ఆదమరిస్తే యమపురికే!

ABN , First Publish Date - 2022-06-21T04:50:22+05:30 IST

ఈ రోడ్డు మృత్యుస్థలిగా గుర్తింపు పొందింది. ఆదమరిస్తే వాహనదారులు

ఆదమరిస్తే యమపురికే!
సాగర్‌హైవే ఆగాపల్లి రహదారిపై ప్రమాదకరంగా ఉన్న ఖానాపూర్‌ పాలబూత్‌ సర్కిల్‌

  • మృత్యుస్థలిగా ఖానాపూర్‌ పాలబూత్‌ సర్కిల్‌
  • సాగర్‌ హైవేపై ప్రమాదకరంగా డివైడర్‌
  • అక్కడే రోడ్డు కుదింపు.. అతివేగంతో యాక్సిడెంట్లు


ఈ రోడ్డు మృత్యుస్థలిగా గుర్తింపు పొందింది. ఆదమరిస్తే వాహనదారులు యమపురికి వెళ్లాల్సిందే.. ఇప్పటికీ ఆ దారిలో లెక్కలేనన్ని ప్రమాదాలు జరిగాయి. ఎంతోమంది మృత్యువాత పడ్డారు.. మరెందరో క్షతగాత్రులయ్యారు. ప్రమాదాలు జరిగినపుడు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడమే కానీ.. ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలూ ఉండవు. సాగర్‌ హైవేపై ప్రమాద భరిత ప్రదేశంగా గుర్తింపు పొందిన ఖానాపూర్‌ పాలబూత్‌ సర్కిల్‌పై ‘ఆంఽధజ్యోతి’ ప్రత్యేక కథనం.. 


మంచాల, జూన్‌ 20 : మంచాల మండలం నాగార్జున సాగర్‌హైవేపై ఉన్న ఆగాపల్లి, ఇబ్రహీంపట్నం మధ్యనున్న పాలబూత్‌ సర్కిల్‌  రోడ్డుప్రమాద నిలయంగా గుర్తింపు పొందింది. ఖానాపూర్‌ గేటు సమీపంలో కొద్దిదూరంలో పాలబూత్‌ సర్కిల్‌ ఉంటుంది. ఇబ్రహీంపట్నం నుంచి ఫోర్‌లేన్‌ రోడ్డు ఇక్కడివరకే విస్తరించారు. రోడ్డుమధ్యలో ఉండే డివైడర్‌ ఇక్కడే ఎండ్‌ చేసి సర్కిల్‌ ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచి సాగర్‌ రహదారి డబుల్‌ లేన్‌గా ఉంటుంది. గురునానక్‌ వైపునుంచి ఎత్తుప్రదేశంగా ఉంటూ పాలబూత్‌ సర్కిల్‌ వద్దకు వచ్చేసరికి దిగుడు ప్రదేశంగా ఉంటుంది. దీంతో హైదరాబాద్‌ వైపు వచ్చేవాహనాలు దిగువకు వచ్చేసరికి మరింతవేగాన్ని పుంజుకుంటాయి. ఈ సర్కిల్‌కు వచ్చేసరికి డబుల్‌రోడ్డు ఎండ్‌లో డివైడర్‌ ఉంటుంది. స్పీడుగా వచ్చే వాహనదారులు అకస్మాత్తుగా వచ్చే డివైడర్‌ను గుర్తించలేకపోతున్నారు. దీంతో ఇక్కడ కనురెప్పపాటులో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఇక్కడ పలు ప్రమాదాలు జరిగాయి. జేసీబీని తీసుకొస్తున్న లారీ డ్రైవర్‌ పాలబూత్‌ సర్కిల్‌ వద్ద ఉన్న డివైడర్‌ను గుర్తించలేకపోయాడు. డివైడర్‌ను తప్పించడానికి ప్రయత్నించడంతో వెనుక ట్రాలీ మీద ఉన్న జేసీబీ కింద పడిపోయాడు. అదేవిధంగా స్పీడ్‌గా వచ్చిన లారీ ఏకంగా డివైడర్‌ మీదకు దూసుకుపోయింది. దీంతో లారీ ముందు భాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదాల్లో ఎవరికీ ఏమీ కాకున్నా.. గతంలో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృత్యువాతపడగా.. మరెంతోమంది క్షతగాత్రులయ్యారు. హైవే కావడంతో ప్రమాదం జరగ్గానే అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేస్తున్నారు. కానీ సంబందిత యంత్రాంగం ప్రమాదాల శాశ్వత నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


టెక్నికల్‌ సమస్య ఉంది

పాలబూత్‌ సర్కిల్‌వద్ద టెక్నికల్‌ సమస్య ఉంది. ఫోర్‌లేన్‌ రోడ్డు ఇక్కడే ఎండ్‌ అవుతుంది. డివైడర్‌ ఎండ్‌ కూడా ఇక్కడే పెట్టారు. ఆ తర్వాత సాగర్‌రహదారి ఎత్తు ప్రాంతం. పైగా డబుల్‌ లేన్‌ రోడ్డు. అటువైపు వచ్చే వాహనాలు దిగుడు ప్రాంతం కావడంతో అతివేగంగా వస్తాయి. ఈ సమయంలోనే డబుల్‌ రోడ్డు ఎండ్‌ అయ్యే ప్రాంతంలో ఎదురుగా డివైడర్‌ ఉంటుంది. అకస్మాత్తుగా వాహనాలను డివైడర్‌ను తప్పించుకుంటూ ఫోర్‌లేన్‌ రోడ్డులోకి మళ్లించాల్సి ఉంటుంది. దీంతో రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతున్నాయి.

- దన్నె బాషయ్య, వైస్‌ఎంపీపీ, బీజేపీ జిల్లా నేత


ప్రమాదాల నివారణకు చర్యలు

పాలబూత్‌ సర్కిల్‌ వద్ద ప్రమాదకర పరిస్థితి ఉన్నది వాస్తవమే. దీనిపై ఎమ్మెల్యే మంచిరెడ్డికిషన్‌రెడ్డి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు సైతం జారీచేశారు. సాధ్యమైనంత త్వరగా నిధులు విడుదల చేయించి రహదారి విస్తరించేందుకు కృషి చేస్తాం. సత్వర చర్యగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసేలా యంత్రాంగానికి నివేదించాం.

- ముచ్చర్ల వెంకటేష్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు


ఫోర్‌వేగా విస్తరించాలి

ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడి చేస్తున్నారు. తర్వాత పట్టించుకోవడంలేదు. నాలుగైదు ఏళ్లుగా పాలబూత్‌ సర్కిల్‌ వద్ద అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. డివైడర్‌ వేసేటపుడే అధికారులు ఈ సమస్యను గుర్తించాల్సి ఉంది. ఆ తర్వాతనైనా ఏమీ చేయలేకపోయారు. కనీసం రోడ్డును గురునానక్‌ కళాశాల వరకైనా ఫోర్‌వేగా విస్తరించాలి. అప్పుడే ప్రమాదాలు నివారించవచ్చు. దీనిపై అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి.

- రావుల జంగయ్య, సీపీఎం నేత



Updated Date - 2022-06-21T04:50:22+05:30 IST