ఖరీఫ్‌కు.. ఊపిరి

ABN , First Publish Date - 2022-07-12T06:15:29+05:30 IST

ముసురు వానలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల వరకు వాన కోసం ఆకాశం కోసం ఆతృతగా రైతులు ఎదురుచూశారు.

ఖరీఫ్‌కు.. ఊపిరి
అత్తోటలో వెద పద్ధతిలో వరిసాగు

జిల్లావ్యాప్తంగా ముసురువాన

వానలతో ముమ్మరంగా సాగు పనులు 

డెల్టాలో వెద పద్ధతిలో 50 శాతం వరి 

పత్తి కళకళ.. మిరపనాట్లకు సమాయత్తం 

పసుపు, పచ్చిరొట్ట పైర్లు వేస్తున్న రైతులు


 

         (గుంటూరు - ఆంధ్రజ్యోతి) 

ముసురు వానలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల వరకు వాన కోసం ఆకాశం కోసం ఆతృతగా రైతులు ఎదురుచూశారు. వారి ఆశలను నెరవేరుస్తూ రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఖరీఫ్‌కు ఊపిరిపోశాయి. జూన్‌లో వానలు తక్కువగా ఉండటంతో ఖరీఫ్‌ సాగుపై రైతన్నలు ఆందోళన చెందారు. అయితే జూలైలో ఇప్పటి వరకు చూస్తే అధిక వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌లో భూమి పదునయ్యే వర్షాలతో విత్తనం వేసే పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పత్తిమొక్కలు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 80 శాతం పత్తి సాగు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మరో నాలుగురోజుల్లో మిగిలిన 20 శాతం కూడా పూర్తవుతుందని రైతులు చెబుతున్నారు. భూమిబాగా పదును కావటంతో మిరపనారు పోయడానికి పల్నాడు రైతులు సిద్ధమవుతున్నారు. వెద పద్ధతిలో తెనాలి ప్రాంతంలో 50 శాతం వరి సాగు పూర ్తయినట్లు అగ్రి అధికారులు తెలిపారు.  వర్షాలతో కొన్నిదగ్గర్ల వరిసాగుకు స్వల్ప అంతరాయం కలిగింది. ఎండలు కాస్తే డెల్టాలో వెద పద్ధతిలో వరిసాగు, పల్నాడు, మిగిలిన ప్రాంతాలలో పత్తి సాగు వందశాతం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. వరినారుకు ఖర్చులు పెరగడం, కూలీలు, కలుపు తదితర సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది రైతులు వెద వరి సాగుకు మొగ్గుతున్నారు. జిల్లావ్యాప్తంగా 50 శాతం పసుపు కొమ్ములు నాటినట్లు అగ్రి అధికారులు తెలిపారు.   మిరప, ఇతర పంటలలో చీడపీడ నివారణ, భూమిలో పోషక విలువలను పెంచడానికి రైతులు ఖరీఫ్‌లో పచ్చిరొట్టపైర్లు వేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ఈ సారి పచ్చిరొట్ట పైర్లు పెసర, జీలుగ, అలసంద, జనుము, పిల్లిపెసర పంటలను వేశారు.  పచ్చిరొట్టపైర్లు సాగుచేసిన భూముల్లో గత ఏడాది మిరప చీడపీడలను తట్టుకొంది. దీంతో ఈ ఏడాది ఎక్కువ మంది మిరప రైతులు దుక్కుల్లో పచ్చిరొట్ట పైర్లు వేస్తున్నారు.  

 

 

Updated Date - 2022-07-12T06:15:29+05:30 IST