ఖరీఫ్‌ కష్టమే..!

ABN , First Publish Date - 2022-09-27T05:30:00+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌లో బోరుబావులు, పంట కాలువలు, చెరువుల ఆధారంగా వరి సాగు చేస్తారు. జిల్లాలో దాదాపు 32,741 హెక్టార్లలో వరి సాధారణంగా సాగు కావాల్సి ఉంటే, 19,705 హెక్టార్లలో మాత్రమే సాగైంది. 2,021 హెక్టార్లలో జొన్న సాగు కావాల్సి ఉండగా 157 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వర్షాధారంతో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగ పంట ఈ సీజనులో నామమాత్రంగా వేసినట్లు తెలుస్తోంది.

ఖరీఫ్‌ కష్టమే..!

జూన్‌ మినహా సీజన్‌ అంతా లోటు వర్షపాతం

అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి

వాన తగ్గినా.. సాగు పెరిగిందట..!


వర్షాలు బాగా పడితే ఖరీఫ్‌లో పంటల సాగు ఎక్కువగా ఉంటుంది. కానీ జిల్లాలో  ఇప్పటి వరకు 21.8 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌ మాసంలో మినహాయిస్తే ఈ సీజన్‌ అంతటా తక్కువ వర్షం కురిసింది. కానీ పంటల సాగు మాత్రం సాధారణం కంటే 6 శాతం అధికంగా సాగైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవంగా నైరుతీ రుతు పవనాల వల్ల జిల్లాలో ఆశించినమేర వర్షాలు పడలేదు. దీంతో కరువు ఛాయలు అలుముకున్నట్లేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశతో ఉన్నారు. కానీ జిల్లా అధికార యంత్రాంగం తయారు చేసిన పంటల సాగు గణాంకాలు పరిశీలిస్తే.. జిల్లాలో ఆశించినంత మేర వర్షాలు పడినట్లు, సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువ పంటలు నమోదు అయినట్లు ఉన్నాయి.


ప్రొద్దుటూరు, సెప్టెంబరు 27: ఖరీఫ్‌ సీజన్‌లో బోరుబావులు, పంట కాలువలు, చెరువుల ఆధారంగా వరి సాగు చేస్తారు. జిల్లాలో దాదాపు 32,741 హెక్టార్లలో వరి సాధారణంగా సాగు కావాల్సి ఉంటే, 19,705 హెక్టార్లలో మాత్రమే సాగైంది. 2,021 హెక్టార్లలో జొన్న సాగు కావాల్సి ఉండగా 157 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వర్షాధారంతో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగ పంట ఈ సీజనులో నామమాత్రంగా వేసినట్లు తెలుస్తోంది. 7,454 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉండగా 3,537 హెక్టార్లలో మాత్రమే విత్తనం పడింది. ఇదిలా ఉండగా, 1,091 హెక్టార్లలో సాగు కావాల్సిన సజ్జ 1,200 హెక్టార్లలో సాగు అయింది. 63 హెక్టార్లలో సాగు కావాల్సిన సోయాబీన్‌ 3,753 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అదే విధంగా 17,303 హెక్టార్లలో పత్తి పంట సాగు కావాల్సి ఉండగా, 43,496 హెక్టార్లలో సాగైంది. వీటితో పాటు ఇతర పంటలు కలిపి జిల్లాలో 91,994 హెక్టార్లలో పంటలు సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే అనుకున్నదానికి మించి 97,373 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు అంచనాలు తయారు చేశారు. వాస్తవంగా సాగు కావాల్సిన విస్తీర్ణం కంటే మరో ఆరు శాతం ఎక్కువ అయినట్లు నివేదికల్లో పేర్కొంటున్నారు. 


తగ్గిన వర్షపాతం

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌, జూలై, ఆగస్టు మాసాల్లో పడే వర్షాలు పంటల సాగుకు కీలకం. అయితే ఈ సీజన్‌లో జూన్‌ నెల మినహా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. జిల్లాలో జూన్‌ మాసంలో 68.2 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 81.2 మి.మీ నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా పడడంతో రైతులు పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. జూలై మాసంలో 96.7 సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 82.3 మి.మీ నమోదు అయింది. 15 శాతం లోటు ఏర్పడింది. ఆగస్టులో 18.4 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 52.7 మి.మీ నమోదైంది. సాధారణం కంటే 55.5 శాతం తక్కువ వర్షం పడింది. సెప్టెంబరు నెలలో ఇప్పటి వరకు 96.6 మిమీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 38.7 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే 59.9 శాతం తక్కువ వాన పడింది. 

జిల్లాలో సగటున ఈ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు 379.9 మి.మీ వర్షానికి గాను 297.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మొత్తమ్మీద 21.8 మి.మీ వర్షపాతం తక్కువ నమోదైంది. జిల్లాలోని 36 మండలాల్లో కూడా పంటల సాగుకు సరిపడా వాన పడలేదు. రాజుపాలెం, దువ్వూరు, బద్వేలు, కమలాపురం, ఒంటిమిట్ట మండలాల్లో 55 శాతానికి పైగా లోటు వర్షపాతం ఉంది. జూన్‌లో పడిన వర్షం ఆధారంగా పంటలు సాగు చేసిన రైతు లు ఆ తరువాత వరుణుడు ముఖం చాటేయడంతో ఆందోళన చెందు తున్నారు. కొన్ని చోట్ల సోయాబీన్స్‌, మినుము పంటలు బాగా వాడు మొగం పెట్టడంతో దున్నేస్తున్నారు. 


పత్తి, సోయాబీన్స్‌ మాత్రమే..

జిల్లాలో ప్రధాన పంటలు వరి, శనగ. ఇవి రెండూ లక్ష్యంలో దాదాపు సగం మాత్రమే సాగయ్యాయి. లక్ష్యానికి మించి సాగైన పంటలు సోయాబీన్స్‌, పత్తి. సోయాబీన్స్‌ 63 హెక్టార్లలో సాగవుతుందని అధికారులు అంచనా వేయగా 3,753 హెక్టార్లలో సాగైంది. అంటే అనుకున్న దానికంటే 3,690 హెక్టార్లలో ఎక్కువగా సాగైంది. అలాగే పత్తి సాధారణ సాగు 17,303 హెక్టార్లని అధికారులు భావించగా దీనికి భిన్నంగా 43,496 హెక్టార్లలో సాగైంది. సాధారణం కంటే 29,193 హెక్టార్లలో అదనంగా పత్తి సాగైంది. ఈ రెండు పంటల ఆధారంగా అధికారులు జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణం కంటే సాగు విస్తీర్ణం పెరిగిందని అంచనాలు తయారు చేశారు. వాస్తవానికి లక్ష్యానికి మించి సాగైన సోయాబీన్స్‌, పత్తి పరిస్థితి ఆశాజనకంగా లేదు. చాలాచోట్ల సోయాబీన్స్‌ వాడిపోవడంతో రైతులు దున్నేశారు. పత్తి పంట సైతం సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కలు ఎదగలేదు. మొక్కలు పెరగకుండా పూత రావడంతో పాటు కొన్నిచోట్ల మొగ్గలు రాలిపోతున్నాయి. కొన్నచోట్ల పత్తికాయలు మరీ చిన్నవిగా ఉన్నాయి. దీంతో పత్తి దిగుబడి భారీగా తగ్గి నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. 

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో ఆశించిన మేర పంటలు సాగయ్యాయని పీఏవో నాగేశ్వరరావు తెలిపారు. జూన్‌ మాసంలో పడిన వర్షాల వల్లనే ఈ పంటలు సాగయ్యాయన్నారు. వరిసాగు తగ్గినప్పటికీ సోయాబీన్‌, పత్తి పంటలు అధికంగా సాగయ్యాయని, రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు అనుకూలమని అన్నారు.



Updated Date - 2022-09-27T05:30:00+05:30 IST