ఖర్గే x థరూర్‌

ABN , First Publish Date - 2022-10-02T09:23:07+05:30 IST

కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో ఇద్దరే మిగిలారు. కర్ణాటకకు చెందిన 80 ఏళ్ల సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే, కేరళకు చెందిన 66 ఏళ్ల నేత శశిథరూర్‌ మధ్య పోటీ కొనసాగనుంది.

ఖర్గే x థరూర్‌

కాంగ్రెస్‌ అధ్యక్ష  రేసులో మిగిలింది ఇద్దరే.. 


న్యూఢిల్లీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో ఇద్దరే మిగిలారు. కర్ణాటకకు చెందిన 80 ఏళ్ల సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే, కేరళకు చెందిన 66 ఏళ్ల నేత శశిథరూర్‌ మధ్య పోటీ కొనసాగనుంది. ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కేఎన్‌ త్రిపాఠి నామినేషన్‌ తిరస్కరణ గురైంది. మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి ఖర్గే రాజీనామా చేశారు. ఉదయ్‌పూర్‌ చింతన్‌ శిబిరంలో తీర్మానం మేరకు ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ నిబంధనను అనుసరించి రాజీనామా చేస్తున్నానని శుక్రవారం రాత్రే ఖర్గే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. దీంతో రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి మరో నేతను సోనియాగాంధీ ఎంపిక చేయనున్నారు. ఈ  విషయాన్ని రాజ్యసభ చైర్మన్‌కూ ఆమె తెలియజేయనున్నారు. కాగా, గాంధీ కుటుంబంతోపాటు పలువురు సీనియర్‌ నేతల మద్దతు ఖర్గేకు ఉన్నందున ఆయన విజయం ఖాయమని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే తటస్థంగా ఉండటం కోసం సోనియా, రాహుల్‌, ప్రియాంక ఓటింగ్‌లో పాల్గొనబోరని ఆవర్గాలు తెలిపాయి. మరోవైపు ఖర్గే, తాను శత్రువులం కాదని, సహచరులమని శశిథరూర్‌ స్పష్టీకరించారు. ఖర్గే పట్ల తనకు ఎటువంటి వ్యతిరేకతా లేదని విలేకరులకు చెప్పారు. ఖర్గేను కాంగ్రెస్‌ భీష్మ పితామహుడుగా థరూర్‌ అభివర్ణించారు. తమది స్నేహపూర్వక పోటీ అని ట్వీట్‌ చేశారు. జీ-23 గ్రూప్‌నకు శశిథరూర్‌ తాను ఎన్నికయితే పార్టీ హై కమాండ్‌ సంస్కృతిని మారుస్తానని ప్రకటించారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మొత్తం 20 నామినేషన్‌ పత్రాలు దాఖలవగా నాలుగు తిరస్కరణకు గురయ్యాయని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్ర్తీ శనివారం ప్రకటించారు.  


రాజస్థాన్‌ సీఎం గహ్లోతే!

 జైపూర్‌: రాజస్థాన్‌ సీఎంగా తానే కొనసాగనున్నట్టు అశోక్‌ గహ్లోత్‌ సంకేతాలు పంపారు. వచ్చే బడ్జెట్‌కు సంబంధించి సూచనలను నేరుగా తనకు పంపాలని శనివారం ప్రజలకు పిలుపునిచ్చారు. మెరుగైన బడ్జెట్‌ కోసం యువత, విద్యార్థులు సూచనలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుందని ప్రకటించారు.


కొవిడ్‌ మృతులకు పరిహారం ఇవ్వరేం? : రాహుల్‌ ట్వీట్‌

కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్ల ఆక్సిజన్‌ అందక మరణించిన కొవిడ్‌ బాధిత  కుటుంబాలకు పరిహారం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని గుండ్లుపేటలో మృతుల కుటుంబ సభ్యులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన రాహుల్‌ ‘తండ్రిని కోల్పోయిన ప్రతీక్ష ఆవేదనను వినండి. కొవిడ్‌ బాధితుల న్యాయమైన పరిహారం ఇప్పించండి’ అంటూ ప్రధాని మోదీని నిలదీస్తూ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-10-02T09:23:07+05:30 IST