రంగేస్తే ఖైరతాబాద్‌ గణేశ్‌ రెడీ.. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే..!

ABN , First Publish Date - 2021-08-27T14:07:19+05:30 IST

ఖైరతాబాద్‌ గణపతి దాదాపు సిద్ధమయ్యాడు. రంగులద్దడమే మిగిలింది....

రంగేస్తే ఖైరతాబాద్‌ గణేశ్‌ రెడీ.. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే..!

హైదరాబాద్ సిటీ/ఖైరతాబాద్‌ : ఖైరతాబాద్‌ గణపతి దాదాపు సిద్ధమయ్యాడు. రంగులద్దడమే మిగిలింది. చవితికి ఐదురోజుల ముందే గణనాథుడు పూర్తిగా తయారు కానున్నట్లు శిల్పి రాజేంద్రన్‌, ఉత్సవ సమితి చైర్మన్‌ సుదర్శన్‌ తెలిపారు. గత ఏడాది కరోనా కారణంగా కేవలం 11 అడుగుల ఎత్తుకే పరిమితమైన ఈ గణపయ్యను ఈసారి భక్తుల కోరిక మేరకు 40 అడుగుల ఎత్తుతో తయారు చేస్తున్నారు. ప్రతియేటా దాదాపు మూడు నెలలకు పైగా కళాకారులు విగ్రహాన్ని సిద్ధం చేసేవారు. ఐతే ఈసారి కొవిడ్‌ మూడో దశ వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న భయాల నేపథ్యంలో ఎత్తు విషయమై, భక్తుల రాక విషయమై ఎన్నో విధాలుగా చర్చించారు. విగ్రహాన్ని 23 అడుగుల ఎత్తుతో చేయాలని భావించినా.. ఖైరతాబాద్‌ గణపతిని తక్కువ ఎత్తుతో చూడలేమని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారని నిర్వాహకులు అంటున్నారు.దీంతో వారి కోరిక మేరకు 40 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని చేయక తప్పలేదు.


ఓ వైపు కాలనాగేశ్వరి.. మరోవైపు కృష్ణ కాళిలు

11 రోజులపాటు ఓ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని తలపించే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో విలసిల్లుతుంది. గణపతితో పాటు ఖైరతాబాద్‌లో ఇరువైపులా ప్రతియేటా దేవాతా మూర్తులను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తుతో కాల నాగేశ్వరి అమ్మవారి విగ్రహం ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది. పుట్టల నడుమ భారీ నాగ దేవతపై కొలువుండే విధంగా కాల నాగేశ్వరి అమ్మవారిని ప్రత్యేక సెటింగ్‌ల నడుమ తయారు చేస్తున్నారు. ఎడమ వైపున శ్రీకృష్ణుడిని ఆవహించిన కాళికా దేవి స్వరూపమైన కృష్ణకాళి రూపంలో మరో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. భాగవతం సమయంలో శ్రీకృష్ణుడు కాళీ మాతను పూజించి అనుగ్రహించాలని కోరగా ఆమె శ్రీకృష్ణుడిపైనే ఆవహించిన స్వరూపంగా కృష్ణకాళి ఉగ్ర స్వరూపంతో ఇక్కడ కొలువుతీరనుంది. ఆమె పక్కన కృష్ణుడి మాతృమూర్తి యశోదాదేవిసైతం భక్తులకు కనిపించనున్నారు.


120 మంది కళాకారులు.. 45 రోజుల్లో..

భారీ గణపతి సందర్శనకు వచ్చే లక్షలాది మంది భక్తుల ఆకాంక్షల మేరకు రమణీయంగా విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు కళాకారులు. దాదాపు 120 మంది కళాకారులు కేవలం 45 రోజుల్లో ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ప్రతిసారీ దాదాపు 3 నెలల పాటు విగ్రహ తయారీకి శ్రమించేవారు. ఈసారి తక్కువ రోజుల్లో రాత్రింబవళ్లు కష్టపడి విగ్రహాలను ముస్తాబు చేస్తున్నారు. షెడ్డు నిర్మాణం కోసం ఆదిలాబాద్‌కు చెందిన నర్సయ్య నేతృత్వంలో 16 మంది ప్రత్యేక నిపుణులు పనిచేశారు. వెల్డింగ్‌ పనులను మచిలీపట్నంకు చెందిన నాగబాబు నేతృత్వంలో 15 మంది కళాకారులు పూర్తి చేశారు.


బంకమట్టి పనులను చెన్నైకి చెందిన గురుమూర్తికి చెందిన 20 మంది ప్రత్యేక బృందం చేసింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ ఔట్‌లైన్‌ పనులను మహారాష్ట్ర, తెలంగాణలకు చెందిన 15 మంది బృందం సుభాష్‌ ఆధ్వర్యంలో చేస్తోంది. తుదిమెరుగులు దిద్దే పనులను బిహార్‌కు చెందిన సంతోష్‌తో పాటు 10 మంది కళాకారులు చేస్తున్నారు. పెయింటింగ్‌ పనులను కాకినాడకు చెందిన భీమేష్‌ ఆధ్వర్యంలో 12 మంది చేయనున్నట్లు ప్రధాన శిల్పి రాజేంద్రన్‌ తెలిపారు. విగ్రహ తయారీకి 30 కిలోల బరువుండే 200 బ్యాగుల బంక మట్టి, 20 టన్నుల స్టీలు, 2వేల మీటర్ల గోనె సంచులు, 15 కిలోల బరువుండే 2,500 బ్యాగుల ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, 30 కిలోల బరువుండే 30 బండిళ్ల కొబ్బర నార, ఏషియన్‌ పెయింట్స్‌కు చెందిన వాటర్‌ కలర్స్‌ను వినియోగిస్తున్నారు.


పార్వతి, పరమ శివుడు, వినాయకుడు, మహావిష్ణువు, సూర్య భగవాను ముఖాలతో మహా గణపతిని తీర్చిదిద్దారు. విగ్రహం కింది భాగంలో ఐదుగురు దేవతల వాహనాలైన సింహం, నంది, మూషికం, గరుత్మంతుడు, అశ్వంలను చూడముచ్చటగా తయారు చేశారు. వినాయకుడికి 10 చేతులుండగా కుడివైపున చక్రం, త్రిశూలం, గొడ్డలి, నాగుపాము, ఆశీర్వాదహస్తం, ఎడమ వైపున శంఖు, పాశము, కమలం, గద, లడ్డూ ఉన్నాయి.


పొడవు : 40 అడుగులు

వెడల్పు : 27 అడుగులు

బరువు : 25 నుండి 28 టన్నులు

ఖర్చు  : రూ.50 లక్షలకు పైగా..

Updated Date - 2021-08-27T14:07:19+05:30 IST