Abn logo
Sep 23 2021 @ 00:32AM

కేశోరాం కాంట్రాక్టు కార్మికుల యూనియన్‌ ఎన్నికలు ప్రశాంతం

ఎన్నికల్లో గెలుపొందిన సూర సమ్మయ్య, కాల్వ అంజయ్య

- సూర సమ్మయ్య ప్యానల్‌ విజయం 

- 97 శాతం ఓటింగ్‌ నమోదు

పాలకుర్తి, సెప్టెంబర్‌ 22 : మండలంలోని బసంత్‌నగర్‌ కేశోరాం సిమెంట్‌ ఫ్యాక్టరీ కాంట్రాక్టు కార్మికుల యూనియన్‌ ఎన్నికల్లో సూర సమ్మయ్య ప్యానల్‌ విజయం సాధించింది. బుధవారం హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ప్యానల్‌ తరపున పోటీ చేసిన కాల్వ అంజయ్య 22 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 922 ఓట్లకు గాను 915 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఇందులో చెల్లని ఓట్లు 16 ఉన్నట్లు ఎన్నికల అధికారి గుర్తించారు. సూర సమ్మయ్య ప్యానల్‌ నుంచి పోటీ చేసిన కాల్వ అంజయ్యకు 364, టీఆర్‌ఎస్‌ మద్దతుదారుడు బయ్యపు మనోహర్‌రెడ్డి ప్యానల్‌ నుంచి పోటీ చేసిన నగునూరి రమేష్‌కు 342 ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ మద్దతుదారుడు కౌశిక హరి ప్యానల్‌ నుంచి పోటీ చేసిన బీ సత్యనారాయణగౌడ్‌కి 183 ఓట్లు వచ్చాయి. మిగిలిన వారిలో కట్కూరి సురేష్‌కు 8, బొడ్డు రాములుకు 2 ఓట్లు వచ్చాయి. కాంట్రాక్టు కార్మికులు పెద్దఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5.30 వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సాగింది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారి అంబాల పూర్ణచందర్‌ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పెద్దపల్లి సీఐ ప్రదీప్‌ కుమార్‌, ఎస్‌ఐ అర్కటి మహేందర్‌ యాదవ్‌ పర్యవేక్షించారు. ప్రతి రెండేళ్ళకు జరగాల్సిన ఎన్నికలు 5 ఏళ్ళ తర్వాత జరగడంతో 97 శాతం మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ గెలుపు కార్మికులది..

కాంట్రాక్టు కార్మికుల యూనియన్‌ ఎన్నికల్లో గెలుపు తనది కాదని, కార్మికులదని గెలుపొందిన ప్యానల్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర సమ్మయ్య, కాల్వ అంజయ్య అన్నారు. ఫలితాల అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తమ గెలుపు కోసం ప్రయత్నించిన కార్మికు లకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్మికల తరుపు న ఏ సమస్య వచ్చినా పోరాడతానని, కార్మికులకు అండగా ఉంటామన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా కార్మికుల డిమాండ్ల కోసం పోరాడతామన్నారు. కార్మికుల హక్కుల సాధనకు కృషి చేస్తామన్నారు.