అప్పులు, ఆత్మహత్యల మధ్య ఖరీఫ్ సేద్యం!

ABN , First Publish Date - 2022-07-05T06:38:22+05:30 IST

ఖరీఫ్ సేద్యం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. సేద్యమంటే భయపడుతూనే, అందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితుల్లో రైతాంగం ఉన్నది....

అప్పులు, ఆత్మహత్యల మధ్య ఖరీఫ్ సేద్యం!

ఖరీఫ్ సేద్యం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. సేద్యమంటే భయపడుతూనే, అందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితుల్లో రైతాంగం ఉన్నది. ఈ పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణం. రైతాంగం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకుండా, చాలాకాలం తర్వాత తమ ప్రభుత్వానికి జూన్‌లోనే సాగు నీరు విడుదల చేసిన ఘనత దక్కిందని చెప్పుకుంటోంది.


సాగు నీరు విడుదల చేయటంతోనే రైతుల సమస్యలు పరిష్కారం కావు. రైతులు సంతోషంగా  సేద్యం ప్రారంభించాలంటే అందుకు సాగు నీటితో పాటు మేలు రకమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, వాటిపై రాయితీలివ్వటంతో పాటు పంటలకు న్యాయమైన మద్దతు ధరలు ప్రకటించి వాటికి చట్టబద్ధత కల్పించాలి. పంటల కొనుగోలుకు పాలక ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి. సేద్యానికి అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వ బ్యాంకులు తక్కువ వడ్డీకి అందించే ఏర్పాట్లు ప్రభుత్వాలు చెయ్యాలి. ఇప్పటివరకు ఈ బాధ్యతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోలేదు. 


పంటలకు మద్దతు ధరల ప్రకటనలో మోదీ ప్రభుత్వం రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతానని చెప్పిన మోదీ ప్రభుత్వం ఆచరణలో చీకట్లనే నింపింది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, డీజిల్ ధరల పెరుగుదలతో సేద్యపు ఖర్చులు అధికమయ్యాయి. వరి ధాన్యం క్వింటాల్‌ ఉత్పత్తి ఖర్చు ఆంధ్రప్రదేశ్‌లో 2600 రూపాయలు. దీనిపై 50 శాతం పెంచి మద్దతు ధర ప్రకటించాలి. కానీ మోదీ ప్రభుత్వం అలా ప్రకటించలేదు.


మద్దతు ధరకు పంట ఖర్చులు, కౌలు ఖర్చు, కుటుంబ శ్రమ, భూమి విలువ, అప్పులకు వడ్డీ కలిపి సేద్యపు ఖర్చు నిర్ణయించి, దానిపై అదనంగా 50శాతం పెంచాలని వ్యవసాయ నిపుణులు సూచించారు. అయితే ఒక్క పంట ఖర్చులనే పరిగణనలోకి తీసుకుని దానిపై 50 శాతం పెంచి రైతుల ఆదాయం రెట్టింపు చేసినట్లు మోదీ ప్రభుత్వం చెప్పుకున్నది. ఇది రైతాంగాన్ని దారుణంగా మోసం చేయటమే. అనేక రాష్ట్రాలు వరికి ఎంత మద్దతు ధర ప్రకటించాలో కేంద్రానికి తెలిపినా అది పట్టించుకోలేదు. మోదీ మోసపూరితమైన మద్దతు ధరల వల్ల ఆంధ్రప్రదేశ్ రైతాంగం దాదాపు 24వేల కోట్ల వరకు నష్టపోయారు. న్యాయమైన గిట్టుబాటు ధరలతో పాటు సంస్థాగత రుణాలు రైతాంగానికి చాలా ముఖ్యం. ప్రతి బడ్జెట్ లోను సంస్థాగత రుణాలు ఎక్కువ కేటాయించామని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా ఆచరణలో రుణాలు పొందుతున్న రైతులు చాలా తక్కువ. ఒక తాజా సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 49.6 శాతం మంది రైతులకు రుణాలు అందటం లేదు. వాణిజ్య బ్యాంకుల నుంచి రైతాంగానికి అందుతున్న రుణాలు 31.1 శాతం మాత్రమే. రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం ప్రాముఖ్యత కలిగిన వ్యవసాయ రంగానికి మొత్తం రుణాల్లో 18శాతం ఇవ్వాలని సూచించినా, దాన్ని బ్యాంకులు పాటించటం లేదు. దీంతో రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి సాగు చేయాల్సి వస్తోంది.


కౌలురైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 16 లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. భూమిపై కౌలు హక్కులు లేకపోవటం వలన నూటికి 90 శాతానికి పైగా కౌలురైతులకు సంస్థాగత రుణాలు, పంట నష్టపరిహారం, పంటల బీమా పరిహారం అందటం లేదు. జగన్ మోహన్ రెడ్డి చేసిన పంట సాగుదార్ల హక్కుల చట్టం అలంకార ప్రాయంగానే ఉంది. కొందరు ఉదారవాద రైతుల ఆమోదం తోనూ, రైతు గ్రూపుల పేరుతో కొద్దిమంది కౌలు రైతులకు మాత్రమే రుణాలు అందాయి.


రైతాంగానికి న్యాయమైన మద్దతు ధరలు ప్రకటించటంలో విఫలమైన మోదీ ప్రభుత్వం, రైతాంగ ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటం చేయలేని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ యోజన, వైఎస్ఆర్ రైతుభరోసా పేరుతో రూ.13,500 ఇచ్చి వారిని ఉద్ధరిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇదే నిజమైతే రైతాంగం ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు.


అందుబాటులోకి వచ్చిన తాజా గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రైతుల సగటు రుణం 2,45,554 రూపాయలు. జాతీయ సగటు 74,121 రూపాయల కన్నా 221శాతం ఎక్కువ. జాతీయ సగటు రుణం కూడా 57 వేల నుంచి రూ.74,121 పెరిగింది. ఎక్కువ కుటుంబాలపై అప్పు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 2020లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 450మంది రైతులు బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారు. పంటలకు న్యాయమైన ధరలు, రైతులందరికీ సంస్థాగత రుణాలు, పంటల కొనుగోళ్లకు ప్రభుత్వాలు బాధ్యత వహించినప్పుడే రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

బొల్లిముంత సాంబశివరావు

Updated Date - 2022-07-05T06:38:22+05:30 IST