Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 14 Apr 2022 13:05:45 IST

సినిమా రివ్యూ : ‘కేజీఎఫ్ 2’

twitter-iconwatsapp-iconfb-icon

చిత్రం : ‘కేజీఎఫ్ 2’

విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2022

నటీనటులు : యశ్, శ్రీనిధిశెట్టి, ప్రకాశ్‌రాజ్, అచ్యుత్ కుమార్, సంజయ్ దత్, ఈశ్వరీరావు, రవీనాటండన్, రావు రమేశ్, అయ్యప్ప.పి.శర్మ, జాన్ కొక్కెన్, అనంతనాగ్ తదితరులు

సంగీతం : రవి బస్రూర్

ఛాయాగ్రహణం : భువన్ గౌడ

నిర్మాత : విజయ్ కిరగందూర్ (తెలుగులో సాయి కొర్రపాటి)

రచన - దర్శకత్వం : ప్రశాంత్ నీల్ 

మూడున్నరేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన సంచలన విజయం సాధించింది. ‘కేజీఎఫ్’ చాప్టర్ ఒన్. తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లోనూ దుమ్ము రేపేసింది. దాంతో చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్స్‌తో మరింత హైప్ క్రియేట్ అయింది.  ప్రేక్షకుల నిరీక్షణకు తెరదించుతూ ఈ రోజే (ఏప్రిల్ 14) థియేటర్స్ లోకి వచ్చింది ‘కేజీఎఫ్ 2’. మరి ఈ చిత్రం అందరి అంచనాల్ని అందుకుందా? మొదటి భాగాన్ని మించి మ్యాజిక్ చేస్తుందా? అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ

మొదటి భాగంలో ఈ దునియాని ఏలాలని ముంబైకి వచ్చి.. అంచలంచెలుగా ఎదిగిన రాఖీభాయ్ (యశ్) కేజీఎఫ్ అధినేత గరుడ (రామచంద్ర)ని చంపి ఆ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు. రెండో భాగంలో.. కేజీఎఫ్‌లో పనిచేసే కార్మికులకు దేవుడు అవుతాడు రాఖీభాయ్. వారికి అన్నివిధాలా శిక్షణను ఇప్పించి కేజీఎఫ్ ను కంచుకోటలా మార్చుతాడు. అయితే కేజీఎఫ్‌లోని కార్మికుల పాలిట యముడుగా పేరుపొంది అందరూ చనిపోయాడనుకున్న గరుడ బాబాయ్ అధిరా (సంజయ్ దత్ ) తిరిగొచ్చి రాఖీభాయ్‌ని అంతమొందించాలని పథకం వేస్తాడు. ఇంతలో ఢీల్లీ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొని ప్రధానమంత్రిగా రమికాసేన్ (రవీనాటండన్) ప్రమాణ స్వీకారం చేస్తుంది. రాకీభాయ్ ఆగడాల్ని అణచాలని ఆమె కూడా ప్రయత్నిస్తుంటుంది.  శత్రువుల పన్నాగాల నుంచి తప్పించుకొని రాఖీభాయ్ తిరిగి కేజీఎఫ్ కు ఎలా కింగ్ అయ్యాడు?  రమికాసేన్ రియాక్షన్ ఏంటి? రాఖీభాయ్ ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? అన్నదే మిగతా కథ. 

విశ్లేషణ : 

మొదటి భాగాన్ని ఏ మూడ్‌తో ముగించారో.. అదే మూడ్‌ను రెండో భాగంలోనూ కంటిన్యూ చేయగలగాలి. దానిపైనే సినిమా సక్సె్స్ ఆధారపడి ఉంటుంది. బాహుబలి రెండో భాగం సూపర్ సక్సె్స్ అవడానికి ప్రధాన కారణం అదే. ‘కేజీఎఫ్ 2’ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ అదే ఫాలో అయ్యాడు. రాఖీభాయ్ పాత్రను మొదటి భాగం కన్నా పవర్ ఫుల్‌గా ఎలివేట్ చేసి.. ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టేయగలిగాడు. మరింత ఆసక్తికరమైన కథనంతో సన్నివేశాల్ని అల్లుకొని అబ్బుర పరిచాడు. హీరోకన్నా విలన్‌ను పవర్ ఫుల్‌గా ఎలివేట్ చేసి.. ఇద్దరి మధ్యా వార్‌ను ఆసక్తికరంగా మలిచాడు. దాంతో సినిమా నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది.  ప్రత్యర్ధుల ఎత్తులకు‌ పై ఎత్తులు వేస్తూ హీరో చేసే విన్యాసాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కాకపోతే మొదటి భాగం స్థాయిలోని ఎమోషన్స్ రెండో పార్ట్ లో మిస్సయ్యాయి. అలాగే.. కాన్ఫ్లిక్ట్ కూడా మొదటి భాగం స్థాయిలో లేదని చెప్పుకోవాలి. కేజీఎఫ్ ను రాకీభాయ్ తన చేతుల్లోకి తీసుకోవడంతో మొదలయ్యే సన్నివేశంతో ఆరంభంలోనే సినిమాకి ఒక హైప్ వస్తుంది. ఆ తర్వాత సమ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో అతడికి ఎదురయ్యే అడ్డంకులు, వాటిని ఛేదించే క్రమం మెప్పిస్తాయి.  విజువల్ గా ఎలివేషన్స్ పరంగా కొన్ని సన్నివేశాలు వేరే లెవెల్ అనిపిస్తాయి. రాఖీ రీ ఇంట్రడక్షన్ సీన్, అధిరా మీద అతడి దాడి, కేజీఎఫ్ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్న ఒక గోల్డ్ బిస్కెట్ కోసం పోలీస్ స్టేషన్ పై రాఖీభాయ్ సృష్టించే విధ్వంసం ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తాయి. ఇలాంటి సీన్స్ ప్రశాంత్ నీల్ మాత్రమే తీయగలడు అనిపిస్తుంది. వాటి కోసమైనా ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని చూసి తీరాలి. సినిమాకి మూడో పార్ట్ ఉన్నట్టు చూపించడం కొసమెరుపు. 


రాఖీ భాయ్ పాత్రతో మొదటి భాగంపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన యశ్ రెండో భాగంలోనూ అదరగొట్టేశాడు. ఓవర్ బిల్డప్సులు లేకుండా.. తనదైన శైలిలో స్టైలిష్ గా, సటిల్డ్ గా అద్భుతంగా ఆ పాత్రను పోషించాడు. మొదటిభాగం కన్నా రెండో భాగంలో గ్లామరస్‌ గా కనిపించాడు.  కథానాయికగా శ్రీనిధి శెట్టి పర్వాలేదనిపిస్తుంది. అధిరాగా సంజయ్ దత్ అదరగొట్టేశాడు. ఆయన లుక్స్, అగ్రెసివ్ నెస్, యాక్టింగ్, యాక్షన్ అబ్బుర పరుస్తాయి. హీరోకు తగ్గ విలన్ గా తన పెర్ఫార్మెన్స్ ను పీక్స్ లో చూపించారు. ప్రధాన మంత్రి రమికాసేన్ పాత్రలో రవీనాటండన్ చెప్పుకో దగ్గరీతిలో నటించి మెప్పించింది. ఇక ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, అయ్యప్ప పీ శర్మ, అచ్యుత్ కుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు. రవి బస్రూర్ సంగీతం, నేపథ్య సంగీతం థియేటర్స్ ను హోరెత్తించాయి. ముఖ్యంగా అద్భుతమైన బ్యా్క్ గ్రౌండ్ స్కోర్ తో చిత్రానికి ప్రాణం పోశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఛాయాగ్రహణం మెప్పిస్తుంది. మొత్తం మీద మొదటి భాగంలోని విజువల్ ట్రీట్‌కు ప్రేక్షకులు ఎలా అయితే బ్రహ్మరథం పట్టారో, రెండో భాగంలోనూ అంతకు మించిన అనుభూతితో థియేటర్స్ నుంచి బైటికి వెళతారు. 

ట్యాగ్ లైన్ : రాఖీభాయ్ స్ట్రైక్స్ ఎగైన్

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International