Abn logo
Sep 25 2021 @ 01:28AM

నాని మరో‘సారీ!’.. టీడీపీలో చర్చనీయాంశంగా కేశినేని!

భవిష్యత్తులో ఎంపీగా పోటీకి నో

చంద్రబాబును కలిసి చెప్పినట్టు ప్రచారం

కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరం

జోగి రమేశ్‌ వీరంగంపైనా స్పందన నిల్‌

పార్టీ కార్యక్రమాలకు దూరంగా కేశినేని శ్వేత 


విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు. టీడీపీ అధిష్ఠానంపై గతంలో పలుమార్లు అసహనాన్ని వ్యక్తం చేసిన నాని, కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమార్తె, 11వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ కేశినేని శ్వేత కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కొద్ది రోజుల క్రితం పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన నాని.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేసినట్లు తెలిసింది. 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : విజయవాడ ఎంపీ కేశినేని నాని వైఖరి టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. విజయవాడ నగరంలో ఒకప్పుడు తీవ్రంగా ఉన్న గ్రూపుల జోరుకు తన ఎంట్రీతో చెక్‌ పెట్టిన నాని వైఖరి ఇప్పుడు అందుకు భిన్నంగా మారిందనే వాదన వినిపిస్తోంది. టీం టీడీపీ పేరుతో ఒకనాడు అన్ని వర్గాల వారినీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత నానీకి దక్కుతుంది. అలాంటి నేత నేడు పార్టీలో గ్రూపులు ఏర్పడటానికి కారణమవుతున్నారని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 


మున్సిపల్‌ ఎన్నికలకు ముందే ముదిరిన వివాదాలు

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు ముందు నుంచి నగర టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎన్నికల నాటికి అవి మరింత ముదిరాయి. ఎంపీ నాని కుమార్తె శ్వేతను మేయర్‌ అభ్యర్థిగా ప్రచారం చేయడం, ఆ తర్వాత ఆమెను మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీలోని బుద్ధా, బొండా ఉమ వంటి వారిలో అసంతృప్తిని రేకెత్తించింది. మరోవైపు ఒకప్పుడు నానీకి సన్నిహితుడిగా ఉన్న పట్టాభి, నాగుల్‌ మీరా వంటి వారు ఆయనకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో వీఎంసీ ఎన్నికల సమయంలో ఇరువర్గాల నడుమ మాటల యుద్ధాలు జరిగాయి. ఒక దశలో ఎంపీ నానీపై బుద్ధా వెంకన్న, బొండా ఉమ, నాగుల్‌ మీరా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ధ్వజమెత్తారు. ఆ తర్వాత హైకమాండ్‌ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఈ వివాదాల కారణంగా వీఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కుమార్తె శ్వేత కూడా కార్పొరేటర్‌గా విధులు నిర్వహించడం మినహా అంత చురుగ్గా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇటీవల చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ దాడి చేసిన సమయంలో నాని విజయవాడలోనే ఉన్నారు. జిల్లాకు చెందిన ప్రధాన టీడీపీ నాయకులంతా చంద్రబాబు ఇంటికి తరలివెళ్లినా ఆ ఘటనపై ఆయన నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు.


హైకమాండ్‌ తీరుపై అసహనం

నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా కేశినేని నాని, బుద్ధా వర్గం మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో హైకమాండ్‌ వ్యవహరించిన తీరుపట్ల నాని అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. విలేకరుల సమావేశం పెట్టి మరీ తనపై విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకోలేదనే అసంతృప్తిని నాని పలుమార్లు అధిష్ఠానం వద్దే వ్యక్తం చేసినట్లు తెలిసింది. వీఎంసీ ఎన్నికలకు ముందు కూడా బుద్ధా వెంకన్న, నాని మధ్య వివాదం పతాకస్థాయికి చేరింది. ఇద్దరూ పోటాపోటీగా ట్వీట్ల యుద్ధం సాగించారు. అప్పట్లో హైకమాండ్‌ జోక్యం చేసుకుని సర్దుబాటు చేసింది. అయితే ఈ ఘటనల విషయంలో టీడీపీ అధిష్ఠానం తీరు సరిగా లేదన్నది నాని అభిప్రాయంగా ఉందని సమాచారం. ఈ కారణంగానే తన అసంతృప్తిని అధిష్ఠానం వద్ద వెళ్లగక్కి, ఇకపై పోటీ చేయబోనని తెలిపినట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా కూడా కేశినేని నాని తన వద్ద డబ్బు లేదని, పోటీ చేయబోనని చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసి చెప్పారు. అప్పట్లో చంద్రబాబు నాని ప్రతిపాదనను తిరస్కరించడమే కాకుండా తిరిగి పోటీ చేయాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేసి, నాని గెలుపొందారు. మరి ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాలి..!