మూడో వారంలో ఖమ్మం వస్తా..

ABN , First Publish Date - 2020-06-05T10:13:04+05:30 IST

‘ఈనెల మూడోవారంలో ఖమ్మం వస్తా. అభివృద్ధి పనులను పరిశీలిస్తా.

మూడో వారంలో ఖమ్మం వస్తా..

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తిచేయండి

నగరపాలక సంస్థ పురోగతిపై సమీక్షలో మంత్రి కేటీఆర్‌

హాజరైన మంత్రి పువ్వాడ, కలెక్టర్‌ కర్ణన్‌, కమిషనర్‌


ఖమ్మం కార్పోరేషన్‌, జూన్‌4: ‘ఈనెల మూడోవారంలో ఖమ్మం వస్తా. అభివృద్ధి పనులను పరిశీలిస్తా. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నగరపాలక సంస్థలో పనులు పూర్తిచేయండి’ అని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ఖమ్మం నగరపాలక సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కలెక్టర్‌ ఆర్‌వీ. కర్ణన్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌జయంతి హాజరయ్యారు. మంత్రి కేటీఆర్‌ ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి గురించి ఆరా తీశారు. దీంతో మంత్రి పువ్వాడ నగరాభివృద్ధి కోసం చేపట్టిన చర్యల నివేదికను కేటీఆర్‌కు అందజేశారు.


ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో రహదారుల నిర్వహణతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గ్రీనరీల ఏర్పాటు, కూడళ్ల అభివృద్ధి, పబ్లిక్‌ టాయ్‌లెట్ల నిర్మాణాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అంతేకాకుండా ప్రజలకు రక్షితనీరు అందించే మిషన్‌ భగీరథ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మౌలికవసతుల నిర్మాణాల్లో కాంట్రాక్టర్ల అలసత్వం ఉంటే వారిని వెంటనే తొలగించి, వేరే కాంట్రాక్టర్‌కు అప్పగించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.


నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ పధకాల అమలుతీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కోరారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రస్తుతం జరుగుతున్న పనులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేయాలని మంత్రి కేటీఆర్‌ కలెక్టర్‌, కమిషనర్‌ను ఆదేశించారు. నగరాభివృద్ధికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.  

Updated Date - 2020-06-05T10:13:04+05:30 IST