కష్టాల్లో ఖరీఫ్‌

ABN , First Publish Date - 2022-06-27T08:30:22+05:30 IST

కష్టాల్లో ఖరీఫ్‌

కష్టాల్లో ఖరీఫ్‌

నైరుతి రుతు పవనాలు వచ్చేశాయి. అప్పుడే నెల రోజులు గడిచిపోతున్నాయి. వర్షాలు మాత్రం ఆశించినంతగా లేవు. ప్రాజెక్టులు, చెరువులు, కాల్వలు నీరు లేక వెలవెలబోతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసే వర్షాలతో జూన్‌ నెలలోనే వరద నీరు చేరే శ్రీశైలం, గోదావరి, వంశధార నదుల్లోనూ నీరు అడుగంటిపోయింది. వరి నారుమడులు పోసి, పొలాన్ని దుక్కులు చేసుకునే పనుల్లో ఉండాల్సిన రైతన్నలు అక్కడక్కడా నారుమళ్లు పోసినా.. దుక్కులు మాత్రం చేపట్టలేదు. ఖరీఫ్‌ పనులతో కళకళలాడాల్సిన పొలాలన్నీ బీడు భూములుగా మారాయి. వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న జాడే కనిపించడం లేదు. 


నీళ్లు లేని నదులు

అడుగంటిన శ్రీశైలం

శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటాయి. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 823.60 అడుగుల వద్ద 43.6145 టీఎంసీల గరిష్ఠ నీటి నిల్వలు ఉన్నాయి.



ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. చెరువుల్లో వెలవెలబోతున్నాయి. వర్షాలు లేక ఇంకా దుక్కులు ప్రారంభించలేదు.


వైఎస్సార్‌ కడప జిల్లాకు కేసీ కెనాలే ప్రధాన నీటి వనరు. జిల్లాలో 63 కిలోమీటర్ల మేర కాలువ ఉంది. ఈ కాలువ కింద 85 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కేసీ కెనాల్‌ ఉప కాలువలు లైనింగ్‌  దెబ్బతింది. పూడిక పేరుకుపోయింది. దీంతో పొలాలన్నీ బీడుగా ఉన్నాయి.


పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనిపించడం లేదు. ఒట్టిగెడ్డ, వీఆర్‌ఎస్‌, పెద్దగెడ్డ, తోటపల్లి, జంఝావతి, వరహాలగెడ్డ ప్రాజెక్టుల్లో నీరు లేక వెలవెలబోతున్నాయి. వర్షాలు పడుతుండడంతో చెరువుల్లోకి నీరు చేరింది. నీరు లేని వరహాలగెడ్డ ప్రాజెక్టును చిత్రంలో చూడొచ్చు.


వంశధార వెలవెల

శ్రీకాకుళం జిల్లాలోని ప్రాజెక్టుల్లో ఇప్పుడిప్పుడే నీరు చేరుతోంది. గొట్టా బ్యారేజీలో ప్రస్తుతం 34.60 మీటర్ల నీరు నిల్వ ఉంది. 112.04 టీఎంసీలు నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. హిరమండలం వద్ద వంశధార ప్రాజెక్టులోకి 44.20 మీటర్లమేర నీరు చేరింది. గతేడాది కంటే నీరు తక్కువగా ఉంది.


 నీరు లేక.. దుక్కులు దున్నక!

శ్రీకాకుళం జిల్లాలో చెరువుల్లోకి నీరు చేరలేదు. మెళియాపుట్టి, లావేరు, పాతపట్నం ప్రాంతాల్లో సాగునీటి చెరువులు.. క్రీడా మైదానాలను తలపిస్తున్నాయి. వంశధార కాలువ, ఆ పక్కనే ఉన్న  చెరువుల్లోనూ నీరు లేదు. దీంతో చాలాచోట్ల దుక్కులు చేపట్టలేదు. 


 జీవనది.. గొంతెండుతోంది

జీవనది గోదావరి రాజమహేంద్రవరంలో ఇలా అడుగంటిపోయింది. గతేడాది ఇదే సమయానికి ధవళేశ్వరంలో గోదావరి నీటి మట్టం 8.20 అడుగులు కాగా.. ప్రస్తుతం 4.50 అడుగులే ఉంది. అప్పట్లో కాల్వలకు 12,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, ఇప్పుడు 5,310 క్యూసెక్కులే వదులుతున్నారు.



నీళ్లులేని పోలవరం కాల్వ

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో చినుకు జాడ లేదు. చెరువులు, వాగులు మైదానాలను తలపిస్తున్నాయి. ప్రతి ఏటా జూన్‌ మొదటి వారంలో వచ్చే పట్టిసీమ జలాలు నెలాఖరు వచ్చినా అతీగతీ లేదు. నీరు ఎప్పటికి విడుదలవుతుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. జూన్‌ నెల సాధారణ సగటు వర్షపాతం 92.3 మిల్లీమీటర్లు కాగా, కేవలం 28.6 మిల్లీమీటర్ల వర్షమే పడింది. బందరు కెనాల్‌కు మరమ్మతులు చేస్తున్నందన నీరు వదలలేదు.


దయనీయంగా సేద్యం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా పొలాలు బీడుగా కనిపిస్తున్నాయి. చెరువులు  నీటి కుంటలను తలపిస్తున్నాయి. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 6.71 లక్షల హెక్టార్లు కాగా.. నీటి కొరతతో చాలా తక్కువ విస్తీర్ణంలో పంటలు వేశారు.


కర్నూలు జిల్లా సి.బెళగల్‌ చెరువు నీటి నిల్వ విస్తీర్ణం 1,250 ఎకరాలు. ఈ చెరువు కింద ఆయకట్టు 355 ఎకరాలు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా వానలు లేక చెరువు నిండలేదు. ఆయకట్టు దుక్కులకు నోచుకోలేదు. వర్షం కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 4,10,964 హెక్టార్లకుగాను 16,897 హెక్టార్లలోనే పంటలు వేశారు.


అనంతపురం జిల్లా బోడిసానిపల్లిలో ఎండిపోయిన చెరువు


నీరు లేని సి.బెళగల్‌ చెరువు



















Updated Date - 2022-06-27T08:30:22+05:30 IST