కార్పొరేట్‌ను తలదన్నేలా.. కేజీహెచ్ కొవిడ్ బ్లాక్!

ABN , First Publish Date - 2020-09-12T16:46:28+05:30 IST

కరోనా వైరస్‌ బారినపడిన వారికి సేవలు అందించేందుకు మరో ప్రత్యేక వార్డు సిద్ధమైంది.

కార్పొరేట్‌ను తలదన్నేలా.. కేజీహెచ్ కొవిడ్ బ్లాక్!

నేటి నుంచి బాధితులకు సేవలు

500 పడకలతో సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు

200 పడకలకు వెంటిలేటర్‌, 300 పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం

అత్యాధునిక సౌకర్యాలు, పరికరాలు

1000 మంది సిబ్బంది సిద్ధం

సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ బారినపడిన వారికి సేవలు అందించేందుకు మరో ప్రత్యేక వార్డు సిద్ధమైంది. కేజీహెచ్‌లో అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి రానున్న ఈ వార్డులో శనివారం నుంచి వైరస్‌ బాధితులను చేర్చుకుని వైద్య సేవలు అందించనున్నారు. మొత్తం 500 పడకల్లో 200 వెంటిలేటర్‌లతో కూడినవి కాగా, మరో 300 పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం ఉంది. 


నగర పరిధిలోని పలు కార్పొరేట్‌ సంస్థలు సమకూర్చిన సీఎస్‌ఆర్‌ నిధులతో ఈ బ్లాక్‌ను నిర్మించారు. అయితే ప్రస్తుత అవసరాల దృష్ట్యా దీన్ని కొవిడ్‌ బ్లాక్‌గా మార్చారు. దీన్ని అత్యాధునిక పరికరాలు, సదుపాయాలతో కార్పొరేట్‌ ఆస్పత్రి తలదన్నేలా రూపొందించారు. కొవిడ్‌ బాధితుల చికిత్స కోసం డయాలసిస్‌ మెషిన్లు వంటి అత్యాధునిక పరికరాలను కూడా ఏర్పాటుచేశారు. వీటి కోసం సుమారు రూ.10 కోట్లు వెచ్చించారు. ఆక్సిజన్‌ సరఫరా కోసం 20 వేల లీటర్ల సామర్థ్యంతో కూడిన ట్యాంక్‌ను, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగినా ఇబ్బంది లేకుండా 500 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన జనరేటర్‌ను ఏర్పాటుచేశారు.


ఐదు అంతస్తులు గల ఈ భవనంలో కింది అంతస్తును రిసెప్షన్‌, రిజిస్ర్టేషన్‌, ఇతర అవసరాలకు కేటాయించారు. మిగిలిన నాలుగు అంతస్తులు కొవిడ్‌ బాధితుల కోసం కేటాయించారు. రోగికి అవసరమైన పరీక్షలు నిర్వహించేందుకు పరికరాలను ఇదే బ్లాక్‌లో సిద్ధం చేశారు. మొబైల్‌ ఎక్స్‌రే మెషిన్‌ ద్వారా రోగి దగ్గరకే వెళ్లి ఎక్స్‌రే తీయనున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లతో కూడిన పది స్టెచర్లను అందుబాటులో ఉంచారు. వైరస్‌ బాధితుడు వచ్చిన క్షణాల వ్యవధిలోనే వార్డుకు తరలించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ బాధితులు స్థానిక వైద్య సిబ్బంది ద్వారా గానీ, నేరుగా గానీ వచ్చి చేరవచ్చు. 


నిరంతర పర్యవేక్షణ

వార్డులో రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎవరైనా బాధితుడు ఇబ్బందిపడుతున్నట్టయితే సీసీ కెమెరాలో చూసి...అక్కడున్న వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు వెసులుబాటు ఉంటుంది.  రిసెప్షన్‌లో నిరంతరం సిబ్బంది అందుబాటులో వుంటూ వైరస్‌ బాధితుల ఆరోగ్య వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేసేలా ఏర్పాట్లు చేశారు. 


వేయి మంది సిబ్బంది

500 పడకలతో అందుబాటులోకి వస్తున్న కొవిడ్‌ వార్డులో వైద్య సేవలు అందించేందుకు వేయి మంది సిబ్బందిని సిద్ధం చేశారు. 400 మంది నర్శింగ్‌ సిబ్బంది, మరో 300 మంది పారా మెడికల్‌ సిబ్బంది, 300 మంది వైద్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో సేవలు అందించనున్నారు.



మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కొవిడ్‌ వార్డును అందుబాటులోకి తీసుకువ చ్చాం. 500 మందికి ఒకేసారి వైద్య సేవలు అందించనున్నాం.వేయి మంది వైద్య సిబ్బంది సేవలు అందించను న్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రి తలదన్నేలా మౌలిక వసతులు, సదుపాయాలను ఆస్పత్రిలో కల్పించాం. మూడు ఆపరే షన్‌ థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా అత్యవ సర శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిన వారికి ఇక్కడే చేస్తాం. సీసీ కెమెరాల నిఘాలో వార్డులను పర్యవేక్షిస్తాం.

- డాక్టర్‌ పీవీ సుధాకర్‌, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌

Updated Date - 2020-09-12T16:46:28+05:30 IST