‘ఇండస్‌’ బోగస్‌లో మనోళ్లు.. అరెస్టయిన వారిలో ఇద్దరు జిల్లావాసులు

ABN , First Publish Date - 2021-03-08T06:04:36+05:30 IST

‘మీరు నిరుద్యోగా? స్వయం ఉపాధి కోసం వెతుకుతున్నారా? ఆర్థిక స్థోమతను ఇంకా పెంచుకోవాలనుకుంటున్నారా? ఫుల్‌టైం, పార్ట్‌ టైం, ఎనీ టైం అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన పనిలేకుండానే నెలకు రూ.లక్షల్లో ఆదాయం మీ సొంతం’ ఇదీ పలు మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఊదరగొట్టే ప్రచారం.

‘ఇండస్‌’ బోగస్‌లో మనోళ్లు.. అరెస్టయిన వారిలో ఇద్దరు జిల్లావాసులు
మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసాలపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం

బాధితుల ఎందరున్నారోనన్న అనుమానాలు

ఉమ్మడి జిల్లాలో మరికొన్ని కంపెనీల ఉనికి

మల్టీలెవల్‌ మార్కెటింగ్‌పై ముందే హెచ్చరించిన ‘ఆంధ్రజ్యోతి’

ఖమ్మం, మార్చి7 (ఆంధ్రజ్యోతి): ‘మీరు నిరుద్యోగా? స్వయం ఉపాధి కోసం వెతుకుతున్నారా? ఆర్థిక స్థోమతను ఇంకా పెంచుకోవాలనుకుంటున్నారా? ఫుల్‌టైం, పార్ట్‌ టైం, ఎనీ టైం అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన పనిలేకుండానే నెలకు రూ.లక్షల్లో ఆదాయం మీ సొంతం’ ఇదీ పలు మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఊదరగొట్టే ప్రచారం. ఆయా కంపెనీల ముసుగులో పడి చాలామంది మోసపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ఉత్పత్తులు వాడి అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి కంపెనీల్లో ఇండస్‌ వీవా సంస్థ ఒకటి. సుమారు 10 లక్షల మందిని ముంచిన సదరు కంపెనీ ఆనవాళ్లు ఖమ్మం జిల్లాలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సదరు కంపెనీకి చెందిన నిర్వాహకులతోపాటు కార్యకలాపాలు నిర్వహించేవారిలో ఖమ్మం జిల్లా వాసులు ఉండటంతో జిల్లా ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శనివారం హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ దానికి సంబంధించి అరెస్టు చేసిన వారి వివరాలతో పాటు సదరు సంస్థ మోసాలకు పాల్పడుతున్న తీరును వివరించగా.. అందులో ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఇద్దరు ఉండటం గమనార్హం. కాగా దానికి సంబంధించిన బాధితులు ఎంతమంది ఉన్నారనేది తేలాల్సి ఉండగా వేల సంఖ్యలో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ ఒక్క కంపెనీనే కాకుండా మరికొన్ని కంపెనీలకు చెందిన ఆనవాళ్లు కూడా జిల్లాలో ఉన్నట్టు సమాచారం. ఆయా కంపెనీలు జిల్లాలో జోరుగా దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించి జిల్లాలో ఏజెంట్లను నియమించుకుని దందా చేస్తుండగా... నమ్మిన ప్రజలు మోసపోతున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసాలపై ‘ఆంధ్రజ్యోతి’ ముందుగానే హెచ్చరించింది. ఈ క్రమంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లాలో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసాలపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-03-08T06:04:36+05:30 IST