బీజేపీ ఓటమికి ‘ఖేలా హోబె’

ABN , First Publish Date - 2021-07-22T06:52:07+05:30 IST

బీజేపీని, దాని నియంతృత్వ పాలనను వ్యతిరేకించే శక్తులన్నీ ఏకం కావాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పిలుపునిచ్చారు.

బీజేపీ ఓటమికి ‘ఖేలా హోబె’

  • అన్ని రాష్ట్రాల్లో దించేసేదాకా ఆట ఆగదు
  • మోదీ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటి కావాలి
  • బెంగాల్‌ గెలుపు మంత్రం మళ్లీ మమత నోట


కోల్‌కతా, జూలై 21 : బీజేపీని, దాని నియంతృత్వ పాలనను వ్యతిరేకించే శక్తులన్నీ ఏకం కావాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పిలుపునిచ్చారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో మొదలుపెట్టిన ఆట (ఖేలా హోబె) దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచీ బీజేపీని తరిమికొట్టేవరకు కొనసాగుతుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. తృణమూల్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బుధవారం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మమత ప్రసంగించారు. త్వరలో ఎన్నికలు జరిగే గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ సహా పలు భారతీయ భాషల్లో ఈ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం గమనార్హం. బీజేపీ ప్రదర్శించిన కండ బలం, మాఫియా బలాన్ని ఎదురొడ్డి బెంగాల్‌లో విజయం సాధించడంలో కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన, ఎస్పీ తదితర పార్టీలు, దేశ ప్రజలు తనకు ఎంతగానో సహకరించారని మమత గుర్తుచేసుకొన్నారు. ఇటీవలి బెంగాల్‌ ఎన్నికల్లో మార్మోగిననినాదం ‘ఖేలా హోబె’. తృణమూల్‌ రూపొందించిన ఈ నినాదానికి ప్రాచుర్యం కల్పిస్తూ.. వచ్చే నెల 16వ తేదీని ‘ఖేలా దివ్‌స’గా పాటించాలని మమత పిలుపునిచ్చారు.

    

అది ముస్లింలీగ్‌ దాడి దివస్‌ : బీజేపీ కౌంటర్‌

ఆగస్టు 16న ఖేలా దివ్‌సగా సీఎం మమత ప్రకటించడాన్ని బీజేపీ తప్పుబట్టింది. పాకిస్థాన్‌ కోసం ముస్లింలీగ్‌, జిన్నా 1946లో ఇదేరోజున ప్రత్యక్ష దాడులకు పిలుపునిచ్చారని.. ఈ దాడుల్లో కోల్‌కతాలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని బెంగాల్‌ బీజేపీ నేత స్వపన్‌దాస్‌ గుప్తా గుర్తుచేశారు. అలాంటి రోజుని మమత ఎంచుకోవడం సరికాదన్నారు. ప్రతిపక్ష నేతలందరినీ ఆహ్వానించి కూటమిని ఏర్పాటుచేయాలని అసెంబ్లీకి ఎన్నిక కాని ఒక సీఎం తాపత్రయపడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్‌ మాలవీయా దెబ్బిపొడిచారు.

Updated Date - 2021-07-22T06:52:07+05:30 IST