రూట్‌ క్లియర్‌..నిమజ్జనానికి అంతా సిద్ధం

ABN , First Publish Date - 2021-09-18T14:20:05+05:30 IST

ఆదివారం జరిగే మహా నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. నగరంలోని విగ్రహాలు తరలే దారులను శుక్రవారం పరిశీలించారు. హైదరాబాద్‌ పోలీస్‌

రూట్‌ క్లియర్‌..నిమజ్జనానికి అంతా సిద్ధం

ఆదివారం జరిగే మహా నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. నగరంలోని విగ్రహాలు తరలే దారులను శుక్రవారం పరిశీలించారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు ఉన్న రూట్‌ను పరిశీలించారు. ప్రతి క్రేన్‌ వద్ద ఒక పోలీస్‌ అధికారి, మండపాల నుంచి వచ్చే ఒక్కో విగ్రహంతో ఒక కానిస్టేబుల్‌ ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. 


ప్రత్యేక టెక్నాలజీతో తక్కువ వ్యవధిలో జరిగేలా ఏర్పాట్లు 

బాలాపూర్‌ టు ట్యాంక్‌బండ్‌ రూట్‌ పరిశీలించిన సీపీ

సిటీ అంతా కెమెరాల నిఘా

మహా నిమజ్జనానికి భారీ బందోబస్తు


హైదరాబాద్‌ సిటీ: నిమజ్జనం నిమిత్తం వివిధ ప్రాంతాలు, జోన్లకు ఉన్నతాధికారులు ప్రాతినిధ్యం  వహిస్తున్నారు. వారిలో అదనపు సీపీలు షికాగోయెల్‌, డీఎస్‌ చౌహాన్‌, ఐజీపీ విజయ్‌కుమార్‌, జాయింట్‌ సీపీలు ఏఆర్‌ శ్రీనివాస్‌, పి.విశ్వప్రసాద్‌, ఎం.రమేశ్‌, డీసీపీలు కలమేశ్వర్‌, గజరావు భూపాల్‌, రాధాకిషన్‌రావు, ఎల్‌ఎస్‌ చౌహాన్‌, అదనపు డీసీపీ ముత్యంరెడ్డి ఉన్నారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీపీ చెప్పారు. డ్రోన్లు వాడటం లేదన్నారు. ఈ ఏడాది నిమజ్జనానికి వినియోగిస్తున్న నూతన సాంకేతికత వల్ల ప్రతీ విగ్రహానికి 4 నుంచి 6 నిమిషాల సమయం ఆదా అవుతుందన్నారు.


సీపీ టు పీసీ

నగరంలో పోలీస్‌ కమిషనర్‌తో పాటు అదనపు సీపీలు, జాయింట్‌ సీపీలు, డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఎస్‌పిఓలు, హోంగార్డులతో పాటు జిల్లా పోలీసులు, కేంద్రబలగాలు, ఇతర విభాగాల నుంచి ఐజీ, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు, సిఐలు ఇతర సిబ్బంది మొత్తం 19 వేలకు పైగా సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు సీపీ తెలిపారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ బృందాలు అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉంటాయి. విధి నిర్వహణకు ఇతర జిల్లాల నుంచి వస్తున్న సిబ్బందికి ఆహార, వసతి ఏర్పాట్లపై కూడా పోలీసు అడ్మిన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌తో పాటు రాజన్నబౌలి, మీరాలం ట్యాంక్‌, ఎర్రకుంట, షేక్‌పేట్‌ నాలా, సరూర్‌నగర్‌ చెరువు, సఫిల్‌గూడ/మల్కాజిగిరి ట్యాంక్‌, హష్మత్‌పేట్‌ లేక్‌లలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


3 గంటల లోపే గంగమ్మ ఒడికి

ఖైరతాబాద్‌ : ఖైరతాబాద్‌ పంచముఖ రుద్ర మహా గణపతి నిమజ్జన ఏర్పాట్లు రెండురోజుల ముందే ప్రారంభమయ్యాయి. ఎప్పటి మాదిరిగానే ఎస్‌టిసి ట్రాన్స్‌పోర్టుకు చెందిన భారీ వాహనం శుక్రవారం తెల్లవారుజామునే ప్రాంగణానికి చేరుకుంది. దానిపై ఇనుముతో కూడిన స్తంభాలతో వెల్డింగ్‌ పనులు మొదలుపెట్టారు. గణపతి కోసం వేసిన షెడ్డుపై ఉన్న రేకులను తొలగిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి షెడ్డు తొలగింపు పనులు జరగనున్నట్లు పోలీసులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. 


నేటి రాత్రి వరకే దర్శనాలు

ఖైరతాబాద్‌ భారీ గణపతి దర్శనాలను శనివారం రాత్రి 9 గంటల వరకే అనుమతిస్తామని ఇన్‌చార్జి పోలీసు అధికారి రాజు నాయక్‌ తెలిపారు. షెడ్డు తొలగింపు, ఇతర పనుల నేపథ్యంలో భక్తులు దూరం నుంచే దర్శించుకొని వెళ్లాలని సూచించారు. వలంటీర్లు, సభ్యులను మాత్రమే లోనికి రానిస్తామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 లోపు మహాగణపతి నిమజ్జనం అవుతుందని ఉత్సవ కమిటీ పేర్కొంటోంది. శనివారం రాత్రి నుంచి విగ్రహాలను ట్రాలీలపైకి చేర్చే పనులు ప్రారంభం అవుతాయని, ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల లోపు శోభాయాత్ర ప్రారంభం అవుతుందని అధికారులు తెలుపుతున్నారు.


రథసారధి అతడే

మహాగణపతిని తరలించేందుకు 11 సంవత్సరాలుగా విజయవాడకు చెందిన ఎస్‌టిసి ట్రాన్స్‌పోర్టు అధినేత దండమూడి వెంకటరత్నం వారి భారీ ట్రాన్స్‌పోర్టు వాహనాన్ని పంపుతున్నారు. 26 టైర్లతో 100 టన్నుల బరువును తరలించే సామర్థ్యం ఉన్న ట్రాలీపై దాదాపు 30 నుంచి 32 టన్నుల బరువున్న గణపతిని సులువుగా తరలిస్తామని డ్రైవర్‌ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఇతనికి 2010 నుంచి ఖైరతాబాద్‌ గణపతిని తరలించిన అనుభవం ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మహాగణపతిని క్షేమంగా తరలించాల్సిన బాధ్యత తనపై ఉందని భాస్కర్‌రెడ్డి తెలిపారు.


లడ్డూ నైవేద్యం సమర్పణ

ఖైరతాబాద్‌ గణపతికి తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ అధినేత మల్లిబాబు శుక్రవారం 100 కిలోల లడ్డూను సమర్పించారు. ఈయన వరుసగా ఎన్నో సంవత్సరాలుగా 500 కిలోల నుంచి 6500 కిలోల లడ్డూను గణపతి చేతిలో పెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 


బ్యాండ్‌ బాజాకు భలే గిరాకీ

అల్వాల్‌, సెప్టెంబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): నవరాత్రి ఉత్సవాలంటే తీన్మార్‌ ఉండాల్సిందే. దీంతో బ్యాండ్‌ బాజాకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. కరోనా కారణంగా శుభకార్యాలు లేక అర్డర్‌లు లేక ఆర్థికంగా ఇబ్బంది పడ్డ బృందాలకు గణపతి ఉత్సవాలు ఉపయోగకరంగా మారుతున్నాయి. వినాయక వేడుకల సందర్భంగా ఎక్కడ చూసినా బ్యాండ్‌మేళాల చప్పుళ్లు, డప్పు వాయిద్యాలు వినిపిస్తున్నాయి. 


పొరుగు రాష్ట్రాల నుంచి

మండపాల నిర్వాహకులు కర్నాటక, గుల్బర్గా, మహారాష్ట్ర, ముంబై తదితర ప్రాంతాలకు చెందిన బ్యాండ్‌ బృందాలను ముందుగానే బుక్‌ చేసుకుని నగరానికి తీసుకువస్తున్నారు. 5, 11 మందితో ఒక గ్రూపుగా ఈ బృందాలు ఉంటున్నాయి. ఒక్కో నిమజ్జనానికి రూ.5 వేల నుంచి 15 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నాయి. 



ఆర్టీసీ 565 ప్రత్యేక బస్సులు 

గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో ఆదివారం 565 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలకు గణేష్‌ నిమజ్జనం స్పెషల్‌ అనే బోర్డులతో ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. బస్సులు ఎక్కడైనా ఆగిపోతే వెంటనే మరమ్మతులు చేసేందుకు రిలీఫ్‌ వ్యాన్లు, మెకానిక్‌లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.


ప్రయాణికుల సమాచారం కోసం..

9959226154 (రేతిఫైల్‌ బస్‌స్టేషన్‌)

9959226160 (కోఠి బస్‌స్టేషన్‌)


విద్యుత్‌ శాఖ క్యాంప్‌ కార్యాలయాలు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 17 (ఆంధ్రజ్యోతి) : ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌మార్గ్‌ ప్రాంతాల్లో విద్యుత్‌శాఖ ఏర్పాటు చేసిన క్యాంప్‌ కార్యాలయాలను సీఎండీ రఘుమారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఏమైనా విద్యుత్‌ సమస్యలు ఉంటే ఎస్పీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌లో ఫిర్యాదులు చేయవచ్చన్నారు. 

కాంటాక్ట్‌ నెంబర్స్‌ 7901530966/7901530866 100/1912 


ఎంఎంటీఎస్‌ ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఈనెల 19 అర్ధరాత్రి నుంచి 20వ తేదీ తెల్లవారుజాము వరకు 8 ఎంఎంటీఎస్‌ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. 


సౌండ్‌ లేకుంటే జోష్‌ ఉండదు

పెళ్లి ఊరేగింపుకే కాదు. గణేష్‌ నిమజ్జనానికి కూడా బ్యాండ్‌ సౌండ్‌ లేకుంటే మజానే ఉండదు. ఉత్సాహాన్ని ఇచ్చే పాటలకు స్టెప్‌లు వేయాలంటే బ్యాండ్‌ ఉండాల్సిందే

- సందీప్‌, అల్వాల్‌ 


గణేశుడికి ఆటపాటలు ఇష్టం

గణేశ్‌ నిమజ్జనంలో బ్యాండ్‌ లేకపోతే నిమజ్జనం చేసినట్లే అనిపించదు. ఆట పాట, డ్యాన్స్‌లు అంటే గణనాథుడికి చాలా ఇష్టం. అందుకే కులమతాలకతీతంగా యువకులు, మహిళలందరూ పాటలకు అనుగుణంగా డ్యాన్స్‌లు చేస్తారు. 

-సన్ని, అల్వాల్‌ 





Updated Date - 2021-09-18T14:20:05+05:30 IST