పంచముఖ మహాలక్ష్మీగణపతి

ABN , First Publish Date - 2022-06-28T15:53:59+05:30 IST

మట్టి గణపతిగా తయారవుతున్న ఖైరతాబాద్‌ గణేషుడు ఈసారి పంచముఖ మహాలక్ష్మీగణపతి గా భక్తుల పూజలు అందుకోనున్నాడు. ఎత్తు తగ్గకుండా

పంచముఖ మహాలక్ష్మీగణపతి

ఖైరతాబాద్‌ గణేష్‌ విగ్రహ నమూనా ఆవిష్కరణ

హైదరాబాద్/ఖైరతాబాద్‌: మట్టి గణపతిగా తయారవుతున్న ఖైరతాబాద్‌ గణేషుడు ఈసారి పంచముఖ మహాలక్ష్మీగణపతి గా భక్తుల పూజలు అందుకోనున్నాడు. ఎత్తు తగ్గకుండా మట్టితో పర్యావరణ హితంగా సిద్ధమవుతున్న ఈ గణపతి నమూనాను ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ సోమవారం విడుదల చేసింది. మహాలక్ష్మీదేవి సమేతంగా ఐదు తలలు, ఆరు చేతులతో కమలం పువ్వులో నిలబడే గణపతికి ఆదిశేషుడు 7 పడగల నీడను కల్పిస్తున్నట్లు కమిటీ నేతలు తెలిపారు. ప్రముఖ డిజైనర్‌ శరత్‌ నల్లనాగుల, విగ్రహ ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌తో కలసి నమూనాను రూపొందించారు. 50 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో ఉండే గణపతికి కుడివైపున షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎడమ వైపున త్రిశక్తి మహా గాయత్రీదేవి విగ్రహాలు 12 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో తయారుచేయనున్నారు. ఇప్పటికే గణపతి నిర్మాణంలో భాగంగా స్టీల్‌ వెల్డింగ్‌ పనులు దాదాపు 60 శాతం పూర్తవగా ఆగస్టు 31కి ముందే విగ్రహాన్ని సిద్ధం చేస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌, కన్వీనర్‌ సందీ్‌పరాజ్‌, కార్పొరేటర్‌ విజయారెడ్డి తెలిపారు. నమూనా ఆవిష్కరణలో గ్రంథాలయాల కమిటీ చైర్మన్‌ ప్రసన్న, కమిటీ సభ్యులు మహే్‌షయాదవ్‌, గజ్జెల రమేష్‌, రాజ్‌కుమార్‌, మధుకర్‌ యాదవ్‌, వేణుగోపాల్‌, పాశం రాజు, వీణా మాధురి, అజ్జెల అజయ్‌, రాచప్ప, బాల్‌కుమార్‌ పాల్గొన్నారు.


సహజరంగులు

మట్టితో తయారైనా నిమజ్జనానికి ఎలాంటి అంతరాయం లేకుండా సాగర తీరం వరకు వెళ్లేలా గణపతిని పటిష్టంగా తయారు చేస్తున్నట్లు విగ్రహ శిల్పి రాజేంద్రన్‌ తెలిపారు. పీవోపీ వాడకుండా విగ్రహం గట్టిపడేందుకు 35 కిలోల రాజస్థాన్‌ మట్టి 1000 బ్యాగులు, ఏలూరు నుంచి టన్నున్నర జూట్‌ పౌడర్‌, 16 టన్నుల స్టీలు, అవసరం మేరకు యాదాద్రి వలిగొండ నుంచి వరిగడ్డి, వరిపొట్టు, 1000 మీటర్ల సన్నటి వస్త్రంతోపాటు సహజ రంగులను వినియోగిస్తున్నారు. విగ్రహ షెడ్డు కోసం నర్సాపూర్‌ నుంచి 16 టన్నుల సరివి కర్రలను వినియోగిస్తుండగా, ఆదిలాబాద్‌ కళాకారులు షెడ్డు నిర్మించారు. ఒడిశాకు చెందిన జోగారావు నేతృత్వంలో 100 మంది మట్టి కళాకారులు,  మచిలీపట్నంకు చెందిన వెల్డింగ్‌ కళాకారులు, కాకినాడకు చెందిన సత్య ఆర్స్ట్‌ వారు గణపతి విగ్రహ ఏర్పాటులో పాల్గొంటున్నారు. 


గౌరీభట్ల విఠల శర్మ సిద్ధాంతి సూచనతో..

నగరానికి చెందిన ప్రముఖ దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ సిద్ధాంతి సూచనల మేరకు ఈ సారి లక్ష్మీసమేత గణపతిని తయారు చేస్తున్నట్లు కమిటీ చైర్మన్‌ సుదర్శన్‌ తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి గట్టెక్కి ఇప్పుడిప్పుడే ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాలు నిలదొక్కుకుంటున్నాయని, పంచముఖ గణపతిని పూజించడం వల్ల సర్వజనులకు శుభాలు కలుగుతాయని వివరించినట్లు తెలిపారు.  

Updated Date - 2022-06-28T15:53:59+05:30 IST