Abn logo
Sep 21 2021 @ 17:08PM

కట్నం తీసుకోబోమని విద్యార్థులతో సంతకం చేయించిన విశ్వవిద్యాలయం

తిరువనంతపురం: కట్నం తీసుకోబోమని డిగ్రీ సర్టిఫికేట్‌ను పొందేముందు కొచ్చిలోని కేరళ విశ్వవిద్యాలయం విద్యార్థులతో అంగీకార పత్రంపై సంతకం చేయించింది. అంగీకార పత్రాన్ని విస్మరించి కట్నం తీసుకుంటే పట్టభద్ర సర్టిఫికేట్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. చేపలు, సముద్ర శాస్త్రాలను అభ్యసించే 386 మంది విద్యార్థులతో ఈ అంగీకార పత్రంలో సంతకం తీసుకుంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్‌కు మొదట ఈ ఆలోచన వచ్చింది. రాష్ట్రంలో కట్నసమస్యలతో మరణించేవారు అధికం కావడంతో ఆయన ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది.


కేరళ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఏమ్‌కే. జయరాజ్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ కట్నం తీసుకోబోమని విద్యార్థులతో సంతకం చేయిస్తే బాగుంటుందని గవర్నర్ సూచించారు. ఈ సూచనకు మేం వెంటనే అంగీకరించాం’’ అని చెప్పారు. ‘‘ నేను కట్నం తీసుకోను. ఒకవేళ తీసుకుంటే విశ్వవిద్యాలయం నా పైన ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు. యూనివర్శిటీ ఇచ్చిన డిగ్రీని కూడా రద్దు చేయవచ్చు ’’ అని డిక్లరేషన్ పత్రంలో ఉంది. విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయం సరైనదే అని కె.రేష్మ అనే స్టూడెంట్ లీడర్ తెలిపారు. కట్నం తీసుకున్నవారి డిగ్రీలను ఎంత త్వరగా రద్దు చేస్తారో చూడాలని ఆమె చెప్పారు.