ఆర్బీఐ కీలక రేట్లు యథాతథం

ABN , First Publish Date - 2021-12-08T19:10:33+05:30 IST

కీలక వడ్డీ రేట్లు రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా

ఆర్బీఐ కీలక రేట్లు యథాతథం

న్యూఢిల్లీ : కీలక వడ్డీ రేట్లు రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) బుధవారం ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే ఆర్బీఐ ఆరుగురు సభ్యులుగల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఈ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు ఓటు వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు లక్ష్యాన్ని 9.5 శాతంగా ఉంచింది. 


ఆర్బీఐ ద్వైమాసిక విధాన రేట్లను యథాతథంగా కొనసాగించడం ఇది తొమ్మిదోసారి. కోవిడ్-19 కొత్త రూపాంతరం ఒమైక్రాన్ ప్రభావంపై విధాన నిర్ణేతలు అంచనా వేస్తున్న తరుణంలో ఎంపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగుతుంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్), బ్యాంక్ రేట్ కూడా యథాతథంగా 4.25 శాతంగా ఉంటుంది. 


కమర్షియల్ బ్యాంకులు తమ సెక్యూరిటీలను ఆర్బీఐకి విక్రయించి, తీసుకునే రుణంపై వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ఆర్బీఐ తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీని రివర్స్ రెపో రేటు అంటారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ తరుణంలో ఈ వడ్డీ రేట్లు పరపతిని, పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి. 


Updated Date - 2021-12-08T19:10:33+05:30 IST