Abn logo
Jul 29 2021 @ 00:00AM

విద్యాలయంపై ఖద్దరు గద్దలు

భూములను ప్లాట్లుగా మార్చి రోడ్లు వేసిన దృశ్యం

మహిళా ఎయిడెడ్‌ కళాశాల భూముల అమ్మకం 

పదేళ్లుగా ట్రస్ట్‌ ఖాతాలో జమకాని డబ్బులు

శిఽథిలావస్థకు చేరిన పాత కళాశాల భవనాలు

దేవుని భూములు దుర్వినియోగం

ప్లాట్లుగా మార్చి విక్రయాలు

వాటాలు పంచుకున్న ఖద్దరు పెద్దలు


ప్రొద్దుటూరులోని దేవరశెట్టి ఆదిలక్షుమ్మ బాలికల జూనియర్‌ కళాశాల, మహిళా డిగ్రీ ఎయిడెడ్‌ కళాశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన మొట్టమొదటి బాలికల కళాశాల ఇది. దీనికోసం 40 ఏళ్ల క్రితం 18 ఎకరాల దేవదాయ శాఖ భూములను నామమాత్రపు ధరతో కొనుగోలు చేశారు. అనంతరం కళాశాల అభివృద్ధికోసం అంటూ 11 ఎకరాలను పదేళ్ల క్రితం రూ.7 కోట్లకు విక్రయించారు. ఈ డబ్బు ఇప్పటికీ కళాశాల ట్రస్టు ఖాతాలో చేరలేదని సమాచారం. దీంతో కళాశాలలో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టలేదు. కానీ ఆ 11 ఎకరాలను మాత్రం వెంచర్లు వేసి దాదాపు రూ.150 కోట్ల వ్యాపారం చేస్తున్నారని సమాచారం. దీని వెనక ఖద్దరు పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..


ప్రొద్దుటూరు అర్బన్‌, జూలై 29: పేద బాలికలకు విద్యావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రొద్దుటూరులో దేవరశెట్టి ఆదిలక్షుమ్మ, వెంకటపతి శ్రేషి దంపతులు బాలికల జూనియర్‌ కళాశాలను 1975 లో స్థాపించారు. కోటవీధిలోని బాలికల ఉన్నత పాఠశాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన ఈ జూనియర్‌ కళాశాలకు సొంత భవనాల నిర్మాణం కోసం 1977లో అగస్త్యేశ్వర స్వామి ఆలయ భూములను మహిళల విద్యాసేవ కోసం ఎకరా రూ.10వేలు నామమాత్రపు ధర చెల్లించి 18 ఎకరాలు కళాశాల ట్రస్ట్‌ పేర కొనుగోలు చేశారు. 1979లో మహిళా డిగ్రీ కళాశాలను సైతం స్థాపించి 1980లో కొర్రపాడురోడ్డులోని అగస్త్యేశ్వర ఆలయ భూముల్లో నిర్మించిన నూతన భవనాల్లోకి జూనియర్‌, డిగ్రీ మహిళా కళాశాలలను తరలించారు. అప్పటి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా డీఏడబ్ల్యూ కాలేజీకి పేరుంది. ఎందరో మహిళలు ఇక్కడ విద్యను అభ్యసించి గొప్ప స్థానాల్లో ఉన్నారు. 


ఇలా అమ్మారు..

ఉన్నత విద్యాకోర్సులు అందుబాటులోకి తేవడం, ఆధునిక భవనాల నిర్మాణం, సైన్స్‌ కంప్యూటర్‌ ల్యాబరేటరీల ఏర్పాటుచేయడంతో పాటు, ఉచిత భోజనం, వసతి కల్పించే లక్ష్యంతోడీఏడబ్ల్యూ ఎయిడెడ్‌ మహిళా జూనియర్‌, డిగ్రీ కళాశాలకు చెందిన 11 ఎకరాల భూములను రూ.7 కోట్లకు 2011లో కళాశాల ట్రస్ట్‌ యాజమాన్యం విక్రయించింది. ఇందుకోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చింది. భూములు అమ్మి పదేళ్లు కావస్తున్నా నేటికీ ఉన్నత విద్య లక్ష్యం ఒక్క అడుగు ముందుకు సాగలేదు. దీంతో పదేళ్ల క్రితం ఇచ్చిన భూముల విక్రయ జీవోను రద్దు చేయాలని పలువురు ప్రముఖులు సీఎం జగన్‌కు లేఖలు రాశారు. కొందరు హైకోర్టులో కేసులు వేశారు.


ఎయిడెడ్‌ గ్రాంట్లు ఇవ్వని ప్రభుత్వం

ప్రభుత్వం ఎయిడెడ్‌ గ్రాంటులు ఇవ్వక పోవడం, పదవీ విరమణ చేసిన వారి స్థానంలో  లెక్చరర్లను నియమించకపోవడంవల్ల యాజమాన్యమే నియమించుకొనిజీతాలు భరించాల్సి వస్తోంది. దీనివల్లకూడా ఆర్థిక పరిస్థితి దెబ్బతిని కాలేజీ అభివృద్ధి కోసం భూములు విక్రయించాల్సి వచ్చిందని యాజమాన్యం పేర్కొంటోంది. 1980లో నిర్మించిన మహిళా కళాశాల భవనాలు ప్రస్తుతం శిఽథిలావస్థకు చేరుకున్నాయి. స్లాబు పెచ్చులూడి కడ్డీలు కనబడుతున్నాయి.


డిగ్రీ కాలేజీకి ఎయిడెడ్‌ రద్దు

ఇటీవలే దేవరశెట్టి ఆదిలక్షుమ్మ మహిళా డిగ్రీ కళాశాలకు ప్రభుత్వం ఎయిడెడ్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్‌ను, ఇద్దరు స్టాఫ్‌ను కూడా వేరే కాలేజీకి బదిలీ చేసినట్లు సమాచారం. దీంతో కేవలం ఇంటర్‌ మాత్రమే ఎయిడెడ్‌లో కొనసాగుతోంది.


కేసులున్నా ప్లాట్లు విక్రయిస్తున్న వైనం

దేవరశెట్టి ఆదిలక్షుమ్మ మహిళా కళాశాల భూములను కొన్నవారు కేసుల కారణంగా ఇన్నాళ్లు ఆ భూముల జోలికి వెళ్లలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రెండేళ్లుగా ఆ భూములను చదును చేసి ప్లాట్లు వేసి వెంచర్లుగా మార్చారు. ఇటీవలే అధికారపార్టీ ఖద్దరు పెద్దల అండతో వెంచర్లు వేసి బ్రోచర్లు విడుదలచేసి ప్లాట్ల విక్రయాలు సాగిస్తున్నారు. ఈ భూములకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసేందుకు మూడు కోట్లమేర ముడుపులు సైతం ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. గతంలో ఈ భూములను విక్రయించటానికి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో జీవో తెప్పించినందుకు రెండు ఎకరాల భూమిని కాలేజీ యాజమాన్యం ఓ మాజీ ప్రజాప్రతినిధికి ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఆ ప్రజాప్రతినిధి వర్గీయులే ఆ భూములను కొని నేడు కోట్లలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్లు పట్టణంలో చర్చ సాగుతోంది. భూములు విక్రయించగా వచ్చిన రూ.7 కోట్లు కళాశాల ట్రస్ట్‌ ఖాతాలో జమ కాలేదని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ విక్రయించిన కళాశాల భూములను మాత్రం కొందరు ఖద్దరు పెద్దల అండతోప్లాట్లుగా మార్చి ఎకరా భూమిని రూ.15కోట్ల వంతున రూ.150 కోట్లకు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. 


కేసుల కారణంగా పైసా డబ్బులు రాలేదు

- ఎం.నాగరాజు, కాలేజీ కరస్పాండెంట్‌

కాలేజీ భూములు విక్రయించిన వెంటనే కొందరు కోర్టుల్లో కేసులు వేసిన కారణంగా భూములు కొన్నవారు డబ్బులు ఇవ్వలేదు. అందువల్ల ట్రస్ట్‌ ఖాతాలో పైసా జమకాని మాట వాస్తవం. పదేళ్లుగా కేసులు తేలక డబ్బులు రాక కాలేజీని అభివృద్ధ్ది చేయలేక పోయాం. సొంత డబ్బులతోనే ఇన్నేళ్లు లెక్చరర్లను పెట్టుకొని కాలేజీని నడుపుతున్నాం. చిన్న చిన్న మరమ్మతులకు సైతం పైసా నిధి మాదగ్గరలేదు. కేసులు వేసేవాళ్లు స్వార్థ ప్రయోజనాల కోసం కాలేజీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.