Chief Minister: సీఎంను కలిసిన కాంగ్రెస్‌ నేత

ABN , First Publish Date - 2022-08-27T18:12:20+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఏడుసార్లు వరుసగా కోలార్‌ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగిన కేహెచ్‌ మునియప్ప ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైను

Chief Minister: సీఎంను కలిసిన కాంగ్రెస్‌ నేత

- సుదీర్ఘంగా చర్చలు

- కోలారు జిల్లాలో పార్టీ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి


బెంగళూరు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఏడుసార్లు వరుసగా కోలార్‌ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగిన కేహెచ్‌ మునియప్ప ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైను కలిశారు. గురువారం సీఎం బొమ్మై నివాసానికి వెళ్లిన మునియప్ప సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అంతకు ముందు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌(Dr. Sudhakar, State Minister of Medical Health) నివాసానికి వెళ్లిన మునియప్ప అరగంటకు పైగా చర్చించారు. కోలార్‌ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్‌ రాజకీయాల్లో మునియప్ప ప్రమేయం లేకుండానే పలు నిర్ణయాలు తీసుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే జిల్లాకు చెందిన మాజీ స్పీకర్‌  రమే్‌షకుమార్‌ వ్యతిరేకంగా పనిచేశారు. అప్పట్లో ఇద్దరు తీవ్రస్థాయిలోనే విమర్శలు చేసుకున్నారు. మూడేళ్లుగా పార్టీతో అంటీముట్టని రీతిలో ఉన్న మునియప్ప గత రెండు నెలలుగా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. జేడీఎస్‏లో చేరతారనే ప్రచారాలు సాగాయి. కానీ ముఖ్యమంత్రి బొమ్మైతో కలవడంతో బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్‌ అగ్రనేత గులాంనబీ ఆజాద్‌(Gulannabi Azad) పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్నింటికీ రాజీనామా చేసిన రోజునే రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ తరపున ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందిన సీనియర్‌ నేత మునియప్ప ప్రత్యర్థి పార్టీ బీజేపీ నేతలను భేటీ కావడం విశేషం. సీఎంను కలిశాక మునియప్ప మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ వీడే ఆలోచన ఏదీ లేదన్నారు. సీఎం బొమ్మైను కలవడం వెనుక రాజకీయ కోణం లేదన్నారు. ఆదిజాంబవంత మఠానికి రెండువేల ఏళ్ల చరిత్ర ఉందని, అభివృద్ధికి సహకరించాలని కోరామని తెలిపారు. మంత్రి సుధాకర్‌(Minister Sudhakar) తండ్రితో 40 ఏళ్ల అనుబంధం ఉందని అందుకే కలిశానని పేర్కొన్నారు. పార్టీలో వ్యతిరేకత ఉన్న విషయం వాస్తవమేనని, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్‌ సుర్జేవాలా చర్చించారని తెలిపారు. రాష్ట్ర నేతలు డీకే శివకుమార్‌, బీకే హరిప్రసాద్‌, రాజ్యసభ సభ్యుడు చంద్రశేఖర్‌లు ఇటీవలే వచ్చి మాట్లాడారని పేర్కొన్నారు. 


Updated Date - 2022-08-27T18:12:20+05:30 IST