టీఆర్‌ఎస్‌కు vijayareddy షాక్

ABN , First Publish Date - 2022-06-18T16:20:31+05:30 IST

అధికార పార్టీ టీఎర్ఎస్‌కు దివంగత నేత పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి షాక్ ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌కు vijayareddy షాక్

హైదరాబాద్:  అధికార పార్టీ టీఎర్ఎస్‌(TRS)కు దివంగత నేత పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి(Vijayareddy) షాక్ ఇచ్చారు. విజయారెడ్డి కాంగ్రెస్‌(congress)లో చేరేందుకు సిద్ధమయ్యారు. కొన్నాళ్లుగా టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న విజయారెడ్డి... శనివారం ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. నిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో విద్యార్థుల మరణానికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు రేవంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో రేవంత్‌తో పాటు విజయారెడ్డి పాల్గొన్నారు. కాసేపటి క్రితమే రేవంత్ ఇంటికి వచ్చిన ఆమె... ఆయనతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో చేరేందుకు విజయారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 


గత కొంతకాలంగా టీఆర్‌ఎస్‌పై విజయారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌గా పీజేఆర్ కుమార్తె విజయం సాధించారు. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ మేయర్ పదవిని ఆశించారు. అయితే ఆమెకు నిరాశే మిగిలింది. జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే వాటిని బహిష్కరించి విజయారెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. అప్పట్లో ఈ విషయం పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. వెంటనే టీఆర్‌ఎస్ పార్టీ నేతలు రంగంలోకి దిగి విజయారెడ్డిని బుజ్జగించి మేయర్ ఎన్నికల్లో భాగస్వామిని చేశారు. అప్పటి నుంచి టీఆర్‌ఎస్‌పై విజయారెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏక్షణమైనా అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో... విజయారెడ్డి ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్ పార్టీలో అది సాధ్యంకాదని విజయారెడ్డి భావించారు. ఇటు కాంగ్రెస్ కూడా ఎన్నికలకు సిద్ధమవుతూ నియోజకవర్గాల వారీగా పార్టీ లెక్కలు వేసుకుంటున్న సమయంలో... పీజేఆర్ కుమార్తె పార్టీలో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం కాంగ్రెస్‌కు బూస్టప్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. 

Updated Date - 2022-06-18T16:20:31+05:30 IST