నిలిచిన నిధులు.. ఆగిన పనులు

ABN , First Publish Date - 2022-06-06T05:12:56+05:30 IST

కడ్తాలలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ నిర్మాణ పనులు

నిలిచిన నిధులు.. ఆగిన పనులు
పిల్లర్లకే పరిమితమైన కస్తూర్బాగాంధీ స్కూల్‌ నిర్మాణం

  • రెండేళ్లయినా పూర్తికాని కడ్తాల కేజీవీబీ 
  • డబ్బుల్లేక పనులు ఆపేసిన కాంట్రాక్టర్‌
  • ప్రారంభం నుంచీ అద్దె భవనంలోనే విద్యాలయ నిర్వహణ
  • అరకొర వసతులతో ఇబ్బందుల్లో బాలికలు, టీచర్లు 
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు 


కడ్తాల్‌, జూన్‌ 5: కడ్తాలలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ నిర్మాణ పనులు నిధుల్లేక నిలిచాయి. పనులను రెండేళ్ల క్రితమే ప్రారంభించినా పిల్లర్ల స్థాయిలోనే ఉన్నాయి. ప్రారంభం నుంచి అద్దె భవనంలోనే కొనసాగుతున్నా కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థినులు సదుపాయాలకు నోచుకోవడం లేదు. సొంత భవనం లేక బాలికలు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విదల్చని కారణంగా కాంట్రాక్టర్‌ పనులు చేయించడం లేదు. కడ్తాలలో 2017-18లో కస్తూర్బాగాంధీ పాఠశాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌-శ్రీశైలం హైవే పక్కన అద్దె భవనంలో నడిపిస్తున్నారు. ఈ పాఠశాలలో 200 మంది బాలికలు చదువుతున్నారు. కస్తూర్బాగాంధీ స్కూలుకు సొంత భవనాన్ని నిర్మించాలని స్థానికులు, విద్యార్థినుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు 2019 నవంబర్‌లో ప్రభుత్వం రూ.3.35కోట్లు మంజూరు చేసింది. కానుగు బావి తండా రోడ్డులో రెండెకరాల భూమిలో పాఠశాల నిర్మాణాన్ని చేపట్టారు. పనులకు 2020 మార్చి 12న కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు కేవలం బేస్మెంట్‌ పనులు మాత్రమే చేశారు.


బిల్లులు రాక పనుల నిలుపుదల

చేసిన పనులకు బిల్లులు రాక పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు చేయించడం లేదు. చేసిన పనులకు డబ్బులు రాక తాను చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నానని అతడు వాపోతున్నాడు. నిబంధనల ప్రకారం పనులను బట్టి బిల్లు ఇవ్వాల్సి ఉన్నా అధికారులు రికార్డులు చేసి చెక్కులు ఇవ్వడం లేదని తెలిపాడు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి చేతులు దులుపుకుందని, నిధులు విదిల్చితేనే కదా? పనులు చేయించేదని స్థానికులు, ప్రజాప్రతినిధులు సైతం అంటున్నారు. ఇప్పుడు కొనసాగుతున్న అద్దెభవనం కాంట్రాక్ట్‌ సైతం ముగియనున్న తరుణంలో తన భవనాన్ని ఖాళీచేయాలని యజమాని అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోచోట అనువైన అద్దెభవనం దొరకక, సొంత భవనం పూర్తికాక విద్యార్థినులు, ఉపాధ్యాయులు నలిగిపోతున్నారు. సమస్య పరిష్కారానికి  ప్రజాప్రతినిధులు చొరవచూపడం లేదని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం మంజూరుచేసిన నిధులు పూర్తిగా విడుదల చేయించి భవన నిర్మాణం పూర్తిచేయాలని కోరుతున్నారు.


ఎవరూ పట్టించుకోవడం లేదు

కస్తూర్బాగాంధీ విద్యాలయం భవన నిర్మాణం విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నోసార్లు మండల పరిషత్‌ సమావేశాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినా స్పందించడం లేదు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు విడుదల చేయించి పనులు పూర్తయ్యేలా చూడాలి. తగిన వసతులు లేని అద్దె భవనంలో బాలికలు, టీచర్లు ఇబ్బంది పడుతున్నారు.

- జహంగీర్‌బాబా, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు


అధికారుల దృష్టికి తీసుకుపోయాం

కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల భవన నిర్మాణం గురించి పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకుపోయాం. అధికారులకూ విన్నవించాం. పనుల పురోగతిపై కాంట్రాక్టర్‌తో మాట్లాడేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అతడు అందుబాటులోకి రావడం లేదు. కొత్త భవనం అందుబాటులోకి వస్తే బాలికలు, టీచర్ల ఇబ్బందులు తొలగుతాయి. భవన నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

- అనిత, ప్రత్యేకాధికారి, కేజీబీవీ


నిర్మాణం పూర్తయ్యేలా చూస్తాం

కస్తూర్బాగాంధీ విద్యాలయ నూతన భవన నిర్మాణం పూర్తి చేయించేలా మేం బాధ్యత తీసుకుంటాం. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌, అధికారులతో మాట్లాడి నిలిచిన పనులు ప్రారంభించేలా చూస్తాం. భవన నిర్మాణ పనులు, నిధుల మంజూరుపై ఎమ్మెల్సీ కె.నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎంపీ రాములుకు మరోసారి విన్నవిస్తాం. 

- కమ్లీమోత్యనాయక్‌, ఎంపీపీ, కడ్తాల్‌

Updated Date - 2022-06-06T05:12:56+05:30 IST