సాయం పిసరంతే..!

ABN , First Publish Date - 2020-10-24T11:17:58+05:30 IST

జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1,06,846 హెక్టార్లు (2,67,115 ఎకరాలు). 1.02 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు.

సాయం పిసరంతే..!

పత్తి, వరి పెట్టుబడి హెక్టారుకు రూ.75 వేలు పైమాటే

ఇచ్చే పంట నష్టపరిహారం రూ.15 వేలు

ప్రతి పంటదీ ఇదే పరిస్థితి

2015 స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ ప్రకారం అంచనాలు

ఐదేళ్లలో రెండింతలైన సాగు వ్యయం

అరకొర సాయానికి నెలలుగా నిరీక్షణ

తక్షణ సాయం ఎండమావేనా..?


సుబ్బన్న అనే రైతు నాలుగెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎకరాకు రూ.30 వేలు చొప్పున రూ.1.20 లక్షలు మట్టిలో వేశాడు. సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు కుందూ నది ఉప్పొంగి పంట నీటిపాలైంది. భూమి కోతకు గురైంది. ప్రభుత్వం ఇచ్చే పంట నష్టపరిహారం ఎకరాకు రూ.6 వేలు ప్రకారం రూ.24 వేలే. మిగిలిన అప్పులు ఎలా తీర్చాలి..? అని రైతు కన్నీరు పెడుతున్నాడు. సుబ్బన్న ఒక్కరే కాదు.. భారీ వర్షాలు, వరదల్లో పంట నీటిపాలై అప్పుల వరదలో మునిగిన ప్రతి రైతుదీ ఇదే పరిస్థితి. ప్రకృతి విపత్తులకు ప్రభుత్వ సాయం ‘2015 స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌’ ప్రకారమే చెల్లిస్తున్నారు. ఐదేళ్లలో సాగు వ్యయం రెట్టింపు అయింది. ఆ స్థాయిలో పంట నష్టపరిహారం పెంచడం లేదు. పిసరంత సాయం కూడా ఎప్పుడిస్తారో తెలియని దైన్యం. గత ఏడాది భూమి కోత పరిహారం ఇప్పటికీ ఇవ్వలేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటితో ఇట్టే తెలుస్తుంది. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1,06,846 హెక్టార్లు (2,67,115 ఎకరాలు). 1.02 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. అత్యధికంగా వరి 28,475 హెక్టార్లు, వేరుశనగ 28,692, పత్తి 13,724, పసుపు 4,098, కంది 6,543, మిరప 1,123, ఉల్లి 1,974 హెక్టార్లలో సాగు చేశారు. ఏపుగా పెరుగుతున్న పచ్చని పంటలను చూసి కష్టాలు తీరుతాయని రైతులు ఆశించారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి రసాయన ఎరువులు వేశారు. పంట చేతికొచ్చే సమయంలో గత నెలలో భారీ వర్షాలు.. వరదల రూపంలో నిలువునా ముంచేసింది. కళ్ల ముందే పచ్చని పైర్లు నీటిపాలై కష్టజీవి కంట కన్నీరు మిగిలింది. జిల్ల్లాలో 11,289 మంది రైతులు 6,021.439 హెక్టార్లలో వివిధ పంటలు నీటిపాలై రూ.9.46 కోట్లకు పైగా నష్టపోయారని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది.


పరిహా(రం)సమేనా..?:

ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవడం పాలకుల కర్తవ్యం. తక్షణ సాయం అందించి వ్యవసాయంపై అన్నదాతకు భరోసా కల్పించాలి. అలాగే పెట్టుబడికి అనుగుణంగా సాయం చేయాలి. కాగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో భారీ వర్షాలు, వరదలకు పలు పంటలు నీటి మునిగి రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు. వ్యవసాయ అధికారులు గ్రామాలకు వెళ్లి పంట నష్టం సర్వే చేసి నివేదిక పంపారు. ఇంతవరకు భాగానే ఉంది. ప్రభుత్వం ఇస్తున్న సాయం ఎంత..? అంటే ప్రధాన పంటలు పత్తి, వేరుశనగ, వరి, చెరకు హెక్టారుకు రూ.15 వేలు. అంటే ఎకరాకు రూ.6 వేలు అన్నమాట.


పప్పుదినుసు పంటలు కంది, పెసర, మినుము, అలసంద, పొద్దుతిరుగుడు పంటకు హెక్టారుకు రూ.10 వేలు (ఎకరాకు రూ.4 వేలు). ఆముదం, సజ్జ, జొన్న, వరిక పంటలకు హెక్టారుకు రూ.6,500 (ఎకరాకు రూ.2,600). కొర్రకు హెక్టారుకు రూ.5 వేలు (ఎకరాకు రూ.2 వేలు), మొక్కజొన్న హెక్టారుకు రూ.12 వేలు (ఎకరాకు రూ.4,800) ప్రకారం అంచనా వేశారు. 2015 స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌  ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు ఇవి. అరకొర పరిహారం పెట్టుబడి వడ్డీలకు కూడా సరిపోవడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


రెట్టింపైన పెట్టుబడి

2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుల వల్ల రైతులు పంటలు కోల్పోతే నాటి పెట్టుబడి వ్యయం ఆధారంగా ఏయే పంటకు ఎంత పరిహారం చెల్లించాలో నిర్ణయించారు. దానినే స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ అంటారు. దాని మేరకు వ్యవసాయాధికారులు పంట నష్టపరిహారం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. ఏటేటా పెరుగుతున్న సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ పెంచాలని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.


అప్పుడే రైతుకు ఆర్థిక చేయుత కొంతైనా లభిస్తుంది. అయితే.. 2015 నుంచి స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ పెంచలేదని, నాడు నిర్ణయించిన రేట్ల ప్రకారం నష్ట పరిహారం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. 2015లో ఉన్న ఎరువులు, పురుగు మందుల ధరలతో పాటు సేద్యం, కూలీల ఖర్చులు మూడింతలు పెరిగాయి. ఆ మేరకు ఏ పంటకు ఎంత పరిహారం ఇవ్వాలో స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ నిర్ణయించి సాయం చేయాలని, ఆ ప్రకారం స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ రెట్టింపు చేయాలని రైతులు కోరుతున్నారు. 


జిల్లాలో సెప్టెంబరులో పంట నష్టం (హెక్టారు), 2015 నాటి స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ ప్రకారం పరిహారం రూ.లక్షల్లో


పంటలు రైతులు పంటనష్టం పరిహారం

సజ్జ          123  58.206 3,95,800

మినుము        737  600.523 60,05,230

ఆముదం       13 11.394 77,479

పత్తి        2,515   1,343.752  2,01,56,280

అలసంద     7 7.29          72,900

పెసర            141     109.226  10,92,260

వేరుశనగ       1,192   844.698   1,26,70,470

జొన్న         41 36.559 2,48,601

కొర్ర         631 408.375 20,41,875

మొక్కజొన్న     14 11.446 1,43,075

వరి     3,423     1,809.784 2,71,46,760

కంది     226     124.20         12,42,040

సన్‌ ఫ్లవర్‌ (ఎస్‌ఎఫ్‌)46 42.349 4,23,490

వరిగ 1 1.670 8,350

ఇసుక మేటలు 6 2.26     27,572

భూమి కోత 1,973 609.70 2,28,63,892


మొత్తం 11,289 6,021.439 9,46,16,075


వ్యవసాయం పెట్టుబడి వ్యయం పెరుగుదల రూ.లక్షల్లో (సుమారుగా):


పెట్టుబడి 2015 2020

డీఏపీ         870 1,300

కాంప్లెక్స్‌ ఎరువు             800 1,000

యూరియా 249 (50 కేజీలు) 266 (45 కేజీలు)

దున్నకం ఎకరా ట్రాక్టరు బాడుగ 400 700-800

ఎద్దుల గెలిమి బాడుగ                 700 1,500

విత్తు, కలుపు కూలీ ఒకరికి         200         400

వరి పంట కోత ఎకరాకు 1,000 2,800

వేరుశగన నూర్పిడి ఎకరాకు         3,000 7,000-8,000


ప్రభుత్వ సాయం పెంచాలి - వెంకట సుబ్బారెడ్డి, అన్నవరం గ్రామం, చాపాడు మండలం

ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. భారీ వర్షాలకు కుందూనది ఉప్పొంగి పంట నీట మునిగింది. ఎకరాకు రూ.20 వేలు చొప్పున 80 వేలు పెట్టుబడి నీటి పాలైంది. పరిహారం ఎకరాకు రూ.4,500 ఇస్తున్నారు. రూ.15 వేలకు పెంచి తక్షణమే ఇవ్వాలి. అప్పుడే రైతుకు కొంతైనా ఉపసమనం కలుగుతుంది. 


పెట్టుబడి రూ.25 వేలు.. సాయం రూ.6 వేలా.? - సుబ్బన్న, పత్తి రైతు, టంగుటూరు, రాజుపాలెం మండలం

నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. అధిక వర్షాలకు కుందూ ఉప్పొంగి పంటంతా నీటి పాలైంది. పొలం కోతకు గురై సాగుకు పనికి రాకుండాపోయింది. ఎరువులు, పురుగు మందుల ధరలు, సేద్యం, కూలీ రేట్లు పెరగడంతో ఎకరాకు రూ.25 వేలకు పైగా ఖర్చు వచ్చింది. ప్రభుత్వ సాయం రూ.6 వేలు ఇస్తారంటా. ఇదెక్కడి న్యాయం. ఎకరాకు రూ.15-20 వేలు ఇస్తేనే రైతుకు ఆర్థిక భరోసా లభిస్తుంది. లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోక తప్పదు. 

Updated Date - 2020-10-24T11:17:58+05:30 IST