Abn logo
Jun 22 2021 @ 08:17AM

ఈ ఇద్దరిలో జగన్ కీలక పదవి ఎవరికిస్తారో...!?

  • సీఎంను కలసిన భూమన... 
  • నేడోరేపో చింతల


చిత్తూరు/తిరుపతి : తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తన కుమారుడు అభినయరెడ్డితో సోమవారం మధ్యాహ్నం తాడేపల్లెలో సీఎం జగన్‌ను కలిశారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి అధిష్ఠానం కసరత్తు చేస్తున్న తరుణంలో వీరు జగన్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండేళ్ళ కిందట ప్రభుత్వం ఏర్పడగానే మంత్రివర్గంలో కరుణాకరరెడ్డికి చోటు దక్కుతుందని జిల్లావాసులు భావించారు. వైఎస్‌ కుటుంబంతో ఆయనకున్న అనుబంధం, సాన్నిహిత్యం అటువంటిది. అయితే అవకాశం దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇపుడు టీటీడీ కొత్త పాలకవర్గం ఛైర్మన్‌ పదవికి ఆయన పేరు ప్రచారంలోకి వచ్చినా పలు సమీకరణలు దానికి అడ్డుపడ్డట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కుమారుడితో సహా సీఎంను కలవడం వల్ల వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు కుమారుడు అభినయరెడ్డికి ఉపయోగపడేలా ఏదైనా ప్రోటోకాల్‌ పదవి అభ్యర్థించి వుండొచ్చన్న ప్రచారం తాజాగా మొదలైంది. ఇక పీలేరు వంటి కీలక నియోజకవర్గంలో నల్లారి కుటుంబంతో దీర్ఘకాలంగా పోరాడుతున్న తనకు తగిన గుర్తింపు, గౌరవం దక్కుతుందేమోనని రెండేళ్ళుగా నిరీక్షిస్తున్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నేడోరేపో అధినేతను కలవనున్నారు. ఇపుడు తప్పితే ఇక తనకు అవకాశం దక్కదన్న అభిప్రాయంతో వున్న ఆయన అధినేతను కలసి తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.