కీలక పోస్టులు ఖాళీ!

ABN , First Publish Date - 2021-04-06T06:31:19+05:30 IST

జిల్లా కేంద్రంగా ఉన్న కామారెడ్డి డివిజన్‌ లో కీలకమైన అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల పోలీసు, రెవెన్యూ శాఖల్లో పదోన్నతులతో పాటు బదీలీలు చేపట్టినప్పటికీ కామారెడ్డి డివిజన్‌కు మాత్రం అధికారులను ప్రభుత్వం కేటాయించలేదు. మరోవైపు ఈ

కీలక పోస్టులు ఖాళీ!
కామారెడ్డిలోని ఆర్డీవో కార్యాలయం, డీఎస్పీ కార్యాలయం

నెలల తరబడి కామారెడ్డి డివిజన్‌స్థాయి అధికారులను నియమించని ప్రభుత్వం

ఐదున్నర నెలలుగా ఆర్డీవో కరువు 

ప్రభుత్వ భూములు అక్రమంగా కేటాయించారని గత ఆర్డీవో సస్పెన్షన్‌ 

అప్పటి నుంచి ఖాళీగా ఉన్న శాఖ పోస్టు 

ఐపీఎల్‌ బెట్టింగ్‌, అక్రమాస్తులు కూడబెట్టాడనే ఆరోపణలతో గత డీఎస్పీ జైలు పాలు 

నాలుగు నెలలుగా భర్తీ కాని పోస్టు 

ఇటీవల పోలీసు, రెవెన్యూ శాఖలో పదోన్నతులు చేపట్టినా.. కామారెడ్డికి నియమించని పరిస్థితి

ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపని పలువురు అధికారులు 

ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్న వైనం

కామారెడ్డి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంగా ఉన్న కామారెడ్డి డివిజన్‌ లో కీలకమైన అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల పోలీసు, రెవెన్యూ శాఖల్లో పదోన్నతులతో పాటు బదీలీలు చేపట్టినప్పటికీ కామారెడ్డి డివిజన్‌కు మాత్రం అధికారులను ప్రభుత్వం కేటాయించలేదు. మరోవైపు ఈ డివిజన్‌ పరిధిలోని కీలకపోస్టులకు పలువురు అధికారులను ప్రతిపాదించినప్పటికీ.. సదరు శాఖ అధికారులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదనే చర్చ ఆయా శాఖల్లో సాగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన సదరు శాఖలకు చెందిన డివిజన్‌ అధికారులు అవినితీ ఆరోపణలు ఎదుర్కోవడమే ప్రధాన కారణమని తెలుస్తుంది. దీంతో నెలల తరబడి ఈ పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. ఇన్‌చార్జిలతోనే పాలన సాగిస్తున్నారు. ముఖ్యమైన శాఖలకు డివిజన్‌స్థాయి అధికారులు లేకపోవడంతో ఆయా శాఖలలో పనులు ముందుకు సాగడం లేదు.

రెవెన్యూలో కీలక పోస్టు ఖాళీ

జిల్లా రెవెన్యూ శాఖలోని పలు కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జిలే భాద్యతలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా అదనపు కలెక్టర్‌ రెవెన్యూ విభాగానికి సంబంధించి పని చేసిన యాదిరెడ్డికి గత రెండు నెలల క్రితం ప్రభుత్వం పదోన్నతి కల్పించి మార్క్‌ఫెడ్‌కు బదిలీ చేసింది. అప్పటి నుంచి అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ పోస్టు) ఖాళీగానే ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా కొనసాగుతున్న వెంకటేష్‌దోత్రే రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఇన్‌చార్జి బాధ్యతలను చేపడుతూ వస్తున్నారు. ఇక రెవెన్యూలోని పలు కార్యక్రమాలను కలెక్టర్‌ శరత్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో డీఆర్‌వో పోస్టు సైతం గత కొన్ని సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉంది. బాన్స్‌వాడ ఆర్‌డీవో ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా కామారెడ్డి ఆర్‌డీవో పోస్టు సైతం ఐదున్నర నెలలుగా ఖాళీగానే ఉంది. ఇలా జిల్లాలో రెవెన్యూ శాఖలోని పలు కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో భూముల సమస్యలు, భూ సేకరణ ఇతరత్రా అభివృద్ధి పనులు సైతం పెండింగ్‌ పడుతున్నాయి. దీంతో ఆయా శాఖలకు సంబంఽధించిన ప్రభుత్వ కార్యలయాల్లోని ఫైళ్లు ముందుకుసాగడం లేదు.

ఐదున్నర నెలలుగా ఆర్డీవో కరువు

కామారెడ్డి ఆర్డీవో పోస్టు గత ఐదున్నర నెలలుగా ఖాళీగానే ఉంది. దీంతో ఎల్లారెడ్డి ఆర్‌డీవో శ్రీనునాయక్‌ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. కామారెడ్డి ఆర్‌డీవోగా పనిచేసిన నరేందర్‌ గతంలో సంగారెడ్డి జిల్లాలో తహసీలార్‌గా పనిచేస్తున్న సమయంలో భూ రికార్డులకు సంబంధించిన వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గత ఏడాది సెప్టెంబరు నెలలో ఆయనను సస్పెండ్‌ చేశారు. అప్పటి నుంచి ఆర్‌డీవో పోస్టు ఖాళీగానే ఉంది. ఎల్లారెడ్డి ఆర్‌డీఏ ఇన్‌చార్జిగా కొనసాగుతు న్నారు. అదేవిధంగా పూర్తిస్థాయి ఆర్‌డీవో లేకపోవడంతో డివిజన్‌లో వివిధ రెవెన్యూ కార్యక్రమాలకు సంబంధిం చిన సమస్యలు పరిష్కరానికి నోచు కోవడం లేదు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్‌-బీకి సంబం ధించి ఎన్నో సమస్యలు పెండింగ్‌ లో ఉన్నాయి. అలాగే రెవెన్యూ, అటవీ భూముల హద్దుల సమస్యలు పరిష్కరానికి నోచుకోకపోవడంతో అభివృద్ధి పనులకు సైతం ఆటం కం కలుగుతుంది. భూముల రికార్డులు, హద్దుల సమస్యలతో ప్రజావాణికి ఎన్నో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్ట్‌లకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కూడా ఆర్‌డీవో లేకపోవడం ఆటంకంగా మారింది. ప్రభుత్వం వీలైనం త తొందరగా కామారెడ్డి డివిజన్‌కు పూర్తిస్థాయి ఆర్‌డీవోను కేటాయించాలని పలువురు స్థానిక ప్రజలు సైతం కోరుతున్నారు.

నాలుగు నెలలుగా లేని డీఎస్పీ పోస్టు

కామారెడ్డి డీఎస్పీ పోస్టు గత నాలుగు నెలలుగా ఖాళీగానే ఉంది. ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన లక్ష్మీనారాయణ ఏసీబీకి చిక్కి నవంబరులో సస్పెన్షన్‌కు గురయ్యారు. అప్పటి నుంచి ఎల్లారెడ్డి డీఎస్పీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎల్లారెడ్డి నుంచి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. డివిజన్‌ పరిధిలో నేరాల రేటు ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా హత్యలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే భూ తగదాలు పెరిగిపోయాయి. ఈ తగదాలలో హత్యలు, దాడుల వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల భిక్కనూర్‌ సీఐ ఓ హత్య కేసు నిందితుడితో జరిపిన సంభాషణ ఆడి యోలు బయటపడిన వ్యవహారంలో ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో క్రైం బ్రాంచ్‌లో ఉన్న మరో సీఐకి పోస్టింగ్‌ ఇచ్చారు. అయితే డీఎస్పీ లేకపోవడం మూలంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. పోలీస్‌స్టేషన్‌లపై పర్యవేక్షణ లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. ప్రధాన పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉంటున్నా.. భర్తీకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఖాళీలను భర్తీ చేస్తూ.. సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

ఈ పోస్టులకు వచ్చేందుకు అనాసక్తి

జిల్లా కేంద్రంలోని కామారెడ్డి డివిజన్‌ స్థాయి కీలక పోస్టులైన ఆర్‌డీవో, డీఎస్పీ పోస్టులు నెలల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. ఈ పోస్టులకు పలువు రు అఽధికారులు వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదనే వాదన వినిపిస్తుంది. ఇటీవ ల రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో పాటు రెవెన్యూ, పోలీసు శాఖలోనూ భారీగా పదోన్నతులతో పాటు బదిలీల ప్రక్రియ చేపట్టింది. కాని కామారెడ్డి ఆర్‌డీవో, డీఎస్పీ పోస్టులను మాత్రం భర్తీ చేయకపోవడంపై చర్చ సాగుతుంది. ఆయా శాఖల రాష్ట్రస్థాయి అధికారులు కామారెడ్డి ఆర్‌డీవో, డీఎస్పీ పోస్టులకు పలువు రు అధికారులను ప్రతిపాదించినప్పటికీ.. ఇక్కడికి వచ్చేందుకు జంకుతున్నారనే  వాదన ఆయా శాఖలలో వినిపిస్తుంది. కామారెడ్డి డీఎస్పీగా సోమనాధం వస్తున్నారని, గత మూడు నెలల నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ సదరు అధికారి ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని పోలీసు శాఖలో పలు వురు పేర్కొంటున్నారు. కామారెడ్డి ఆర్‌డీవో, డీఎస్పీగా ఇంతకు ముందు పనిచేసి న వారు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్‌ అవడమేకాకుండా, జైలు పాలైన సంఘటనలు ఉండడంతో పలువురు అధికారులు ఇక్కడికి వచ్చేందుకు భయపడుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-04-06T06:31:19+05:30 IST