ఈ ఫొటోలోని మహిళ ఒకప్పుడు దుబాయ్‌లో రెండు కంపెనీలకు బాస్.. కోట్లలో సంపాదన.. కానీ చివరకిలా..

ABN , First Publish Date - 2021-08-14T18:26:40+05:30 IST

కేరళలోని అలప్పుజాకు చెందిన అనిత తండ్రి ఇస్రో ఉద్యోగి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని దుబాయ్ వెళ్లారు. అక్కడ సొంతంగా ఓ కంపెనీ ప్రారంభించారు. ఈ క్రమంలో అనితకు అలప్పుజాలోని ముథుకులంకు చెందిన బాలుతో వివాహమైంది.

ఈ ఫొటోలోని మహిళ ఒకప్పుడు దుబాయ్‌లో రెండు కంపెనీలకు బాస్.. కోట్లలో సంపాదన.. కానీ చివరకిలా..

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవ్వడమనే నానుడి ఈ భారతీయ మహిళకు సరిగ్గా సరిపోతుంది. దుబాయ్‌లో ఉండే కేరళకు చెందిన అనిత జీవితం ఓ విషాద చిత్రాన్ని ఏమాత్రం తీసిపోదంటే నమ్మండి. అప్పుడప్పుడు మనం వింటుంటాంగా రాత్రికి రాత్రే జీవితం తలకిందులైందని.. ఇదిగో ఇలాగే అనిత జీవితం కూడా ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు దుబాయ్‌లో పలు వ్యాపార సముదాయాలకు యజమానురాలిగా ఓ వెలుగువెలుగుతున్న ఆమె.. అచ్చం సినిమాటిక్ స్టైల్‌లోనే గంటల వ్యవధిలో జైలుపాలైంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే కొన్నేళ్లు జైల్లో గడిచిపోయాయి. ఆ సమయంలో దుబాయ్‌తో పాటు స్వదేశంలో ఉన్న వ్యాపారాలు మూతపడ్డాయి. ఉన్న ఆస్తులు కరిగిపోయాయి. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన స్వదేశానికి రాలేని పరిస్థితి ఆమెది. దీనికి కారణం అనితపై ఉన్న ట్రావెల్ బ్యాన్. ఈ నిషేధం తొలిగిపోవాలంటే ఆమె కొన్ని కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. దేశం కాని దేశంలో అటు కుటుంబానికి దూరమై, ఇటు ఉన్న ఆస్తి పూర్తిగా కరిగిపోయి నిలువ నీడలేకుండా పోయింది అనితకు. దాంతో చేసేమిదేమిలేక బుర్ దుబాయ్‌లోని ఆలయం వద్ద ఓ చెట్టుకింద కొన్ని రోజులు తలదాచుకుంది. ఇక ఆమె గురించి తెలిసిన వారు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన సున్నితంగా తిరస్కరించిందామె. చివరకు దుబాయ్ అధికారులు రంగప్రవేశం చేసి అనితను ఓ సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇంతకు అనిత జీవితంలో ఈ తుఫాన్ లాంటి మార్పు ఎలా వచ్చింది? ఎడారి దేశంలో ఆమె ఇలా ఎలా ఒంటరి అయింది? అప్పటివరకు పలు వ్యాపారాలకు యజమానురాలిగా ఓ వెలుగువెలిగిన ఆమె చివరకు చెట్టుకిందకు వచ్చేంత దారుణంగా ఎలా పడిపోయిందనే విషయాలను తెలుసుకోవాలంటే మనం పూర్తిగా ఆమె కథలోకి వెళ్లాల్సిందే...  


కేరళలోని అలప్పుజాకు చెందిన అనిత తండ్రి ఇస్రో ఉద్యోగి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని దుబాయ్ వెళ్లారు. అక్కడ సొంతంగా ఓ కంపెనీ ప్రారంభించారు. ఈ క్రమంలో అనితకు అలప్పుజాలోని ముథుకులంకు చెందిన బాలుతో వివాహమైంది. అనిత దంపతులు కూడా అక్కడ ఓ సంస్థను నెలకొల్పారు. కొన్నేళ్ల తర్వాత అనిత తండ్రి తిరిగి కేరళకు వచ్చేశారు. ఆ సమయంలో ఆయన కంపెనీ కూడా అనితకు ఇచ్చేశారు. ఇలా అనిత అతి తక్కువ కాలంలోనే రెండు కంపెనీలకు యజమానురాలైంది. అనంతరం కేరళలో కూడా కొన్ని వ్యాపారాలు మొదలెట్టింది. రెండుచోట్ల వ్యాపారాలు లాభదాయంగా నడిచాయి. దాంతో అనతికాలంలోనే ఆమె బాగా సంపాదించింది. కానీ, భర్త బాలు చేసిన చిన్న పొరపాటు ఆమెను పాతాళానికి పడేసింది. ఆమెకు తెలియకుండా బ్యాంకులో బాలు లోన్స్ తీసుకున్నాడు. 


అనంతరం వాటిని చెల్లించకుండా తిరిగి కేరళకు వచ్చేశాడు. భర్త తీసుకున్న లోన్లకు ఆమె హామీదారుగా లేకపోయినప్పటికీ భార్య కావడంతో దుబాయ్ అధికారులు ఆమెపై కేసు నమోదు చేసి, జైలుకు పంపారు. దీంతో దుబాయ్‌లోని అల్ అవిర్, షార్జా జైళ్లలో ఆమె కొన్నేళ్లు ఉండాల్సి వచ్చింది. ఈ లోపు ఇటు దుబాయ్‌తో పాటు అటు స్వదేశంలోని వ్యాపారాలు మూతపడ్డాయి. ఇక ఆమె శిక్షకాలం పూర్తికావడంతో ఇటీవల జైలు నుంచి విడుదలైంది. కానీ, స్వదేశానికి రాలేని పరిస్థితి. ఆమెపై ట్రావెల్ బ్యాన్ ఉండడమే దీనికి కారణం. ఈ నిషేధం తొలిగిపోవాలంటే బ్యాంకు రుణాలు చెల్లించాలి. ఆమెపై మూడు సివిల్ కేసులు కూడా ఉన్నాయి. అంతేగాక అనిత పాస్‌పోర్టు, వీసా గడువు కూడా ముగిశాయి. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన ఆమెకు నిలువ నీడ లేకుండా పోయింది. దాంతో బుర్ దుబాయ్‌లోని ఆలయం బయట ఓ చెట్టు కిందకు చేరింది.   


దీంతో పరాయి దేశంలో ఒంటరి అయిన ఆమెను ఆదుకునేందుకు కొంతమంది ముందుకు వచ్చారు. కానీ, వారి సాయాన్ని ఆమె సున్నితంగా తిరస్కరించారు. అనితకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు దుబాయ్‌లోనే ఉంటున్నాడు. కొడుకు కూడా పలుమార్లు అనిత వద్దకు వచ్చి తనతో పాటు రమ్మని అడిగినా ఆమె వెళ్లలేదు. ఇక అనితకు సంబంధించిన కథ దుబాయ్‌ సోషల్ మీడియా, రేడియో, వార్త పత్రికలో రావడంతో అక్కడి అధికారులు ఆమెను ఓ సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే, అసలు ఆమె ఈ కేసులో ఎలా ఇరుక్కుకున్నారు? అనే విషయంలో స్పష్టత కోసం అక్కడి పోలీసులను సంప్రదించినట్లు ఒర్మా దుబాయ్ ఆఫీస్ ఉద్యోగి షిజు బషీర్ తెలిపారు. ప్రస్తుతం అనితను ఓ సురక్షిత ప్రాంతానికి తరలించామని, ఆమె క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.   

Updated Date - 2021-08-14T18:26:40+05:30 IST