్తోంది. నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న దానం నాగేందర్‌ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ కష్టాల్లో పడింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీనియర్‌లు శ్రమిస్తున్నారు. 

దేశం.. పూర్వ వైభవం కోసం.. 

2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి కె విజయరామారావు టీఆర్‌ఎస్‌లో చేరడంతో తెలుగుదేశం పార్టీ ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఎన్నికల పొత్తులో భాగంగా 2014లో ఈ స్థానాన్ని బీజేపీకి, 2018 ఎన్నికలలో కాంగ్రెస్‌కు సీటు కేటాయించింది. 

దీంతో పార్టీ శ్రేణులు డీలా పడ్డారు. ప్రస్తుతం ఆరు డివిజన్‌లలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతూ పూర్వ వైభవం కోసం శ్రమిస్తున్నారు.

Updated Date - 2020-11-29T06:44:26+05:30 IST