ఇస్లామిక్ స్టేట్-ఖొరసాన్‌లో చేరిన కేరళవాసి ఆత్మాహుతి దాడిలో మృతి

ABN , First Publish Date - 2022-03-11T16:52:23+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్-ఖొరసాన్ ప్రావిన్స్

ఇస్లామిక్ స్టేట్-ఖొరసాన్‌లో చేరిన కేరళవాసి ఆత్మాహుతి దాడిలో మృతి

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్-ఖొరసాన్ ప్రావిన్స్ ఉగ్రవాద సంస్థలో చేరిన కేరళవాసి మరణించినట్లు ఆ సంస్థకు చెందిన ‘వాయిస్ ఆఫ్ ఖురసాన్’లో ప్రచురించింది. ఇతని పేరు నజీబ్ అల్ హింది అని మాత్రమే పేర్కొంది. 23 ఏళ్ళ ఇంజినీరింగ్ (ఎంటెక్) విద్యార్థి అని, ఆయన భారత్‌కు చెందినవారని మాత్రమే తెలిపింది. 


నజీబ్ ఏ పరిస్థితుల్లో, ఎక్కడ మరణించాడో వివరించలేదు. అయితే నజీబ్ ఆత్మాహుతి దాడిలో మరణించినట్లు ఈ వ్యాసం ద్వారా తెలుస్తోంది.  ప్రాఫెట్ మహమ్మద్ అనుచరుల్లో ఒకరైన హంజలా ఇబ్న్ అబి అమిర్‌తో నజీబ్‌ను ఈ ఉగ్రవాద సంస్థ ఈ వ్యాసంలో పోల్చింది. నజీబ్ ఓ పాకిస్థానీ మహిళను పెళ్లి చేసుకున్న కొద్ది గంటలకే మరణించాడని పేర్కొంది. హంజలా కూడా తన పెళ్లినాటి రాత్రి యుద్ధ రంగంలోకి వెళ్లి మరణించాడని తెలిపింది. 


ఇస్లామిక్ స్టేట్-ఖొరసాన్ ప్రావిన్స్ ఆఫ్ఘనిస్థాన్‌లో ఉంది. ఖొరసాన్ అనే ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడికి నజీబ్ తనంతట తాను భారత దేశం నుంచి వచ్చాడని ఈ వ్యాసంలో తెలిపింది. ఆ రోజుల్లో హిజ్రా చేయడం చాలా కష్టమైందని పేర్కొంది. ఆయన తన సొంత ప్రాంతం నుంచి వచ్చిన ఇతర యోధులను కలిశాడని, గెస్ట్ రూమ్‌లో బ్యాచిలర్‌గా ఉండేవాడని తెలిపింది. ఆయన చాలా ప్రశాంతంగా ఉండేవాడని, అవసరమైనపుడు మాత్రమే మాట్లాడేవాడని తెలిపింది. ఎల్లప్పుడూ ముఖంపై చిరునవ్వు చెదిరేది కాదని పేర్కొంది. పర్వత ప్రాంతాల్లో జీవించడంలో ఎదురయ్యే కష్టాల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేసేవాడు కాదని, ఆయన మనసులో ఎల్లప్పుడూ ఇస్లామిక్ ప్రమాణం గురించి మాత్రమే ఆలోచించేవాడని తెలిపింది. కొన్ని నెలల తర్వాత నజీబ్ స్నేహితులు పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టారని, ఆ తర్వాత ఓ పాకిస్థానీ కుటుంబం ఆయనను సంప్రదించిందని తెలిపింది. ఆ యువతి కూడా తమ సంస్థలోనే ఉందని తెలిపింది. 


నజీబ్ ఆ యువతిని పెళ్లి చేసుకునే రోజున అవిశ్వాసులు తమ ప్రాంతంలోకి వచ్చారని, బాంబులు వేయడం ప్రారంభించారని తెలిపింది. తాను ఆత్మాహుతి దాడికి వెళ్తానని నజీబ్ చెప్పాడని, అందుకు ఆ యువతి కుటుంబీకులు అంగీకరించలేదని తెలిపింది. ఆమె తండ్రి బలవంతం మేరకు నజీబ్ ఆ యువతిని వివాహం చేసుకున్నట్లు తెలిపింది. అనంతరం ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ ప్రావిన్స్ సభ్యుడొకరు వచ్చి, యుద్ధం కోసం తనకు ఆత్మాహుతి దాడి చేసేవారు కావాలని అడిగారని తెలిపింది. యుద్ధ రంగానికి వెళ్ళడానికి నజీబ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు పేర్కొంది. పోరాడుతూ నజీబ్ ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది. 



Updated Date - 2022-03-11T16:52:23+05:30 IST