బియ్యం కయ్యం!

ABN , First Publish Date - 2022-01-28T07:29:16+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి సివిల్‌ సప్లయిశాఖ సేకరించిన ధాన్యం ‘రైస్‌’ మిల్లుల్లో మూలుగు తోంది. మిల్లుల్లో ఉత్పత్తి అవుతున్న బియ్యాన్ని సివిల్‌ సప్లయి అధికారులు స్వల్ప సాంకేతికపరమైన కారణాలు చూపి తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది.

బియ్యం కయ్యం!

  • జిల్లాలో స్తంభించిన మిల్లింగ్‌ 
  • బియ్యంపై మచ్చలు రావడమే కారణం
  • సేకరణకు సివిల్‌ సప్లయి శాఖ నిరాకరణ 
  • మిల్లుల్లో పేరుకుపోతున్న ధాన్యం, రైస్‌ నిల్వలు
  • అవసరమైతే ధాన్యం రైతులకు వెనక్కు ఇచ్చేస్తాం : మిల్లర్ల హెచ్చరిక

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి సివిల్‌ సప్లయిశాఖ సేకరించిన ధాన్యం ‘రైస్‌’ మిల్లుల్లో మూలుగు తోంది. మిల్లుల్లో ఉత్పత్తి అవుతున్న బియ్యాన్ని సివిల్‌ సప్లయి అధికారులు స్వల్ప సాంకేతికపరమైన కారణాలు చూపి తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఖరీఫ్‌లో సేకరించిన ధాన్యాన్ని రైతు భరోసా (ఆర్‌బీకే) కేంద్రాల ద్వారా సివిల్‌ సప్లయిశాఖ అధికారులు సేకరించారు. అలా సేకరించిన ధాన్యాన్ని సమీపంలోని రైస్‌మిల్లులకు తరలించారు. మిల్లింగ్‌ తర్వాత ఆ బియ్యాన్ని సివిల్‌ సప్లయి శాఖ కొన్ని అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ తీసుకోకపోవడంతో జిల్లావ్యాప్తంగా లక్షల టన్నుల ధాన్యం నిల్వలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. ఇటు బియ్యం, అటు రైతుల నుంచి సేకరించిన ధాన్యం నిల్వలు మిల్లుల్లో భారీగా పేరుకుపోయాయి. అటు ఆర్‌బీకేల ద్వారా ప్రభుత్వానికి ధాన్యం సప్లయి చేసిన రైతులకు ఇప్పటికీ సొమ్ములు జమకాకపోవడంతో వారిలోనూ ఆందోళన నెలకొంది. మిల్లుల్లో ఉత్పత్తి అవుతున్న బియ్యంపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడడం వల్ల వాటిని మిల్లర్ల నుంచి సేకరించడానికి సివిల్‌ సప్లయిశాఖ అధికారులు వెనుకంజ వేయడమే ఈ పరిస్థితికి కారణంగా రైస్‌మిల్లర్లు చెబుతున్నారు. ఒకవేళ బియ్యాన్ని ప్రభుత్వం స్వీకరించకపోతే మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని రైతుల కు ఆర్‌బీకేల ద్వారా వెనక్కు ఇచ్చేస్తామంటూ మిల్లర్లు బహిరంగంగా చెబుతున్నారు.



ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి జిల్లాలోని ఆర్‌బీకేల ద్వారా 5 లక్షల 77వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సివిల్‌ సప్లయిస్‌ శాఖ అధికారులు సేకరించారు. ఈ ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ (సీఎంఆర్‌) నిమిత్తం జిల్లాలోని సుమా రు 450 రైస్‌మిల్లులకు ఇచ్చారు. వాస్తవానికి మిల్లర్ల నుంచి ఇందుకోసం బ్యాంకు గ్యారంటీ కూడా తీసుకుంటారు. ఇలా ఆర్‌బీకేల ద్వారా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి వచ్చిన బియ్యాన్ని ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌ వారికి తిరిగి సరఫరా చేస్తుంటారు. ప్రభుత్వం జనవరి 11వ తేదీ నాటికి లక్ష టన్నుల సార్టెక్స్‌ రైస్‌ను తీసుకునేందుకు టార్గెట్‌గా నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 5 వేల టన్నుల రైస్‌ను కూడా సివిల్‌ సప్లయిశాఖ తీసుకునేందుకు రాలేదు. మిల్లుల్లో ఉత్పత్తి అయ్యే బియ్యంలో టిప్‌ డ్యామేజ్‌ (మచ్చ) ఉందన్న కారణంతోనే బియ్యాన్ని తీసు కునేందుకు వారు నిరాకరించారు. గత ఇరవై రోజుల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. సివిల్‌ సప్లయిస్‌శాఖ అధికారులు సేకరించిన ధాన్యంలోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైనప్పటికీ పట్టించుకోకుండా మిల్లర్ల నుంచి బియ్యం సేకరించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నారు. బియ్యం డెలివరీ అయ్యే లారీలు గోడౌన్‌ల వద్ద నిలిచి ఉన్నాయి. కాగా బియ్యం గింజలపై వస్తున్న మచ్చలకు కారణాలు ఏమి టనే అంశంపై వ్యవసాయశాఖ అధికారులు సేకరించిన ధాన్యాన్ని మార్టేరులోని వ్యవసాయ పరిశో ధనా కేంద్రానికి పరిశీలన నిమిత్తం శాంపిల్స్‌ పంపించారు.



ఆ ధాన్యాన్ని పరీక్షించిన శాస్త్రవేత్తలు మూడు శాతం మేర ఉంటే మిల్లర్ల నుంచి రైస్‌ను తీసుకోవచ్చునని అంగీకారం తెలుపుతూ ఇచ్చిన రిపోర్టును సివిల్‌ సప్లయిశాఖ కార్పొరేషన్‌ ఎండీకి పంపించారు. అయితే అక్కడి నుంచి ఎటువంటి అధికారిక నిర్ణయం వెలువడకపోవడంతో రైస్‌మిల్లుల వద్ద వేల టన్నుల బియ్యం నిల్వలు గత కొన్ని రోజుల నుంచి పేరుకుపోయాయి. దీనివల్ల మిల్లులు పనిచేయడం లేదు. వీటిపై ఆధారపడి ఉన్న వం దల మంది కార్మికులతోపాటు రవాణా వ్యవస్థ సైతం స్తంభించిపోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యా యని మిల్లర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ మాజీ ఉపాధ్య క్షుడు, భీమనపల్లికి చెందిన దేశంశెట్టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆర్‌బీకేల ద్వారా సేకరించిన ధాన్యంలో నాణ్యత లేదని అధికారులు తిరస్కరిస్తే, రైతులకు ఈ ధాన్యాన్ని వెనక్కు ఇచ్చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మిల్లుల్లోని రైస్‌ నిల్వలను తక్షణమే తీసుకోవాలని డిమాండు చేశారు. 

Updated Date - 2022-01-28T07:29:16+05:30 IST