మా గోడు వినండి

ABN , First Publish Date - 2022-08-08T07:00:00+05:30 IST

బాలికా విద్యతో సమాజాభివృద్ధి పురోగతి ముడిపడి ఉంది. పేదరికం, లింగవివక్ష, విద్యాలయాల కొరత కారణంగా ఆడపిల్లలు చదువుకు దూరంగా ఉండిపోకూడదని, వారు ఉన్నత చదువులు చదివి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నవే కస్తూర్భాగాంధీ(కేజీబీవీ) విద్యాలయాలు.

మా గోడు వినండి

నిలిచిపోయిన కాస్మొటిక్‌ కిట్లు, దుప్పట్లు

తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక సమస్యలతో సతమతం.. మూడేళ్లుగా ఇదే పరిస్థితి..

4వేలమంది విద్యార్థినులకు తప్పని కష్టాలు

పాఠశాలలో సిబ్బంది కొరత కూడా..

శంఖవరం, ఆగస్టు 7: బాలికా విద్యతో సమాజాభివృద్ధి పురోగతి ముడిపడి ఉంది. పేదరికం, లింగవివక్ష, విద్యాలయాల కొరత కారణంగా ఆడపిల్లలు చదువుకు దూరంగా ఉండిపోకూడదని, వారు ఉన్నత చదువులు చదివి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నవే కస్తూర్భాగాంధీ(కేజీబీవీ) విద్యాలయాలు. వీటి ఆదరణను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీలో ఇంటర్‌ వరకూ విద్యను పొడిగించింది. దీంతో ఆరు నుంచి ఇంటర్‌ వరకూ ఒకే పాఠశాలలో ఉచితంగా చదువుకునే అవకాశం విద్యార్థినులకు కలిగింది. కానీ ఈ విద్యాలయాల్లో మూడేళ్లుగా సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి. కాస్మొటిక్‌ కిట్లు, కప్పుకునేందుకు దుప్పుట్లు లేకుండా వారు ఇబ్బందులు పడుతున్నారు.

రెండునెలలు దాటినా..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 12 కేజీబీవీలు ఉండగా 6నుంచి పదోతరగతి వరకు 2,400మంది విద్యార్థినులు, ఇంటర్‌లో 1700మంది విద్యార్థినులు వీటిలో చదువుతున్నారు. గతంలో మూడునెలలకొకసారి వీరికి ఆరోగ్య పరిరక్షణ కిట్లు అందజేసేవారు. ప్రతి నెల రూ.100 చొప్పున బాలికలకు నెలవారీ కాస్మొటిక్‌ చార్జీల నిమిత్తం ఇచ్చేవారు. అవి 2019 నుంచి నిలిచిపోయాయి. రెండేళ్లుగా కనీసం విద్యార్థులకు కప్పుకునేందుకు దుప్పట్లు కూడా ఇవ్వడంలేదు. కొంతమంది విద్యార్థులు ఇంటినుంచి తెచ్చుకుంటున్నారు. స్థోమతలేనివారు చలిలోనే పడుకుంటున్నారు. ఆరోగ్యకిట్లు, కాస్మొటిక్‌ చార్జీలు, దుప్పట్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కిట్లు ఇవ్వకపోతే ఇప్పటి ధరలకు అనుగుణంగా నగదు జమచేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పాఠశాలలు తెరిచి రెండోనెల వచ్చినా సరైన సదుపాయాలు లేకపోవడంతో కొందరు విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేందుకు విముఖుత చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఏమూలకూ చాలవు

2017లో కేజీబీవీ విద్యార్థులకు కాస్మొటిక్‌ కిట్లు అందించేవారు. ఇందులో డిటర్జెంట్‌, స్నానపు సబ్బులు, షాంపూ, తలనూనె, పౌడర్‌, బ్రష్‌, టూత్‌పేస్ట్‌, టంగ్‌ క్లీనర్‌, దువ్వెన, బొట్టు బిల్లలు,హెయిర్‌ బ్యాండ్లు, శానిటరీ న్యాప్‌కిన్స్‌, మస్కిటో కాయిల్‌ వంటివి ఇచ్చేవారు. ఇవికాకుండా దానికి నెలకు రూ.100 అదనంగా ఇచ్చేవారు. మూడునెలలకు సరిపడా కొనాలన్నా ఇవి ఏమూలకూ సరిపడవు. నెలకు రూ.250వరకూ ఖాతాలో జమచేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఆరేళ్లుగా నూతన పోస్టులు లేవు

జిల్లాలో 12 పాఠశాలల్లో ఉపాధ్యాయల కొరత వేధిస్తోంది. అన్ని పాఠశాలల్లో అరకొరగానే ఉపాధ్యాయులు ఉన్నారు. కీలక సబ్జెక్ట్‌లకు ఉపాధ్యాయులు లేరు. దీంతో బాలికలు చదువులకు ఇబ్బందులకు పడుతున్నారు. గతంలో రెండుసార్లు నోటిఫికేషన్లు జారీ చేసినా తమ వారికే పోస్టింగులు ఇవ్వాలని రాజకీయ ఒత్తిళ్లు రావడంతో పోస్టులు తీయలేదు. 

కనీస సదుపాయాలు లేవు

నాగమణి, విద్యార్థి తల్లి, హంసవరం

కేజీబీవీలో విద్యార్థులకు కాస్మొటిక్‌, ఆరోగ్య కిట్‌, దుప్పట్లు వంటి కనీస అవసరాలు లేవు. ఏదొక నెల మేము ఇంటి నుంచి పంపిస్తున్నాం. కానీ ప్రతినెలా పంపాలంటే ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి అత్యవసర సదుపాయాలైనా కల్పించాలి.

Updated Date - 2022-08-08T07:00:00+05:30 IST