ఖమ్మం సద్దులబతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2020-10-25T05:45:14+05:30 IST

తీరొక్క పూలతో తీర్చిదిద్దిన అందమైన బతుకమ్మలు, పూల పరిమళాలతో గుబాళించిన విరుల ఘాట్లు అందరినీ ఆకర్షించాయి.

ఖమ్మం సద్దులబతుకమ్మ వేడుకలు

బతుకమ్మ.. పోయిరావమ్మ

ముగిసిన పూల పండుగ వేడుకలు

ఆట, పాటలతో హోరెత్తిన నిమజ్జన ఘాట్లు 


కొత్తగూడెం సాంస్కృతికం/ ఖమ్మం సాంస్కృతికం,  అక్టోబరు 24: తీరొక్క పూలతో తీర్చిదిద్దిన అందమైన బతుకమ్మలు,  పూల పరిమళాలతో గుబాళించిన విరుల ఘాట్లు అందరినీ ఆకర్షించాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. చిత్తు చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మా... అంటూ బతుకమ్మ పాటలతో పుడమి పులకించిపోయింది. సద్దుల బతుకమ్మ సంబరాలు శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అంబరాన్నంటాయి. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ బతుకమ్మతో సందడి చేశారు.  తంగేడు, లిల్లీ, బంతి, చామంతి, లిల్లీ, కట్ల, గునుగు, కలువ, మందార, గుమ్మడి వంటి రకరకాల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


అనంతరం బతుకమ్మలను తమ కూడళ్లల్లో ఉంచి ఆట, పాటలతో సందడి చేశారు. అక్కడి నుంచి ఘాట్ల వద్దకు బతుకమ్మలను సామూహికంగా ఎత్తుకొని వాగులు, చెరువుల వద్ద ఉంచి అక్కడ ఆట, పాటలతో తెలంగాణ సంస్కృతి సంప్రదించేలా ఆడి, పాడారు. అనంతరం వెళ్లి రావమ్మ, మళ్లీ రావమ్మ అంటూ గౌరమ్మను సాగనంపుతూ బతుకమ్మలను నీళ్లలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా తమ వెంట తెచ్చుకున్న సత్తుపిండి ప్రసాదాలను ఒకరినొకరు వాయనంగా సమర్పించుకొని మహిళలు తమలోని ఆప్యాయతను చాటుకున్నారు.  

Updated Date - 2020-10-25T05:45:14+05:30 IST